Begin typing your search above and press return to search.

ఏపీలో అధికారాన్ని తేల్చేది ఈస్ట్ - వెస్ట్

By:  Tupaki Desk   |   12 April 2019 5:29 AM GMT
ఏపీలో అధికారాన్ని తేల్చేది ఈస్ట్ - వెస్ట్
X
ఏపీలో భారీగా పోలింగ్ నమోదైంది. దాదాపు 80శాతం దాటవచ్చు అంటున్నారు. వివిధ సర్వేలు, అంతర్గత ఎగ్జిట్ పోల్స్, ప్రజల అంచనాలు క్లియర్ కట్ మెసేజ్ ను ఇచ్చాయి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ హవా స్పష్టంగా కనిపిస్తుండగా.. కృష్ణా జిల్లా నుంచి పైనున్న కోస్తా తీరం శ్రీకాకుళం వరకూ టీడీపీ హవా కనిపిస్తోంది. మధ్యలోని తూర్పు - పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజల అంచనాలు మాత్రం అంతుచిక్కడం లేదట.. ఈ జిల్లాల్లో జనసేన ప్రభావం ఎంతమేరకు ఉంటుందనే దానిపైనే రాష్ట్ర రాజకీయాలు మారనున్నట్టు సమాచారం. తూర్పు - పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలే ఏపీలో ఎవరికి అధికారం కట్టబెట్టారనేది తేలుస్తారని రాజకీయ విశ్లేషకులు ఘంటా పథంగా చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం అధికారంలోకి రావాలనుకున్నా తూర్పు - పశ్చమ గోదావరి జిల్లాల్లో మెజారిటీ అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకున్నవారికే ఏపీ కిరీటం దక్కడం ఆనవాయితీగా వస్తోంది. అనాధిగా ఈ రెండు జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలిచిన వారే అధికారం కొల్లగొట్టారు. దాంతో ఈ జిల్లాల్లో ఓటరు నాడిపై వివిధ మీడియా సంస్థలు, సర్వేఏజెన్సీలు లెక్కలు కడుతున్నాయి.

ఏపీలో ఎవరిని కదిలించినా మార్పు కావాలన్న తీరులోనే ఓటరు నాడి బయటపడడం విశేషం. అయితే ఇందులో అధికార పార్టీకి ప్రత్యామ్మాయంగా వైసీపీ, జనసేన పార్టీల వైపు ఎంత మంది మొగ్గు చూపారన్న విషయం సస్పెన్స్ గా మారింది. ముఖ్యంగా యువత అత్యధిక శాతం వైసీపీ వైపు, జనసేన అధినేత పవన్ కళ్యాన్ వైపు చూస్తుండగా.. అధికార టీడీపీ వైపు మహిళలు మొగ్గుచూపుతున్నారు..

మహిళా ఓటర్లలో అత్యధిక శాతం టీడీపీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. వీరిలో పెన్షన్ దార్లు, డ్వాక్రా మహిళా ఓటర్లు తమ పార్టీకే ఎక్కువ వేశారని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఓట్లు వైసీపీ వైపు మొగ్గు చూపాయని చెబుతున్నారు. ఇక కాపు సామాజికవర్గం అత్యధికం జనసేన వైపు ఉండగా.. మరో ప్రధానమైన బీసీ సామాజికవర్గం ఓటర్లు మాత్రం టీడీపీ, వైసీపీవైపే నిలిచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతుచిక్కని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఓటరు నాడి ఏపీ రాజకీయ పీఠాన్ని డిసైడ్ చేయబోతున్నదని సమాచారం.