Begin typing your search above and press return to search.

22 ల‌క్ష‌ల ఓట్ల గ‌ల్లంతు పై ర‌జ‌త్ కుమార్ ఏమ‌న్నారంటే..

By:  Tupaki Desk   |   12 Dec 2018 9:57 AM GMT
22 ల‌క్ష‌ల ఓట్ల గ‌ల్లంతు పై ర‌జ‌త్ కుమార్ ఏమ‌న్నారంటే..
X
తెలంగాణలో ఓట్ల గ‌ల్లంతు వార్త‌లు ఇటీవ‌ల ప్ర‌కంప‌న‌లు సృష్టించాయి. కావాల‌నే టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ప‌లువురి పేర్ల‌ను ఓట‌రు జాబితా నుంచి తొల‌గించింద‌ని ఆరోప‌ణ‌లొచ్చాయి. బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా వంటి ప్ర‌ముఖులు కూడా త‌మ ఓటు గ‌ల్లంత‌య్యిందంటూ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ ఓట్ల గ‌ల్లంతుపై మీడియాలోనూ బాగా వార్త‌లొచ్చాయి. ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని.. ప‌లువురి పేర్ల‌ను జాబితా నుంచి నిర్దాక్షిణ్యంగా తొల‌గించింద‌ని విమ‌ర్శ‌లు గుప్పించాయి.

పోలింగ్ రోజున(ఈ నెల 7న‌) రాష్ట్ర ఎన్నిక‌ల సీఈవో ర‌జ‌త్ కుమార్ కూడా ఈ విష‌యం పై స్పందించారు. ఓటు గ‌ల్లంత‌య్యిందంటూ ప‌లువురు ప‌రిచ‌య‌స్థులు త‌న‌కు ఫోన్ చేశార‌ని తెలిపారు. ఓటు గ‌ల్లంతైన‌వారంద‌రికీ క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పారు. అసెంబ్లీ ఎన్నిక‌ల విజేత‌ల పేర్ల‌తో కూడిన జాబితాను ర‌జ‌త్ కుమార్ బుధ‌వారం గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు అధికారికంగా అంద‌జేశారు. అనంత‌రం ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసిందంటూ లాంఛ‌నంగా ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌ర్లు ర‌జ‌త్‌ను ఓట్ల గ‌ల్లంతుపై ప్ర‌శ్నించారు. దీంతో ఆయ‌న అస‌లు వాస్త‌వాల‌ను వివ‌రించారు.

22 ల‌క్ష‌ల ఓట్లు గ‌ల్లంత‌య్యాయంటూ కొన్ని మీడియా సంస్థ‌ల్లో క‌థ‌నాలు వెలువ‌డ‌టం తాను చూశాన‌ని ర‌జ‌త్ కుమార్ చెప్పారు. అవ‌న్నీ క‌ట్టుక‌థ‌లేన‌ని పేర్కొన్నారు. అంత‌టి భారీ సంఖ్య‌లో ఓట్లు గ‌ల్లంత‌యి ఉంటే తాము ఇంత ప్ర‌శాంతంగా ఎన్నిక‌లు నిర్వ‌హించేవార‌మే కాద‌ని సూచించారు. రాజ‌కీయ పార్టీలు త‌మ‌ను వెంటాడి వేధించేవ‌ని అన్నారు. గ‌ల్లంతైన ఓట్ల సంఖ్య వంద‌ల్లో ఉంటుంద‌ని.. మ‌హా అయితే వేల‌ల్లో ఉండొచ్చ‌ని ర‌జ‌త్ కుమార్ తెలిపారు. ల‌క్ష‌ల్లో మాత్రం ఆ సంఖ్య లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఓట్లు గ‌ల్లంత‌వ్వ‌డానికి గ‌ల కార‌ణాల‌ను కూడా ఆయ‌న వివ‌రించారు. బూత్ లెవ‌ల్ అధికారులు ఓట‌రు జాబితాను ప‌రిశీలించిన‌ప్పుడు ప‌లువురు త‌మ ఊర్ల‌లో, నివాసాల్లో క‌నిపించ‌లేద‌ని తెలిపారు. వారిలో ఎక్కువ‌మంది శాశ్వ‌తంగా నివాసం మారిన‌వారేన‌ని పేర్కొన్నారు. బోగ‌స్ ఓట్ల‌ను నివారించే ప్ర‌ణాళిక‌ల్లో భాగంగా అలాంటి వారి పేర్ల‌ను జాబితా నుంచి తొల‌గించాల్సి ఉంటుంద‌న్నారు. అయితే - తామేమీ ఏక‌ప‌క్షంగా పేర్లు తొల‌గించ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. తాఖీదులిచ్చిన త‌ర్వాతే తొల‌గింపు ప్ర‌క్రియ ప్రారంభించామ‌న్నారు. తాఖీదులు అందిన‌ప్ప‌టికీ 7 రోజుల వ్య‌వ‌ధిలో త‌మ‌ను సంప్ర‌దించ‌నివారి పేర్ల‌ను ఓట‌రు లిస్ట్ నుంచి డిలీట్ చేశామ‌ని ఆయ‌న వివ‌రించారు.