Begin typing your search above and press return to search.

మోడీ.. ఓటు వేస్తుంటే ఇంత డ్రామానా?

By:  Tupaki Desk   |   23 April 2019 7:00 AM GMT
మోడీ.. ఓటు వేస్తుంటే ఇంత డ్రామానా?
X
అంద‌రు ఓటు వేస్తే ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి మోడీ ఎందుకు అవుతారు. తాను మాట్లాడే ప్ర‌తి మాట‌.. చేసే ప్ర‌తి చేష్ట అన్నింటిని లెక్క వేసుకొని చేయ‌టం ఒక ఎత్తు అయితే.. అవ‌స‌రానికి మించిన నాట‌కీయ‌త ఆయ‌న చేసే చ‌ర్య‌ల్లో కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తుంటుంది. ప్ర‌ముఖులు ఎవ‌రైనా స‌రే.. ఓటు వేసే వీడియోల్ని చూడండి. మోడీ మాష్టారు ఓటు వేసే ఎపిసోడ్ వీడియో చూస్తే.. తేడా మీకే కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించ‌క మాన‌దు.

తాను చేసే ప్ర‌తి ప‌నికి మైలేజీ కోరుకునే త‌త్త్వం మోడీలో చాలా ఎక్కువ‌ని చెబుతారు. మామూలుగా చూస్తే ఈ విష‌యం పెద్ద‌గా రాదు కానీ.. అదే ప‌నిగా త‌ర‌చి చూస్తే మాత్రం ఆయ‌న‌కు కొన్ని ఇష్టాలు కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తూ ఉంటాయి. ఈ రోజు ఉదయం త‌న ఓటుహ‌క్కును అహ్మ‌దాబాద్ లోని ర‌నిప్ ప్రాంతంలోని నిశ‌న్ హ‌య్య‌ర్ సెకండ‌రీ స్కూల్లో వినియోగించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓపెన్ టాప్ జీపులో ప్ర‌యాణించారు.

మోడీ లాంటి నేత వ‌స్తే.. జ‌నం పోటెత్తుతారు క‌దా. వారికి నిరాశ క‌లిగించ‌కుండా ఉండేలా ఓపెన్ టాప్ జీపును వాడిన ఆయ‌న‌.. పోలింగ్ కేంద్రానికి కాస్త దూరంలో వాహ‌నాన్ని ఆపేశారు. తాపీగా న‌డుస్తూ.. జ‌నాల్ని ఉత్సాహ‌ప‌రిచేలా న‌మ‌స్కారం చేయ‌టం.. చేతులు ఊప‌టం లాంటివి చేశారు. అంత‌లోనే చిన్నపాప‌ను ఎత్తుకున్న మోడీ.. ఆ పాప‌ను పైకి ఎగ‌రేసి ప‌ట్టుకునే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. దాదాపు మూడుసార్లు అలా పాప‌ను గాల్లో ఎగుర‌వేసి ప‌ట్టుకోవ‌టం.. త‌ల నిమ‌ర‌టం.. పాప పొట్టలో చిన్న‌గా పంచ్ ఇచ్చిన‌ట్లుగా ముద్దు చేయ‌టంతో పాటు.. తాను రెండు వేళ్ల‌లో విజ‌యం గుర్తును చూపిస్తూ.. పాప‌ను కూడా అలానే చేయాల‌న్న‌ట్లుగా ఆయ‌న.. మోడీ ప‌క్క‌నున్నోళ్లు ప్ర‌య‌త్నించ‌టం క‌నిపిస్తుంది.

నెమ్మ‌దిగా అడుగులో అడుగు వేసుకుంటూ.. న‌డుస్తూ పోలింగ్ కేంద్రంలోకి ఎంట‌రైన త‌ర్వాత‌.. క్యూలో నిలుచోవ‌టం.. ఆయ‌న ముందు ఎవ‌రూ లేక‌పోవ‌టంతో ఆయ‌నే నేరుగా ఓటు వేసేశారు. ఓటు వేయ‌టానికి కూడా మోడీకి దాదాపు రెండు నుంచి మూడు నిమిషాలు ప‌ట్ట‌టం గ‌మ‌నార్హం. పోలింగ్ సిబ్బందితో న‌వ్వుతూ పొడి.. పొడిగా మాట్లాడిన ఆయ‌న‌.. ఓటు వేశారు.

ఓటు వేసిన త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న‌.. మ‌ళ్లీ య‌థావిధిగా చేతులు ఊప‌టం.. చుట్టూ చేరిన జ‌నాల్ని ఉత్సాహ‌ప‌రిచేలా సంకేతాలు ఇచ్చారు. త‌న‌జీపు వ‌ద్ద‌కు చేరుకున్న ఆయ‌న‌.. అక్క‌డ నుంచి మీడియాతో మాట్లాడి ఓట‌ర్ల‌కు ఓటు వేసే విష‌యంలో దేశ ప్ర‌జ‌ల‌కు సందేశాన్ని ఇచ్చారు. ఇదంతా చూసిన‌ప్పుడు ఓటు వేసే విష‌యంలో.. మోడీ మాష్టారి ఐడియా ఏమిటో ఇట్టే అర్థం కావ‌ట‌మే కాదు.. ఓటు వేసే కార్య‌క్ర‌మంలో భాగంగా ఇంత భారీ హ‌డావుడి అవ‌స‌ర‌మా? అన్న భావ‌న రాక మాన‌దు. మీకు అలా అనిపించినా.. మోడీకి మాత్రం త‌న తాజా ఓటు హ‌క్కును వినియోగించుకునే క్ర‌మంలో భారీ డ్రామా నెల‌కొని ఉండ‌టం విశేషం. అదే లేకుంటే ఆయ‌న మోడీ ఎందుక‌వుతారు?

గ‌త ఎన్నిక‌ల్లో ఓటు వేళ‌లో వివాదాన్ని మ‌ర్చిపోని మోడీ!

ఐదేళ్ల క్రితం జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో దేశ ప్ర‌ధాని రేసులో ఉన్న న‌రేంద్ర మోడీ ఓటు వేసే వేళ‌లో చోటు చేసుకున్న వివాదం గుర్తుండే ఉంటుంది. ఓటు వేసేందుకు వెళ్లిన ఆయ‌న‌.. త‌న ఓటుహ‌క్కును నిర్వ‌హించుకున్న త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న జేబుకు బీజేపీ గుర్తు అయిన క‌మ‌లం బ్యాడ్జ్ ను ఆయ‌న పెట్టుకోవ‌టం.. ఓటు వేయాల‌ని కోరుతూ వేళ్లు చూపించిన వైనంపై వివాదం నెల‌కొంది.

ఎన్నిక‌ల కేంద్రం వ‌ద్ద పార్టీ గుర్తుతో ఆయ‌న ప్ర‌చారం చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తి.. ప‌లువురు విమ‌ర్శించినా.. ఈసీ మాత్రం ఆ ఇష్యూలో మోడీ త‌ప్పు చేయ‌లేద‌ని చెప్పింది. గ‌త అనుభ‌వం మోడీకి గుర్తున్న‌ట్లుగా ఉంది. ప్ర‌ధాన‌మంత్రి హోదాలో ఈ రోజు జ‌రిగిన పోలింగ్ లో ఓటు వేసిన ఆయ‌న‌.. గ‌తంలో మాదిరి క‌మ‌లం గుర్తు బ్యాడ్జిని పెట్టుకోకుండా రావ‌టం క‌నిపించింది.ఎప్ప‌టిలానే ఉన్న ఆయ‌న వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఒకే ఒక్క మార్పు ఏమంటే.. గ‌త ఎన్నిక‌ల వేళ‌లో క‌మ‌లం గుర్తు ఉంటే.. తాజాగా ఓటు వేసే స‌మ‌యంలో మాత్రం పార్టీ గుర్తు బ్యాడ్జిని పెట్టుకోకుండా ఉన్నారు.