జమిలి సంకేతాలు కనిపిస్తున్నాయి!

Thu Jul 12 2018 13:34:11 GMT+0530 (IST)

షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు ఇంకా దాదాపు తొమ్మిది నెలలు సమయం ఉన్నప్పటికీ..దేశంలో ఎన్నికల ఫీవర్ వచ్చేసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఒకేసారి లోక్ సభ - అసెంబ్లిలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటంతో ఈ పరిణామం కనిపిస్తోంది. అయితే ఇది కేవలం చర్చలకు పరిమితమా?  నిజంగా కార్యాచరణ ఉంటుందా? అనే చర్చ కూడా పలు వర్గాల్లో ఉంది. కానీ జమిలి ఎన్నికల విషయంలో వేగం పెంచింది. జమిలి ఎన్నికలకు వీలుగా ముందస్తు ఎలక్షన్లు తప్పదేమోననే సంకేతాలకు బలం చేకూరుతోంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ బుధవారం హైదరాబాద్ లో పర్యటించడం ఈ పరిణామాన్ని అవుననే రీతిలోనే చాటిచెప్తోంది.తెలంగాణ ఎన్నికల సంఘం సీఇవో రజత్ కుమార్ - ఏపీ ఎన్నికల సంఘం అధికారి ఆర్ పి సిసోడియాతో సమావే శమై అసెంబ్లి - లోక్ సభకు సాధారణ ఎన్నికల నిర్వహణపై సమీక్షించడంతో ముందస్తు జమిలి ఖాయమంటున్నారు.ఇటీవల లా కమిషన్ అభిప్రాయాలు స్వీకరించిన సమయంలో ప్రతీసారి 4నుంచి 6 నెలల సుధీర్ఘసమయం ఎన్నికలకే సరిపోవడంతో అభివృద్ధి పథకాలపై దీని ప్రభావం పడుతోందని చాలా రాష్ట్రాలు కేంద్రానికి నివేదించాయి. దీంతో ప్రజా సంక్షేమం విస్మరించబడుతోందని ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కారణంగా జాప్యం ఎదురవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో కొన్ని పార్టీలు ముందస్తు జమిలీని వ్యతిరేకించాయి. అయితే లోక్ సభ - అసెంబ్లీ ఎన్నికలను విడివిడిగా జరపడం వల్ల అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఆటంకాలు - ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే అధికార యంత్రాంగం పడే పాట్లు వృధా అవుతున్న ప్రజాధనాలను కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు వివరించింది. ఈ పరిణామాలు ఇలా ఉండగానే...కేంద్రం ఎన్నికల సంఘం రాష్ట్రాల్లో పర్యటించి జమిలి ఎన్నికలకు రాష్ట్రాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది.

ఈ పరిణామం ఇలా ఉండగానే..భారత ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసతో పాటు డిప్యుటీ ఎన్నికల అధికారి సుదీప్ జైన్ హైదరాబాద్ లో పర్యటించారు.  దేశానికి అవసరమయ్యే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు(ఈవీఎం) లను ఈసిఐఎల్ అందిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు ఉన్నతాధికారులు ఈసిఐఎల్ కు చేరుకుని ఎన్నికల సరంజామాపై సమీక్షించారు. ఆ తర్వాత ఇరు తెలుగు రాష్ట్రాల ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. దేశమంతటా చర్చ జరుగుతున్నట్లుగా ఏక కాలంలో ఎన్నికల నిర్వహణతో జాప్యాన్ని నివారించి ప్రజలకు మెరుగైన ఎన్నికల దిశగా కేంద్ర ఎన్నికల సంఘం అధ్యయనం జరుపుతోందని చెప్పినట్లు తెలిసింది.కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరిన వెంటనే అందుకు అనువుగా  ఎన్నికలకు అవసరమయ్యే ఈవీఎంలు వివిపీఏటిల ప్రస్తత పరిస్థితులను ఆయన అధ్యయనం చేసేందుకు రావడంతో ఎన్నికల నిర్వహణకు జరు గుతున్న కసరత్తును ఈ చర్య ధృవీకరించినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.అయితే ఒకవైపు ముందస్తు జమిలీ ఎన్నికల నిర్వహ ణపై జాతీయస్థాయి లో చర్చ జరుగుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల రాక ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా  దేశంలో 1952నుంచి 1968 వరకు లోక్‌సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు రావడంతో షెడ్యూల్‌లో మార్పులు వచ్చాయి. దీంతో రాష్ట్రాల్లో ఒక్కో సమయంలో లోక్‌సభకు మరోసారి ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే ఉమ్మడి ఏపీలో 1999 - 2004 - 2014లలో జమిలీ ఎన్నికలు జరిగాయి.