Begin typing your search above and press return to search.

ముంగిట్లోకి ఐదు రాష్ట్రాల ఎన్నికల పండగ

By:  Tupaki Desk   |   24 Oct 2016 5:03 AM GMT
ముంగిట్లోకి ఐదు రాష్ట్రాల ఎన్నికల పండగ
X
వచ్చే ఏడాది మొదట్లోనే రాజకీయ పార్టీలకు పెద్ద పరీక్ష ఎదురుకానుంది. కొత్త సంవత్సరం వచ్చిందంటే.. అందరిలోనూ హుషారే. కానీ.. ఈ హుషారుతో పాటు.. కాస్తంత టెన్షన్ ను ఫీలవుతుంటారు విద్యార్థులు. ఈసారి మాత్రం వారితోపాటు రాజకీయ పక్షాలకు టెన్షన్ తప్పేటట్లు లేదు. దేశ రాజకీయాల్ని ప్రబావితం చేసే ఈ ఎన్నికల ఫలితాలు.. మోడీ రెండున్నరేళ్ల పాలనకు ఒక లిట్మస్ టెస్ట్ లా మారే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే.. ఎన్నికల్లో విజయం సాధిస్తే.. అది మోడీ సత్తాను చాటిందంటూ అధికారపక్షం గొప్పలకు పోవటం.. లెక్క తేడా కొడితే.. ఎన్నికలకు.. మోడీ సర్కారుకు సంబంధం లేదని.. ఇదంతా రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు అయినందున.. వీటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న మాటను చెప్పుకునే వీలుంది.

కాస్త అటూఇటూగా ఏటా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు జరగటం మామూలే అయినా.. వచ్చే ఏడాది మొదట్లో జరిగే ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నవనే చెప్పాలి. ఎందుకంటే.. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో యూపీలోని మెజారిటీ లోక్ సభా స్థానాల్ని తన ఖాతాలో వేసుకున్న బీజేపీ.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే మేజిక్ చేయాల‌ని తహతహలాడుతోంది.

ఉత్తరప్రదేశ్ తో పాటు.. బీజేపీకి ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ బలమైన పరపతి ఉన్న గోవా.. పంజాబ్.. ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు.. మరో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ కు ఎన్నికలు జరగనున్నాయి. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఏడు దశల్లో.. మిగిలిన రాష్ట్రాల్లో ఒకేదశలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తున్నట్లు చెబుతున్నారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం.. రాష్ట్రాలకు ఎన్నికల ప్రక్రియను షురూ చేస్తారని చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ కాల పరిమితి 2017 మే 27తో ముగుస్తుండగా.. పంజాబ్.. గోవా.. మణిపూర్ అసెంబ్లీల గడువు మార్చి 18తో ముగియనుంది. ఇక.. ఉత్తరాఖండ్ అసెంబ్లీ గడువు మార్చి 27తో ముగుస్తుంది. ఎన్నికల సంఘం కానీ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన పక్షంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. అదే జరిగితే.. బడ్జెట్ ప్రకటన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లు అవుతుంది. అందుకే.. ఈసారి బడ్జెట్ ను ఫిబ్రవరి1న ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో.. బడ్జెట్ ప్రకటన పూర్తి అయిన వెంటనే.. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. బడ్జెట్ ప్రకటన తర్వాత విడుదలయ్యే ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్.. మార్చి 15 నాటికి ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా ఎన్నికల సంఘం ప్లాన్ చేస్తోంది. కొత్త సంవత్సరం వేళ.. రాజకీయ పక్షాలకు కొంగొత్త పరీక్ష అనిచెప్పటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/