Begin typing your search above and press return to search.

అక్టోబ‌ర్ 5న రెండాకులు ఎవ‌రివో తేలుస్తారంట‌!

By:  Tupaki Desk   |   22 Sep 2017 1:54 PM GMT
అక్టోబ‌ర్ 5న రెండాకులు ఎవ‌రివో తేలుస్తారంట‌!
X
అన్నాడీఎంకే ఎన్నిక‌ల చిహ్నమైన రెండు ఆకుల గుర్తుపై రెండు వ‌ర్గాల మధ్య వివాదం ఉన్న నేప‌థ్యంలో వ‌చ్చే నెల 5న కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని తెలుస్తోంది. రెండు చీలిక వ‌ర్గాల‌ను అక్టోబ‌ర్ 5న విచారించ‌నుంది. ఈ క్ర‌మంలో ఈ నెల 29లోగా పార్టీ త‌మ‌దే అని తెలిపేలా రుజువు చేసే ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల‌ని ఎన్నిక‌ల సంఘం.. ప‌ళ‌ని, దిన‌క‌ర‌న్ వ‌ర్గాల‌ను ఆదేశించింది. కాగా పార్టీ పేరు, ఎన్నిక‌ల చిహ్నం త‌మ‌కే ద‌క్కాలంటూ ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంఘానికి భారీ సంఖ్య‌లో అఫిడ‌విట్లు అందాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు సిస‌లైన అన్నాడీఎంకే ఎవ‌రిదో, పార్టీ గుర్తు ఎవ‌రు ద‌క్కించుకుంటారో మ‌రికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

త‌మిళ‌నాడు పుర‌చ్చిత‌లైవి (విప్ల‌వ నాయ‌కి), దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ముఖ్య‌మంత్రి మ‌ర‌ణంతో చీలిక‌లు.. పీలిక‌లుగా మారింది.. ఆల్ ఇండియా అన్నాద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం (ఏఐఏడీఎంకే). ఈ పార్టీ గుర్తు రెండు ఆకులు. దీని కోసం ఒక వైపు ప్ర‌స్తుత త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప‌ళ‌ని స్వామి, డిప్యూటీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ వ‌ర్గం, మ‌రోవైపు జ‌య నెచ్చ‌లి, చిన్న‌మ్మ శ‌శిక‌ళ సోద‌రి కుమారుడు దిన‌క‌ర‌న్ వ‌ర్గాలు హోరాహోరీగా పోరాడుతున్న సంగ‌తి తెలిసిందే.

రెండు గ్రూపులు పార్టీ గుర్తు మాదంటే మాద‌ని కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ను ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. కాగా ముందు త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌స్తుత డిప్యూటీ ముఖ్య‌మంత్రి ఓ ప‌న్నీర్ సెల్వం, శ‌శిక‌ళ ఆధ్వ‌ర్యంలోని రెండు వ‌ర్గాలు పార్టీ గుర్తు త‌మ‌కే చెందాలంటూ ఎన్నిక‌ల సంఘాన్ని కోరాయి. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల్లో అక్ర‌మాస్తుల కేసులో శ‌శిక‌ళ జైలుపాల‌వ‌గా ప‌ళ‌ని స్వామి, ప‌న్నీర్ వ‌ర్గాలు ఒక్క‌ట‌య్యాయి.