Begin typing your search above and press return to search.

వేల కోట్లు వ‌దిలేసి..చిల్ల‌ర జఫ్తుల హ‌డావుడి

By:  Tupaki Desk   |   22 Feb 2018 9:37 AM GMT
వేల కోట్లు వ‌దిలేసి..చిల్ల‌ర జఫ్తుల హ‌డావుడి
X
వేల కోట్లు ద‌ర్జాగా దేశాన్ని దాటేస్తున్నా చూసీచూడ‌న‌ట్లుగా ఉండ‌టం.. బ‌య‌ట‌కు వ‌చ్చినంత‌నే హ‌డావుడి చేయ‌టం ఎక్కువైంద‌న్న విమ‌ర్శ‌లు ప్ర‌భుత్వం మీదా.. నిఘా వ్య‌వ‌స్థ‌ల మీద వినిపిస్తున్నాయి. ఆ మ‌ధ్య‌న మాల్యా ఉదంతంలో అంతా అయ్యాక నిద్ర లేచిన నిఘా వ్య‌వ‌స్థ ఇప్పుడు నీర‌వ్ మోడీ విష‌యంలోనూ ఇదే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తోంది.

తాజాగా వేలాది కోట్ల రూపాయిలు పీఎన్‌ బీ బ్యాంకుకు టోపీ పెట్టిన నీర‌వ్‌.. గీతాంజ‌లి గ్రూప్ య‌జ‌మాని మోహ‌ల్ చోక్సీల‌కు చెందిన చిల్ల‌ర ఆస్తుల మీద ఈడీ త‌న ప్ర‌తాపాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది.

తాజాగా నీర‌వ్.. ఆయ‌న‌కు చెందిన కంపెనీల‌కు చెందిన విలువైన కార్ల‌ను సీజ్ చేసింది. అదే స‌మ‌యంలో వీరి పేరిట ఉన్న షేర్లు.. మ్యూచువ‌ల్ ఫండ్స్ ను స్తంభింప చేశారు.

తొలుత రూ.11వేల కోట్లు.. త‌ర్వాత రూ.16వేల కోట్లు.. ఆ పై రూ.18వేల కోట్లు అంటూ నీర‌వ్ మోడీ స్కాంపై లెక్క‌లు అంత‌కంత‌కూ పెరిగిపోతున్న వేళ‌.. ఈడీ త‌నిఖీల్ని వేగ‌వంతం చేసింది. గుట్టుచ‌ప్పుడు కాకుండా వేల కోట్లు దేశం దాటేసిన త‌ర్వాత చేస్తున్న హ‌డావుడి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

తాజాగా స్వాధీనం చేసుకున్న వాహ‌నాల విష‌యానికి వ‌స్తే.. రోల్స్ రాయిస్ ఘోస్ట్‌.. రెండు మెర్సిడెస్ బెంజ్ జీఎల్ 250 సీడీఐ.. ఒక పోర్షే ప‌నామార‌.. మూడు హోందా కార్లు.. ఒక ట‌యోటా ఫార్చ్యూన‌ర్.. ఒక ఇన్నోవాలు ఉన్నాయి. ఇక‌.. షేర్ల విష‌యానికి వ‌స్తే దాదాపు రూ.86.72 కోట్ల విలువైన‌వి స్థంభింప‌చేయ‌గా.. రూ.7.80 కోట్ల విలువైన మ్యూచువ‌ల్ ఫండ్స్ ను ఫ్రీజ్ చేశారు. మొత్తంగా చూస్తే.. వేల కోట్లు పోయాక వంద‌ల కోట్ల‌ల్లో కూడా ఆస్తులు తిరిగి రాబ‌ట్ట‌లేని ప‌రిస్థితి చూస్తే.. నీవ‌ర్ ఎంత చ‌క్క‌గా టోపీ పెట్టాడో ఇట్టే అర్థం కాక మాన‌దు.