Begin typing your search above and press return to search.

కరువుతో కొట్టుకుపోనున్న టీడీపీ?

By:  Tupaki Desk   |   23 April 2019 5:53 AM GMT
కరువుతో కొట్టుకుపోనున్న టీడీపీ?
X
కరువు- చంద్రబాబు నాయుడు కవల పిల్లలు.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అంటూ ఉంటారు. బాబు ఉంటే కరువేనని వారు వ్యాఖ్యానిస్తూ ఉంటారు. వారి వ్యాఖ్యల సంగతలా ఉంచితే..చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండిన గత ఐదేళ్లూ రాష్ట్రాన్ని భీకరమైన కరువులు అతలాకుతలం చేశాయని చెప్పక తప్పదు.

ప్రత్యేకించి రాయలసీమ ప్రాంతం అయితే గత ఐదేళ్లలో తీవ్రమైన పంట నష్టాలను చవి చూసింది. ప్రతియేటా కరువులతో రైతులు సతమతం అయ్యారు. గతంలో కూడా సీమ కరువులను చూసింది కానీ.. గత ఐదేళ్లలో మాత్రం మరీ తీవ్రమైన కరువులు వచ్చాయి. ప్రధాన పంట వేరుశనగ ఒక్క సంవత్సరం కూడా రైతుకు దక్కిందే లేదు.

రైతులు అలా కరువులతో మాడుతుంటే..చంద్రబాబు నాయుడు మధ్యలో దిగి.. రెయిన్ గన్నులు అంటూ హడావుడి చేశారు. నీళ్లే లేనిది రెయిన్ గన్నులు ఎలా పని చేస్తాయనే బేసిక్ లాజిక్ ను చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. ఇక ప్రతియేటా కరువు మండలాల ప్రకటన అంటూ చేశారు కానీ - కరువు బాధిత ప్రాంతాలకు చేసింది మాత్రం శూన్యం.

కేవలం రాయలసీమ ప్రాంతమే కాకుండా.. మిగతా ప్రాంతం కూడా కరువుల బారిన పడుతూ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో ఇది కూడా తెలుగుదేశం పార్టీకి నెగిటివ్ పాయింట్ గా మారిందని విశ్లేషకులు అంటున్నారు. వరస కరువులు బాబు పాలన మీద మరింత విసుగు ఎత్తించాయని.. బాబు ఉంటే కరువే అనే ప్రచారం కూడా రైతులు - వ్యవసాయధార వర్గాల్లో గట్టిగా జరిగిందని.. ఇది కూడా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బతీసే అంశాలు ఒకటిగా నిలిచిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.