Begin typing your search above and press return to search.

మాజీల చేరికతో 'హస్త' వాసి మారుతుందా..?

By:  Tupaki Desk   |   12 July 2018 5:09 PM GMT
మాజీల చేరికతో హస్త వాసి మారుతుందా..?
X
సమైక్యాంధ్ర చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి - కాంగ్రెస్ మాజీ నాయకులు తిరిగి సొంత గూడు కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. శుక్రవారం నాడు మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పాత మంత్రి వర్గ సహచరులతోనూ - పార్టీ వీడిన తన మిత్రులతోను కాంగ్రెస్ లో చేరిక పై ఫోన్ లో మంతనాలు జరిపారు. సమైక్యాంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకు పోయింది. అగ్ర నాయకులెవరూ ఆ పార్టీలో లేరు. కొందరు తెలుగుదేశంలో చేరితే మరికొందరు నాయకులు వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. సీనియర్ నాయకుడు - రాజమండ్రి లోక్‌ సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు ఏ పార్టీలోనూ చేరకుండా ఉండిపోయారు.

రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పాలనతో అక్కడి ప్రజలు విసిగిపోయారు. రాష్ట్రంలో వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకీ పుంజుకుంటోంది. ఈ దశలో 2019 లో జరిగే ఎన్నికలను ఎదుర్కొని రాష్ట్రంలో తమ అస్థిత్వాన్ని కాపాడుకుందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా విభజన సమయంలో పార్టీపై ఆగ్రహించి కాంగ్రెస్‌ను వీడి బయటకు వెళ్లిన వారందరినీ తిరిగి సొంత గూటికి తీసుకు వచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. అయితే ఈ మాజీల వల్ల కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ఎలాంటి మేలు జరుగుతుందో చూడాల్సి ఉంది.పార్టీ వీడిన నాయకులు - మాజీలు తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తారా అనేది భవిష్యత్తులో తేలాలి. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీయే విభజించిందని - ఇప్పుడు పడుతున్న కష్టాలకు ఆ పార్టీయే కారణమని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయానికి వచ్చేసారు. ఈ సమయంలో కాంగ్రెస్ మాజీలను పార్టీలోకి తీసుకుని వస్తే పెద్దగా ఉపయోగం ఉండదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మాజీల చేరికలన్నీ కంటితుడుపు చర్యలే తప్ప కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి ఉపయోగపడవని వారంటున్నారు. భవిష్యత్తులో మాజీల చేరిక వల్ల హస్తవాసి మారుతుందో.... లేక మరింత అథోగతి పాలవుతుందో ముందు ముందు చూడాలి.