తాగేసి కేబీఆర్ పార్కు ఎదుట అమ్మాయిల పోట్లాట

Sun Jun 23 2019 10:49:35 GMT+0530 (IST)

శనివారం అర్థరాత్రి వేళ బంజారాహిల్స్ లోని కేబీఆర్ పార్కు వద్ద చోటు చేసుకున్న ఘటన షాకింగ్ గా మారింది. సంచలనం సృష్టిస్తోన్న ఈ ఉదంతాన్ని చూస్తే.. ఈ నగరం ఎటు వెళుతుందన్న సందేహం కలగక మానదు. మద్యం మత్తులో ఉన్న ఇద్దరు అమ్మాయిలు నడి రోడ్డు మీద రచ్చ రచ్చ చేశారు.ఆధునిక వస్త్రదారణతో ఉన్న ఈ ఇద్దరు అమ్మాయిల వెంట నలుగురు అబ్బాయిలు ఉన్నారు. మద్యం మత్తులో ఉన్న అమ్మాయిలు ఇంగ్లిషులో ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకోవటం.. ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగటంతో అటు వెళుతున్న వారంతా విస్మయానికి గురయ్యారు. వారి వెంట ఉన్న అబ్బాయిలు వారిని సముదాయించలేక కిందామీదా పడిన పరిస్థితి.

ఇష్యూ ఇక్కడితో ఆగలేదు. రోడ్డు మీద వెళుతున్న వాహనాలు.. వాహనదారులతో వారు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిన పరిస్థితి. ఈ గొడవకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి గొడవ కారణంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పే ప్రయత్నం చేసిన పోలీసులతోనూ వారు దురుసుగా వ్యవహరించటం గమనార్హం.

దీంతో.. మత్తులో ఉన్న ఇద్దరు అమ్మాయిల్ని.. వారి వెంట ఉన్న నలుగురు అబ్బాయిల్ని పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అర్థరాత్రి వేళ నడిరోడ్డు మీద అమ్మాయిల హల్ చల్ ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే.. ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు?  వారి వెంట ఉన్న నలుగురు అబ్బాయిలు ఎవరు?  ఎక్కడి వారు?  ఏం చేస్తుంటారు?  వారి బ్యాక్ గ్రౌండ్ లాంటి విషయాల్ని పోలీసులు బయటకు వెల్లడించలేదు.