బాలకృష్ణ ప్రచారానికి ఈసీ నో!

Wed Dec 05 2018 13:08:10 GMT+0530 (IST)

ప్రముఖ సినీ నటుడు - టీడీపీ నేత బాలకృష్ణకు ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఆయన ప్రచారానికి నో చెప్పింది. తెలంగాణ ముందస్తు ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన బుధవారం ఆయన హైదరాబాద్‌లో ప్రచారం చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది.తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ నాలుగు రోజులుగా పాల్గొంటున్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది చంద్రబాబేనని.. ఆయన్ను తెలంగాణకు దూరం చేసే దమ్ము ఎవరికీ లేదంటూ తనదైన శైలిలో టీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబుకు హైదరాబాద్ తో సంబంధాలు తెంచేయాలంటే శంషాబాద్ విమానాశ్రయాన్ని కూల్చేయాలని - ఔటర్ రింగ్ రోడ్డును తీసేయాలని పలు సందర్భాల్లో ఆయన అన్నారు. ఆ దమ్ము ఎవరికి ఉందంటూ సవాలు విసిరారు.

తాజాగా ఆయన ఓ ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ చంద్రబాబు సీఎం అయ్యాకే ఐటీ ఉద్యోగులకు స్పెల్లింగ్ నేర్పించారంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన వల్లే సైబరాబాద్ అభివృద్ధి చెందిందని సూచించారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ ఉద్యోగుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐటీ ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టేందుకు బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) రజత్‌కుమార్‌కు మంగళవారం ఫిర్యాదు చేసింది.

ఐటీ ఉద్యోగుల సంఘం ఫిర్యాదును పరిశీలించిన రజత్ కుమార్.. బాలకృష్ణకు షాకిచ్చారు. బుధవారం ప్రచారం చేయకూడదంటూ బాలకృష్ణకు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ర్యాలీలు చేపట్టకూడదని ఆయనకు స్పష్టం చేశారు. ఈసీ ఆదేశాలతో హైదరాబాద్‌లో టీడీపీ శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకుంది.