Begin typing your search above and press return to search.

తెలంగాణ‌నే త‌న కేంద్రంగా ఎంచుకున్న సివిల్స్ టాప‌ర్‌

By:  Tupaki Desk   |   5 Dec 2018 1:30 AM GMT
తెలంగాణ‌నే త‌న కేంద్రంగా ఎంచుకున్న సివిల్స్ టాప‌ర్‌
X
దురిశెట్టి అనుదీప్‌... ఆరునెల‌ల కింద‌ట దేశ‌వ్యాప్తంగా మారుమోగిన పేరు. ఎందుకంటే సివిల్స్‌లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన వ్య‌క్తి. సుదీర్ఘ‌కాలం త‌ర్వాత తెలుగు రాష్ర్టాల‌కు ఈ ఘ‌ట‌న ద‌క్కింది. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష 2017 ఫైనల్‌ ఫలితాలలో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్‌ సత్తాచాటి తొలి ర్యాంక్ సాధించారు. దీంతో ప‌తాక శీర్షిక‌ల్లో నిలిచారు. అలా విశిష్ట‌త‌ను సంపాదించుకున్న అనుదీప్ త‌న కొలువుకు కేంద్రంగా స్వ‌రాష్ట్రం తెలంగాణ‌నే ఎంచుకున్నారు.

అఖిల భారత సర్వీసులకు ఎన్నికైన మెట్‌పల్లి పట్టణానికి చెందిన దురిశెట్టి అనుదీప్‌ను తెలంగాణ క్యాడర్‌కు కేటాయిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అనుదీప్ ప్రస్తుతం ముసోరిలో శిక్షణలో ఉన్నారు. అనుదీప్‌ను ఈ విషయమై సంప్రదించగా సొంత రాష్ట్రం తెలంగాణ క్యాడర్‌కు రావడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా తెలంగాణ క్యాడర్‌కు కేటాయించడంపై ఆయన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

కాగా, సివిల్స్‌లో టాపర్‌గా నిలిచిన దురిశెట్టి అనుదీప్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫ‌లితాలు వెల్ల‌డైన సంద‌ర్భంగా ప్రత్యేకంగా అభినందించిన సంగ‌తి తెలిసిందే. అనుదీప్‌ను ఆయన తల్లిదండ్రులను ప్రగతి భవన్‌లో కేసీఆర్ క‌లుసుకున్నారు. అనుదీప్ ఆయన తల్లిదండ్రులతో క‌లిసి కేసీఆర్ అక్క‌డే మ‌ధ్యాహ్న భోజ‌నం కూడా చేశారు.