Begin typing your search above and press return to search.

జేసీకి క్లీన్ చిట్... ఎలా బయటపడ్డారంటే?

By:  Tupaki Desk   |   20 May 2019 4:18 AM GMT
జేసీకి క్లీన్ చిట్... ఎలా బయటపడ్డారంటే?
X
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సందర్భంగా ఏపీలో నేతల నోట మాటల తూటాలు పేలాయి. ఎన్నికల బరిలో ఉన్న నేతలు తమదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తే... పోటీ నుంచి విరమించుకుని వారసుడిని రంగంలోకి దించిన సీనియర్ నేత - అనంతపురం సిట్టింగ్ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అంతకంటే కూడా కాస్తంత మోతాదు ఎక్కువ కలిగిన వ్యాఖ్యలు చేస్తూ అడ్డంగా బుక్కైపోయారన్న విషయం తెలిసిందే. తన కుమారుడితో పాటు సోదరుడి కుమారుడిని కూడా గెలిపించుకునేందుకు జేసీ బ్రదర్స్ ఇద్దరూ శక్తికి మించి శ్రమించారు.

పోలింగ్ ముగియగానే... చంద్రబాబు నిర్వహించిన సమీక్ష కోసమంటూ అమరావతికి వచ్చిన జేసీ.. తమ వారసుల గెలుపు కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు వెళ్లగా.. ఈసీ కూడా జేసీపై చర్యలకు ఆదేశాలు జారీ చేస్తూ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నివేదికను అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అనంతపురం జిల్లా రిటర్నింగ్ అధికారి - తాడిపత్రి రిటర్నింగ్ అధికారి దీనిపై విచారణ చేశారు. జేపీ చేసిన తప్పేమీ లేదని - ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదని తేల్చేశారు.

అయినా కోట్లు ఖర్చు పెట్టామంటూ చేసిన వ్యాఖ్యల వివాదం నుంచి జేసీ ఎలా బయటపడ్డారంటే.... జేసీ అసలు పోటీ చేయలేదు కదా. తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లుగా ప్రకటించిన జేసీ బ్రదర్స్... వారి తరఫున వారి వారసులను బరిలోకి దింపారు కదా. ఈ లెక్కన పోటీ చేయని అభ్యర్థి చేసిన వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని విచారణాధికారులు తేల్చారట. ఈ నివేదికతో ఏకీభవించిన ఈసీ... జేసీకి క్లీన్ చిట్ ఇచ్చేసిందట. సో... జేసీకి ఇక ఇబ్బందేమీ లేదన్న మాట.