Begin typing your search above and press return to search.

ఫ్లిప్ కార్ట్-అమెజాన్ : దసరా వసూల్ !

By:  Tupaki Desk   |   13 Oct 2015 5:30 PM GMT
ఫ్లిప్ కార్ట్-అమెజాన్ : దసరా వసూల్ !
X
దాదాపుగా ప్రతి వ్యాపారానికి సీజన్ - అన్ సీజన్ అని ఉంటాయి... ఆన్ లైన్ వ్యాపారానికి మాత్రం ఇంతకాలం ఈ భేధం ఉండేది కాదు... కానీ, ఇప్పుడు ఇటెయిలర్స్(etailers) కూడా తమ వ్యాపారానికీ సీజన్ సృష్టించుకుంటున్నారు. దసరా నవరాత్రులు మొదలుకుని, దీపావళి - క్రిస్మస్ - సంక్రాంతి ఇలా ప్రతి సీజన్ నూ తామూ అందిపుచ్చుకుంటున్నారు. ది గ్రేటెస్ట్ సేల్ - బిగ్ బిలియన్ సేల్ అంటూ ధరలు తగ్గించి ఆన్ లైన్ వినియోగదారులను అట్రాక్ట్ చేస్తూ తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. ఇలాంటి ధమాకా సేల్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారులూ పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఆన్ లైన్లో ఇలాంటి ప్రత్యేక విక్రయాల్లో కొన్నికొన్ని ఉత్పత్తులు కారుచౌకగా దొరుకుతుండడం.. పైగా క్రెడిట్ కార్డు ఆఫర్లు ఇస్తుండడంతో కొన్ని కొన్ని వస్తువులు బాగా చవగ్గా దొరుకుతున్నాయి.

క్షణం తీరికలేని ఈ యాంత్రిక జీవనంలో షాపింగ్ మాల్స్‌ కు వెళ్లి అక్కడ గంటల తరబడి ఏరికోరి నచ్చిన వాటిని కొనుక్కునే ఓపికలేని వారంతా కూడా ఇప్పుడు ఆన్‌ లైన్ షాపింగ్‌ పై ఆధారపడుతున్నారు. వ్యయప్రయాసలకోర్చి ట్రాఫిక్ - కాలుష్య కోరల్లో చిక్కుకుని షాపింగ్ చేయడం దేనికనుకుంటున్న వినియోగదారులు ఇంట్లోనే ఎంచక్కా ఈ-కామర్స్ సంస్థల ద్వారా కావలసినవి కొనేస్తున్నారు. ఇలాంటి వారికోసమే ఈకామర్స్ సైట్లూ ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. ఇప్పటికే స్నాప్ డీల్ ఒ పట్టు పట్టగా.... ఫ్లిప్ కార్ట్ - అమెజాన్ కూడా మంగళవారం నుంచి తమ ధమాకా సేల్ మొదలు పెట్టేశాయి. వీటన్నిటి ప్రభావంతో ఈ పండగ సీజన్‌లో ఆన్‌ లైన్ షాపింగ్ విలువ దాదాపు 52,000 కోట్ల రూపాయలు (8 బిలియన్ డాలర్లు)గా ఉండొచ్చని పారిశ్రామిక సంఘం అసోచామ్ అంచనా వేసింది. గత ఏడాదితో పోల్చితే ఈసారి 40 నుంచి 45 శాతం అధికంగా విక్రయాలు జరుగుతాయని పేర్కొంది.

బహిరంగ మార్కెట్‌ లో షాపింగ్ ద్వారా బోలెడంతా సమయం, డబ్బులు వృథా అవుతున్నాయని భావిస్తున్న కొనుగోలుదారులు.. ఆన్‌ లైన్ మార్కెట్‌ లో తక్కువ సమయంలోనే ఎక్కువ ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. బయటకి వెళ్లాలంటే ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించాల్సి వస్తుందని, అలాకాకుండా ఇంట్లోనే ఎంచక్కా కంప్యూటర్ - మొబైల్ - టాబ్లెట్ ఇంటర్నెట్ ద్వారా షాపింగ్ చేస్తున్నామని చెబుతున్నారు. ఆన్‌ లైన్ మార్కెటింగ్ సౌకర్యం 24 గంటలూ ఉండటం కూడా అధికులు ఈ వెబ్ కొనుగోళ్లకు అలవాటుపడటానికి ఓ ప్రధాన కారణంగా నిలుస్తోంది. పైగా ఆన్‌ లైన్ కొన్న వస్తువులు, ఇంటికి తీసుకొచ్చి ఇస్తుండటం కూడా ఆన్‌ లైన్ షాపింగ్‌ కు నానాటికి ఆదరణను తెచ్చిపెడుతోంది. నచ్చకపోతే వస్తువులను వెనక్కి పంపించేయడం, మరోకదాన్ని మార్చుకునే సౌలభ్యం కూడా ఆన్‌ లైన్ మార్కెట్‌ లో ఉంది. అంతేగాక బ్యాంకులు - కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్రెడిట్ - డెబిట్ కార్డుల ద్వారా జరిపే షాపింగ్‌ కు ఆఫర్లు ప్రకటిస్తుండటం కూడా ఆన్‌ లైన్ వ్యాపారం దూకుడును పెంచుతోంది.

ఇకపోతే మొబైల్ ఫోన్స్ - ఎలక్ట్రానిక్స్ - డిజైనర్ ఫర్నీచర్ - గృహలంకరణ వస్తువులు - దుస్తులు - ఆభరణాలు - యాక్ససెరీస్ - పాదరక్షల అమ్మకాలు ఆన్‌ లైన్ మార్కెట్‌ లోనే అధికంగా జరుగుతున్నాయి. నిజానికి ఆర్థిక మందగమనంలోనూ ఆన్‌ లైన్ షాపింగ్ వృద్ధిపథంలో నడుస్తుండగా, దీనికి కారణం ఆయా ఈ కామర్స్ సంస్థలు ప్రకటిస్తున్న డిస్కౌంట్లు, ఆఫర్లే. బహిరంగ మార్కెట్‌ లోకి ఇంకా రాని వస్తువులు కూడా ముందే ఆన్‌ లైన్‌ లో అందుబాటులో ఉండటం, ప్రత్యేక సేల్స్ పేరిట రోజులు, వారాలదాకా అన్నిరకాల వస్తువులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించడం చేస్తున్నాయి ఈ కామర్స్ సంస్థలు. ముఖ్యంగా పండగ సీజన్లలో ఈ డిస్కౌంట్లు, ఆఫర్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో గత ఏడాది 30,000 కోట్ల రూపాయలుగా ఉన్న ఆన్‌ లైన్ షాపింగ్ విలువ.. ఈ ఏడాది 52,000 కోట్ల రూపాయలను తాకవచ్చని అసోచామ్ లెక్కిస్తోంది.

ప్రస్తుతం అందరి చేతుల్లోనే ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న మొబైల్స్ ఉండటంతో అంతా ఆన్‌ లైన్ షాపింగ్ చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొబైల్ నెట్‌ వర్క్ ఉందని, అన్ని టెలికాం సంస్థలు అన్ని సర్కిళ్లలో ఇంటర్నెట్‌ ను అందుబాటులోకి తెచ్చాయన్న ఆయన దీనికి అనుగుణంగానే నగరాల నుంచి పట్టణాల నుంచి పల్లెలకు ఈ-కామర్స్ వ్యాపారం విస్తరిస్తోందన్నారు. అయితే ఆన్‌ లైన్ మార్కెట్ విస్తృతితో సాంప్రదాయ మార్కెట్ దెబ్బతింటోందని, బహిరంగ వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, వినియోగదారులు ఆన్‌ లైన్ మార్కెట్‌ కే మొగ్గుచూపుతుండటంతో వారు ఏమీ చేయలేకపోతున్నారు. ఈ ఒక్క కారణంతోనే కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వద్దకు వ్యాపారుల ఆందోళన చేరినా ఫలితం లేకపోయింది.

స్నాప్‌ డీల్ - మింత్రా - ఫ్లిప్‌ కార్ట్ - అమెజాన్ - జబాంగ్ తదితర ఈ-కామర్స్ సంస్థలు ఆన్‌ లైన్ మార్కెట్‌ లో దూసుకెళ్తున్నాయి. మొత్తానికి ప్రస్తుత పండగ సీజన్‌ లో నాలుగు నెలలపాటు ఆన్‌ లైన్ షాపింగ్ హవా కొనసాగనుందన్నమాట.

మరోవైపు ఈ-కామర్స్ సంస్థల పండగ సీజన్ అమ్మకాలు ఎఫ్‌ డిఐ నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) ఆరోపిస్తోంది. అమెజాన్ - ఫ్లిప్‌ కార్ట్ - స్నాప్‌ డీల్ తదితర సంస్థలు రాబోయే పండగ సీజన్ అమ్మకాలకు సంబంధించి వినియోగదారులను ఆకట్టుకోవడానికి రిటైల్ ట్రేడర్లతో సమానంగా మీడియాలో భారీ ప్రకటనలు చేస్తున్నాయని పేర్కొంది. ఆన్‌ లైన్ షాపింగ్ సంస్థలు ఇలా చేయడం ఎఫ్‌ డిఐ నిబంధనలను ఉల్లంఘించడమే నని సిఎఐటి ఆరోపిస్తోంది. దీనిపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా చేసింది. వీటి ప్రకటనలు ఆన్‌ లైన్‌ లోనే ఉండాలని... కానీ ఇవి పత్రికల్లో ప్రకటలు ఇస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. అయితే... ఎన్ని ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినా ఆన్ లైన్ వ్యాపారం జోరు తగ్గడం కష్టమే . ఇప్పటికే ఆదరణ పెరిగిపోవడం.. ఎన్నో సౌలభ్యాలు ఉండడంతో ప్రజల్లోకి ఇది పూర్తిగా చొచ్చుకుపోయింది.

ఇటైలర్ల తడాఖా ఇదీ...

ఈ కామర్స్ సంస్థలు అన్ని నగరాలు, పట్టణాల్లో పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించుకుంటున్నాయి. పెద్ద పెద్ద గోదాములు నిర్మిస్తున్నాయి.

- బెంగళూరులో ఫ్లిప్ కార్ట్ కు 16 వేల మంది డెలివరీ సిబ్బంది ఉన్నారు.
- వీరిలో కొందరు రోజుకు 100 పార్శిళ్లు కూడా డెలివరీ చేస్తారు.
- బెంగళూరు వంటి నగరాల్లో ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థలు రోజుకు 65 వేల ఉత్పత్తులు డెలివరీ చేస్తుంటాయి. బిగ్ బిలియన్ డే సమయాల్లో 110000 ఉత్పత్తులను ఇళ్లకు అందిస్తారు.
- ఆన్ లైన్లో ఫర్నిచర్ అమ్మే అర్బన్ లేడర్, గ్రోసరీస్ విక్రయించే గ్రోఫర్ వంటివి తమ సిబ్బందికి దసరాకు నెల రోజుల వేతనం బోనస్ గా ప్రకటించాయి.
- గుర్గావ్ లో ఫ్లిప్ కార్ట్ కేవలం కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ డ్యూరబుల్స్ కోసమే ఓ భారీ గోదాం నిర్మించింది.