Begin typing your search above and press return to search.

సూర్యకాంతి ఆపాలని అరచేతిని ఎత్తేశాడు.

By:  Tupaki Desk   |   13 Oct 2015 7:26 AM GMT
సూర్యకాంతి ఆపాలని అరచేతిని ఎత్తేశాడు.
X
‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు’ అనేది చాలా పాప్యులర్ నానుడి. సూర్యుడికి ఎదురుగా నిల్చుని అరచేయి అడ్డుపెడితే కాంతి ఆగిపోతుందా.. అలా చేసేవాడి ప్రయత్నం అమాయకత్వం గానీ, పిచ్చిగానీ అనిపించుకుంటుంది. ఇప్పుడు ఒక మాజీ ఐఏఎస్ అధికారి కూడా ఇంచుమించు అలాంటి ప్రయత్నమే చేయబోతున్నారు. పర్యావరణం పేరు పెట్టి అసలు కార్యక్రమానికి రావొద్దని మోడీ ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఏపీ రాజధాని కోసం అమరావతిలో శంకుస్థాపన చేయవద్దని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి, పర్యావరణవాది ఈఎఎస్ శర్మ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. అక్టోబర్ 22న రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజధాని నగర శంకుస్తాపన కార్యక్రమానికి అసలు హాజరు కావద్దంటూ శర్మ ప్రధానికి సోమవారం ఉత్తరం రాశారు. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతంలో రాజధానిని నిర్మించడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులకే ప్రయోజనం కలుగుతుందని శర్మ ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. రాజధాని నగర ప్రాజెక్టు సారవంతమైన భూముల్లో వ్యవసాయాన్ని దెబ్బతీస్తుందని, పైగా రాజధాని నిర్మాణానికి అధికారిక అనుమతులు కూడా ఇంతవరకు ప్రభుత్వం పొందలేదని శర్మ వివరించారు.

రాజధాని నగర ప్రాజెక్టు కోసం భారీ స్థాయిలో నిధులు ఖర్చు పెడుతుంటడంపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు సంతోషంగా లేరని మాజీ ఐఎఎస్ అధికారి ఆరోపించారు. గతంలో చత్తీస్‌గఢ్ - ఉత్తరాఖండ్ - జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటులో పని చేసిన అనుభవం తనకు ఉందని శర్మ పేర్కొన్నారు. ఈ డిజిటల్ యుగంలో కూడా ఒకేచోట రాజధాని నిర్మాణం కోసం పథకాలు రచించడం ఆర్థికంగా సరైంది కాదని ఆయన హెచ్చరించారు.

ఆయన చెబుతున్న దానిలో కొన్ని వాస్తవాలు ఉండొచ్చు. ఒక ప్రాంతంలో కొత్త నగరం వస్తోంటే.. దూరంగా ఉండే ఇతర ప్రాంతాలకు బాధ కలగడం సహజం. కానీ.. అక్కడ కూడా ప్రభుత్వం ఏదో ఒక పనులు చేపడుతూనే ఉన్నది. కానీ.. అవేవీ ఆయనకు కనపడుతున్నట్లు లేదు. అంతకంటె ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. మోడీని రావద్దని ఆయన కోరడం. ఒకవేళ శర్మ గారి మాటలు మోడీ ఆలకించినా కూడా.. ఆయన ఎగ్గొట్టినంత మాత్రాన అమరావతి శంకుస్థాపన ఆగుతుందా? అని పలువురు కార్యక్రమాన్ని సమర్థిస్తున్న వారుఅంటున్నారు.