Begin typing your search above and press return to search.

4 రాష్ట్రాల కంటే ముందే తెలంగాణ‌లో ఎన్నిక‌లు?

By:  Tupaki Desk   |   9 Sep 2018 5:01 AM GMT
4 రాష్ట్రాల కంటే ముందే తెలంగాణ‌లో ఎన్నిక‌లు?
X
మీరు అన‌వ‌స‌రంగా ఊహించ‌మాకండి.. ఆగ‌మాగ‌మైపోకండి.. నాకున్న నాలెడ్జ్ ప్ర‌కారం అంటూ తెలంగాణ అప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా మారిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే మీడియాను ఉద్దేశించి కేసీఆర్ చేసిన ఎన్నిక‌ల షెడ్యూల్ వ్యాఖ్య‌లు ఎంత‌టి సంచ‌ల‌నాన్ని సృష్టించాయో తెలిసిందే. ఏఅధినేత వ్య‌వ‌హ‌రించ‌ని రీతిలో ఎన్నిక‌ల షెడ్యూల్ ఇలా ఉండొచ్చ‌న్న మాట‌ను చెప్పిన ఆయ‌న తీరును ప‌లువురు త‌ప్పుప‌ట్టారు.

చివ‌ర‌కు కేంద్ర ఎన్నికల‌ సంఘం సైతం కేసీఆర్ తీరు స‌రికాద‌ని పేర్కొన‌టంతో పాటు. షెడ్యూల్ ను వెల్ల‌డించే ప‌ని త‌మ‌ద‌ని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే.. తాజాగా చోటుచేసుకున్న ప‌రిణామాలు చూస్తే.. కేసీఆర్ కోరుకున్న దానికంటే ముందే.. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అంతేకాదు.. నాలుగు రాష్ట్రాల‌తో క‌లిసి ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌న్న దానికి భిన్నంగా.. అంత‌కు ముందే తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించే దిశ‌గా ఎన్నిక‌ల సంఘం క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

అక్టోబ‌రు రెండో వారంలో.. అందునా 10 తేదీ త‌ర్వాత ఎప్పుడైనా ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. అప్ప‌టి నుంచి 45 రోజులు అంటే.. న‌వంబ‌రు చివ‌ర్లో పోలింగ్ జ‌రుగుతుంద‌న్న సంకేతాలు వెలువ‌డుతున్నాయి. దీనికి త‌గ్గ‌ట్లే ఎన్నిక‌ల క‌మిష‌న్ త‌న స‌న్నాహాల్ని వేగ‌వంతం చేయ‌టం గ‌మ‌నార్హం. నాలుగు రోజుల్లోనే ఓటింగ్ యంత్రాలు రానుండ‌టం.. రాష్ట్రంలోని ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ గ‌డువును కూడా ఈసీ కుదించ‌టం.. ఈ నెల ప‌దో తేదీనే ఓట‌ర్ల జాబితా ముసాయిదాను విడుద‌ల చేయ‌నుంది.

అదే స‌మ‌యంలో అక్టోబ‌రు 8 నాటికి ఓట‌ర్ల తుది జాబితా సిద్ధ‌మ‌వుతుంద‌ని ఈసీ ప్ర‌క‌టించిన వైనం చూస్తే. . ముందుగా అనుకున్న దానికి భిన్నంగా వీలైనంత త్వ‌ర‌గా.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లతో సంబంధం లేకుండా అసెంబ్లీ ఎన్నిక‌ల్ని నిర్వ‌హించాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో తెలంగాణ ఓట‌ర్ల జాబితానుఎన్నిక‌ల సంఘం ఫైన‌ల్ చేయ‌నుంది.

ఈ ఏడాది జ‌న‌వ‌రి ఒక‌టి నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటుహ‌క్కు పొందే వీలుంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 2.61 ఓట్లు ఉండ‌గా.. కొత్త చేరిక‌ల‌తో ఈ జాబితా పెరిగే వీలుంద‌ని చెబుతున్నారు. ముందుగా అనుకున్న మాదిరిలా కాకుండా నాలుగు రాష్ట్రాల‌తో సంబంధం లేకుండా ముందే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఈసీ భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఏ రాష్ట్రంలో అయినా గ‌డువు కంటే ముందే అసెంబ్లీ ర‌ద్దు అయితే.. ఎన్నిక‌ల్ని ముందుగా నిర్వ‌హించేందుకు ప్రాధాన్య‌త ఇస్తుంటారని చెబుతున్నారు. ఈ కార‌ణంతోనే తెలంగాణ‌లో ముందుగా ఎన్నిక‌లు నిర్వ‌హించి.. ఆ త‌ర్వాత మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉంటాయ‌ని భావిస్తున్నారు.

కాల‌ప‌రిమితి కంటే ముందే అసెంబ్లీ ర‌ద్దు అయితే.. అలాంటి రాష్ట్రంలో ఎన్నిక‌లు నిర్వ‌హించ‌టానికి ముందుగా ప్రాధాన్య‌త ఇవ్వాల‌న్న సుప్రీం ఆదేశాలు కూడా ఈసీ ఈ విధ‌మైన నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టానికి కార‌ణంగా చెబుతున్నారు. సో.. కేసీఆర్ అంచ‌నాల‌కు కాస్త భిన్నంగా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.