Begin typing your search above and press return to search.

మోదీ - షా ల‌కు ఈసీ షాక్!

By:  Tupaki Desk   |   14 Aug 2018 12:21 PM GMT
మోదీ - షా ల‌కు ఈసీ షాక్!
X
‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ నినాదంతో జమిలి ఎన్నికల కోసం బీజేపీ గ‌ట్టిగా ప‌ట్టుబ‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. సంవత్సరం పొడవునా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున ఎక్కువ శాతం అధికారులు ఎన్నికల డ్యూటీలో గడపాల్సి వ‌స్తోంద‌ని - దాంతో అభివృద్ధి కుంటుప‌డుతోంద‌ని బీజేపీ అభిప్రాయ‌ప‌డింది. దాంతోపాటు ఎన్నికల ఖర్చుకూడా పెరిగిపోతోంద‌ని తెలిపింది. ఈ ప్రకారం లా క‌మిష‌న్ కు బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్‌ షా సోమ‌వారం నాడు 8 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఈ నేప‌థ్యంలో - ప్ర‌ధాని మోదీ - షాల‌కు భార‌త ఎన్నిక‌ల సంఘం షాకిచ్చింది. స‌మీప భ‌విష్య‌త్తులో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు తమ వద్ద లేవని ఈసీ తేల్చి చెప్పేసింది. 2019లో లోక్‌ సభ - అసెంబ్లీల‌కు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సరిపడినన్ని వీవీపీఏటీలు త‌మ ద‌గ్గ‌ర లేవ‌ని భార‌త ఎన్నికల సంఘం చీఫ్ ఓపీ రావత్ పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై తుది నిర్ణ‌యాన్ని రెండు లేదా మూడు నెలల్లోపు ప్రకటిస్తామని ఆయ‌న తెలిపారు.

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని రావ‌త్ స్పష్టం చేశారు. ఒకేసారి ఎన్నిక‌ల‌కోసం....శాసనసభల గడువు తగ్గించడం లేదా పెంచడం చేయాలని, అందుకు రాజ్యాంగ సవరణ అవసరమ‌ని అన్నారు. అలా స‌వ‌ర‌ణ చేయాలంటే న్యాయపర‌మైన చిక్కులు ఎదుర‌వుతాయ‌ని, వాటిని ప‌రిష్క‌రించ‌డానికి సమయం పడుతుంద‌ని అన్నారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు స‌రిపడా పోలీస్‌, పోలింగ్‌ సిబ్బంది అవసరమ‌న్నారు. అంతేకాకుండా, జ‌మిలి నిర్వ‌హించేందుకు అవ‌స‌ర‌మైన‌న్ని వీవీప్యాట్‌ యంత్రాలు అందుబాటులో లేవ‌న్నారు. 2019లో జ‌ర‌గ‌నున్న సాధార‌ణ‌ ఎన్నికల కోసం ఈసీ...ఎల‌క్ట్రానిక్ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎం), వీవీప్యాట్‌ యంత్రాలను సిద్ధం చేస్తోంది. 13.95లక్షల బ్యాలెట్‌ యూనిట్స్‌ - 9.3లక్షల కంట్రోల్‌ యూనిట్స్‌ సెప్టెంబరు 30 నాటికి అందుబాటులోకి రానున్నాయ‌ని - 16.15లక్షల వీవీప్యాట్‌ లు నవంబరు నెలాఖరుకు అందుబాటులోకి వస్తాయని రావత్ తెలిపారు. వీటికితోడుగా - కొన్ని స్టాండ్ బై వీవీప్యాట్‌ లను సిద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ లోక్‌ సభ - రాష్ట్రాల అసెంబ్లీల‌కు ఒకేసారి జ‌మిలి ఎన్నికలు నిర్వహించాలంటే దాదాపుగా 34ల‌క్ష‌ల బ్యాలెట్ యూనిట్స్ - 26 ల‌క్ష‌ల కంట్రోల్ యూనిట్స్ - 27ల‌క్ష‌ల వీవీ ప్యాట్ లు కావాల్సి ఉంటుంద‌ని అంచ‌నా. అయితే, ప్ర‌స్తుతం ఉన్న‌వాటికి అద‌నంగా ఈవీఎం - వీవీ ప్యాట్ లు త‌యారు చేయ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుందని, దానికి సంబంధించిన‌ న్యాయ‌ప‌ర‌మైన ప్ర‌క్రియ పూర్త‌యిన త‌ర్వాతే త‌యారీ సాధ్య‌మ‌ని తెలుస్తోంది.