ఏపీలో పోలింగ్ ఎందుకింత ఆలస్యమైంది?

Fri Apr 12 2019 10:35:12 GMT+0530 (IST)

ఏపీలో పోలింగ్ ఎందుకంత ఆలస్యంగా సాగింది. ఉదయం మొదలైన పోలింగ్ అర్థరాత్రి దాటిన తర్వాత కూడా సాగటం వెనుక అసలు కారణం ఏమిటి? దీనికి బాధ్యులు ఎవరు? అన్నది చూస్తే.. వేళ్లు అన్ని ఎన్నికల సంఘం వైపే చూపిస్తాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రాధమిక లెక్కలు మిస్ కావటం కూడా ఇన్నేసి గంటల పోలింగ్ కు కారణంగా చెప్పాలి.పోలింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన వీవి ప్యాట్లు పని చేయకపోవటం.. వాటికి రిపేర్లు చేయటం లాంటివి.. కొన్నిచోట్ల మార్చటం లాంటివి జరగటం ఒక కారణం. వీవి ప్యాట్లకు సంబంధించిన సాంకేతిక సమస్యలన్ని ఈసీనే బాధ్యత వహించాలి. ఇక.. పోలింగ్ కు సంబంధించి వేసిన లెక్కలో పొరపాటు కూడా సుదీర్ఘంగా పోలింగ్ సాగటానికి కారణంగా చెప్పాలి.

లాజిక్ మిస్ అయిన ఎన్నికల సంఘం అధికారుల తప్పులతో ఏపీలో చోటు చేసుకున్న పరిస్థితి కారణం. ఈవీఎంల ద్వారా ఓటింగ్ అంటే.. ఒక ఓటు వేయటానికి తక్కువలో తక్కువ 15 సెకన్లు పట్టే పరిస్థితి. అదెలానంటే.. ఒక ఓటు వేసిన తర్వాత వీవి ప్యాట్లలో మనం వేసిన ఓటు పడిందా?  లేదా?  అన్నది చూసుకోవటానికి 7సెకన్ల సమయం ఉంటుంది. అంటే.. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఈ ఏడు సెకన్లు తప్పనిసరి. ఏపీలో అసెంబ్లీతో పాటు.. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి.

అంటే.. రెండు ఓట్లకు వీవి ప్యాట్లలో వేసిన ఓట్లు చూసుకోవటానికి పట్టే సమయమే 14 సెకన్లు. ఓటు వేయటం.. మిగిలివన్నీ మరో పది సెకన్లు వేసుకుందాం. ఓటు వేయటానికి ప్రాసెస్ ను ఆరు సెకన్లు అనుకుందాం. వాస్తవానికి ఇది మరింత ఉంటుంది. ఇలా చూస్తే.. ఒక ఓటరు ఓటు వేయటానికి పట్టే సమయం 30 సెకన్లు. అది కూడా ఎక్కడా ఎలాంటి అవాంతరం జరగకుండా ఉంటే. గ్రామీణ ప్రాంతాల వారు.. ఓటు వేసే తీరుపై అవగాహన లేని వారి విషయంలో నిమిషం ఖాయంగా పడుతుంది. అంటే.. ఒక బూత్ లో గంటకు 60 ఓట్లు మాత్రమే పడే వీలుంది. ఒకవేళ 30 సెకన్లకు ఒక ఓటు అనుకున్నా.. గంటకు 120 ఓట్లు మాత్రమే పోలవుతాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు అంటే.. 11 గంటలు. నాన్ స్టాప్ గా పోలింగ్ సాగితే.. 11 గంటలను 120తో హెచ్చవేస్తే.. 1320 ఓట్లు పడతాయి.

ఇదంతా ఎప్పుడూ అంటే.. రోబోటిక్ ఫార్మాట్ లో. అదేనండి.. ఇంట్లో స్విచ్ వేసిన వెంటనే లైటు వెలగటం ఉంది చూశారా?  అలా అన్న మాట. కానీ.. మెషిన్లకు.. మనుషులకు మధ్య తేడా తెలిసిందేగా. ఏ ఇద్దరు ఒకేలా ఉండరు. ఇక.. ఓట్లు వేయటానికి వచ్చే వారిలో యువత నుంచి పెద్ద వయస్కుల వారు ఉంటారు. అందరూ ఒకే వేగంతో ఓటు వేయలేరు. ఇందాక వేసిన లెక్కను వాస్తవ రూపంలో చూసినప్పుడు.. ఒక మనిషి ఓటు వేయటానికి ఒక నిమిషం నుంచి ఒకటిన్నర నిమిషం పడుతుంది.

అంటే.. గంటకు గరిష్ఠంగా 60 నుంచి కనిష్ఠంగా 40 ఓట్లు వేసే వీలుంది.గరిష్ఠాన్ని లెక్కలోకి తీసుకుంటే.. 11 గంటల పాటు నాన్ స్టాప్ గా ఓట్లు వేస్తే.. 660 ఓట్లు మాత్రమే పోలయ్యే అవకాశం ఉంది. వాస్తవంగా చూస్తే.. ఏపీలోని చాలా బూత్ లలో 1100 నుంచి 1400 వరకూ ఓట్లు ఉన్నాయి. వీటిల్లో 80 శాతం అంటే.. 880 నుంచి 1120 ఓట్లు పోలైనట్లు. ఈసీ ఇచ్చిన సమయంలో 660 ఓట్లు పోలయ్యే అవకాశం ఉన్నప్పుడు.. 880 నుంచి 1120 ఓట్లు పోల్ కావటానికి మరెంత సమయం పడుతుంది?  దీనికి తోడు ఈవీఎంలు మొరాయించిన సమయాన్ని లెక్కేస్తే.. పోలింగ్ ఆలస్యానికి కారణం ఇట్టే అర్థం కాక మానదు. ఈ మొత్తాన్ని చూసినప్పుడు ఓట్లు వేసే విషయంలో ఓటరు తీసుకునే సమయాన్ని లెక్కించే విషయంలో ఈసీ వేసిన పిచ్చి లెక్కలతోనే ఓటర్లు ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చిందని చెప్పక తప్పదు.