Begin typing your search above and press return to search.

ఈ దంపతుల పరిస్థితి.. కంటతడి పెట్టిస్తుంది!

By:  Tupaki Desk   |   27 Aug 2016 9:30 AM GMT
ఈ దంపతుల పరిస్థితి.. కంటతడి పెట్టిస్తుంది!
X
అన్ని బంధాల్లోనూ వివాహ బంధం చాలా గొప్ప‌ది. ఏ మ‌నిషి జీవితంలోనూ చివ‌ర‌కంటూ తోడు వ‌చ్చేది ఒక్క జీవిత భాగ‌స్వామి మాత్ర‌మే. ఎక్క‌డో పుట్టి - ఇంకెక్క‌డో పెరిగి - భిన్న నేప‌థ్యాలో ఉన్న ఇద్ద‌రు ఒక‌టై జీవితాంతం క‌లిసి ఉండాలంటే.. ఆ జంట మ‌ధ్య ప్రేమ కావాలి. ఒక‌రిని ఒక‌రు అర్థం చేసుకోవాలి. ఆరాధించుకోవాలి. క‌ష్టాల్లోనూ సుఖాల్లోనూ తోడుగా నిల‌వాలి! కొంత‌మంది దంప‌తుల‌ను చూస్తుంటే... వివాహం గొప్ప‌త‌నం అర్థ‌మౌతుంది. వారి ప్రేమ‌లోని మాధుర్యం ప‌రిచ‌యం అవుతుంది. అలాంటి ఒక వృద్ధ జంటకు చెందిన ఓ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో అంద‌రికీ ఆక‌ర్షిస్తున్నాయి.

లండ‌న్‌కు చెందిన వాల్‌ ఫ్ర‌మ్ గోట్స్ (83) - అనిత (81)... ఈ వృద్ధదంప‌తులు ఒక‌రి చేతులు ఒక‌రు ప‌ట్టుకుని క‌ళ్ల‌నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాన్ని వారి మ‌న‌వ‌రాలు ఫొటో తీశారు. దాన్ని బంధుమిత్రుల కోసం సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఆ చిత్రం చూసిన‌వారంద‌రికీ క‌ళ్లు చెమ‌ర్చుతున్నాయి. అంతేకాదు - ఆ చిత్రం ఏ సంద‌ర్భంలో చిత్రీక‌రించారో తెలిసిస్తే.. మ‌న‌సు క‌రిగిపోతుంది.

గోట్స్‌ - అనిత తొలిసారిగా 1954లో క‌లుసుకున్నారు. ప‌రిచ‌యం ప్రేమ‌గా మారడంతో జ‌ర్మ‌నీలో వివాహం చేసుకున్నారు. అక్క‌డి నుంచి కెన‌డాకు వ‌ల‌స వెళ్లిపోయారు. దాదాపు 60 సంవ‌త్స‌రాల‌పాటు అక్క‌డే ఉన్నారు. జీవిత‌మంతా హాయిగా గ‌డిచింది. కానీ, వ‌య‌సు మీద ప‌డుతున్న కొద్దీ గోట్స్‌ కు మ‌తిస్థిమితం త‌ప్పింది. అంతా మ‌ర‌చిపోయాడు! దాంతో ఆయ‌న్ని ఒక న‌ర్సింగ్ హోమ్ లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. అత‌డి భార్య‌కు కూడా ఆరోగ్య స‌మ‌స్య‌తో వేరే హాస్పిట‌ల్ లో ఉంచి చికిత్స‌ చేయిస్తున్నారు. ఇద్ద‌రూ రెండు ర‌కాల స‌మ‌స్య‌ల‌తో చికిత్స‌లు పొందుతూ ఉన్నా... ఎడ‌బాటును త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేని ప‌రిస్థితి. కానీ, చికిత్స కోసం వారిని వేరుగా ఉంచాల్సి వ‌స్తోంది.

అయితే, వీరి మాన‌సిక ప‌రిస్థితి అర్థం చేసుకుని, ఇద్ద‌రికీ ఒక‌చోటికి తీసుకొచ్చారు. ఒక‌రిని ఒక‌రు చూసుకోగానే ఇద్ద‌రూ భావేద్వేగాల‌కు లోన‌య్యారు. ఒకరికి చేతులు ఒక‌రు ప‌ట్టుకుని క‌న్నీరు పెట్టుకున్నారు. ఈ దృశ్యాన్ని చూస్తున్న మ‌న‌రాలికి క‌ళ్లు చెమ‌ర్చాయి. వెంట‌నే ఒక ఫొటో తీసిందామె. ఆ చిత్ర‌మే ఇది. ఆయ‌న‌కి మ‌తిమ‌రుపు ఉండొచ్చు... కానీ, మ‌న‌సుంది! ఆమెకి ఆరోగ్యం క్షీణించ‌వ‌చ్చు... కానీ, ప్రేమ ఉంది. ఇంకెన్నాళ్లు బ‌తుకుతారో తెలీదు. కానీ, బ‌తికినంత‌కాలం ఒక‌రిని ఒక‌రు చూస్తూ బ‌త‌కాల‌ని ఈ వృద్ధ జంట కోరుకుంటోంది. ప్రేమంటే ఇదే క‌దా! వివాహ బంధం గొప్ప‌ద‌నం ఇదేక‌దా.