సుప్రీం దెబ్బకు యోగి.. మాయాలపై ఈసీ బ్యాన్

Mon Apr 15 2019 16:56:25 GMT+0530 (IST)

తప్పు మీద తప్పులు. విమర్శలు మీద విమర్శలు. ఆరోపణల మీద ఆరోపణలతో.. గతంలో ఎప్పుడూ లేని రీతిలో కేంద్ర ఎన్నికల సంఘం విమర్శలు ఎదుర్కోవటం తెలిసిందే. పార్టీలు..  పార్టీ నేతలు అదే పనిగా తప్పు చేస్తున్నా.. కేంద్ర ఎన్నికల సంఘం విషయాల్ని సీరియస్ గా తీసుకోవటం లేదన్న మాట తరచూ వినిపిస్తోంది. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్న వేళలో సుప్రీంకోర్టు సైతం ఈసీ తీరును తప్పు పట్టింది. మీకున్న అధికారులు ఏమిటో తెలుసా? అంటూ ప్రశ్నించింది కూడా.తప్పుల విషయంలో రియాక్ట్ కాకుంటే.. కేంద్ర ఎన్నికల సంఘం కమిషన్ సుప్రీంకు హాజరు కావాలంటూ చేసిన వ్యాఖ్యలు కేంద్ర ఎన్నికల సంఘంలో చలనం తెచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో అదే పనిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. బీఎస్పీ అధినేత్రి మాయావతిల ప్రచారంపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది.

యోగిపై 72 గంటల నిషేధాన్ని.. మాయావతిపై 48 గంటల బ్యాన్ ను విధించింది. తాజా ఆదేశాల ప్రకారం యోగి మూడు రోజుల పాటు.. మాయావతి రెండు రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాల్సి ఉంటుంది.  ఈసందర్భంగా వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. వీరిపై నిషేధం రేపు (మంగళవారం) ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి రానుంది.

ఇటీవల యూపీ సీఎం యోగి మాట్లాడుతూ.. మీకు అలీ ఉంటే.. మాకు భజరంగ్ బలి ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇది హిందూ.. ముస్లింల మధ్య విభేదాలు సృష్టించటమేనని ఈసీకి ఫిర్యాదులు వెళ్‌లాయి. ఇదిలా ఉంటే.. మాయా మాట్లాడుతూ.. మతం ప్రాతిపదికగా తీసుకొని బీజేపీ టికెట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు వ్యాఖ్యలు కలకలం రేపగా.. యోగి వ్యాఖ్ల్యల్ని ఉద్దేశించి మాయా మాట్లాడిన మాట మరింత వివాదంగా మారింది.

ఓటేసేటప్పుడు అలీ.. భజరంగ్ బలి అంటూ యోగి చేసిన వ్యాఖ్యను గుర్తు పెట్టుకొని మరీ ఓటు వేయాలని మాయావతి కోరారు. ఈ వ్యాఖ్య వివాదాస్పదంగా మారింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నేతల ఎన్నికల ప్రచారంపై నిషేధాన్ని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవటం ఇదే తొలిసారి. ఇలా వేటు పడిన వారిలో ఒకరు దేశంలోనే అది పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే.. మరొకరు ఆ రాష్ట్రంలో పెద్ద పార్టీకి అధినేత్రి కావటం గమనార్హం.