మోదీ ప్లాన్లూ వర్కవుట్ కావడం లేదు!

Sun Apr 21 2019 01:12:23 GMT+0530 (IST)

ఎన్నికల ముంగిట ప్రధాని నరేంద్ర మోదీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ నేతలకు బ్రేకులేస్తూ సాగుతోంది. నేతల బయోపిక్ లు కుదరవని తేల్చేసిన ఈసీ... అది మోదీ బయోపిక్ అయినా కూడా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ ప్రస్థానం ఆధారంగా రూపొందిన *మోదీ- జర్నీ ఆఫ్ ఏ కామన్ మ్యాన్*కి ఈసీ బ్రేకులేసింది. ఎన్నికలు ముగిసేదాకా ఈ వెబ్ సిరీస్ ను ప్రసారం చేయడం కుదరదని ఈరోస్ నౌకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఇప్పటికే ప్రసారం అయిన ఈ సిరీస్ లోని ఐదు భాగాలను కూడా స్ట్రీమ్ కాకుండా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించింది.ఫలితంగా ఈ వెబ్ సిరీస్ లోని సింగిల్ బిట్ కూడా ఎన్నికలు ముగిసేదాకా నెట్ లో కనిపించదు. ఎలక్షన్ కోడ్ ను పక్కాగానే అమలు చేసేందుకు రంగంలోకి దిగిన ఈసీ... ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా వివేక్ ఒబేరాయ్ ప్రధాన పాత్రలో ‘పీఎం నరేంద్ర మోదీ’  సినిమా విడుదలకు బ్రేక్ వేసింది. ఎన్నికలు ముగిసేదాకా నేతల బయోపిక్ ల విడుదల కుదరదని తేల్చేసిన ఈసీ... అందులో మోదీకి మినహాయింపేమీ లేదని తేల్చి పారేసింది. తాజాగా వెబ్ సిరీస్ కు కూడా బ్రేకులేసిన ఈసీ.. మోదీకే కాకుండా బీజేపీకి కూడా పెద్ద షాకే ఇచ్చిందని చెప్పాలి.

వెబ్ సిరీస్ నిలిపివేతకు సంబంధించి ఈసీ జారీ చేసిన ఆదేశాల్లో ఏముందన్న విషయానికి వస్తే... *ప్రధాని మోదీ జీవితం ఆధారంగా రూపొందిన వెబ్ సిరీస్‌లోని ఐదు ఎపిసోడ్‌లు ఇప్పటికీ మీ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. వెంటనే వాటిని నిలిపివేయాల్సిందిగా ఆదేశిస్తున్నాం. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఆపేయాలి. అదే విధంగా వెబ్ సిరీస్ కంటెంట్‌ను పూర్తిగా తొలగించాలి* అని ఈసీ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.