Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్ కిడ్నాప్ కేసు చివ‌ర‌కు వీగిపోయింది!

By:  Tupaki Desk   |   25 Sep 2018 11:29 AM GMT
సూప‌ర్ స్టార్ కిడ్నాప్ కేసు చివ‌ర‌కు వీగిపోయింది!
X
దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన క‌న్న‌డ సూప‌ర్ స్టార్ రాజ్ కుమార్ కిడ్నాప్ కేసు గుర్తుందా? దాదాపుగా ప‌ద్దెనిమిదేళ్ల క్రితం రాజ్ కుమార్ ను వీర‌ప్ప‌న్ మ‌నుషులు కిడ్నాప్ చేయ‌టం.. అనంత‌రం ఆయ‌న క్షేమంగా బ‌య‌ట‌ప‌డ‌టం తెలిసిందే.

అప్ప‌టి కేసుకు సంబంధించిన తుది తీర్పును నేడు త‌మిళ‌నాడు న్యాయ‌స్థానం వెల్ల‌డించింది. ఈ కేసులో నిందితులుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న తొమ్మిది మందిని కోర్టు నిర్దోషులుగా ప్ర‌క‌టించింది. వారిపై న‌మోదు చేసిన కిడ్నాప్ ఆరోప‌ణ‌ల్ని బ‌ల‌ప‌ర్చే ఎలాంటి ఆధారాలు.. సాక్ష్యాలు లేని నేప‌థ్యంలో వారిపై ఉన్న నేరారోప‌ణ‌ల్ని కొట్టి వేస్తూ కోర్టు నిర్ణ‌యం తీసుకుంది.

నిందితులు వీర‌ప్ప‌న్ మ‌నుషులే అన‌టానికి స‌రైన సాక్ష్యాలు లేవ‌ని కోర్టు పేర్కొంది. 2000 జులై 30న క‌న్న‌డ సూప‌ర్ స్టార్ రాజ్ కుమార్ త‌న ఫామ్ హౌస్ లో ఉన్న వేళ కిడ్నాప్ అయ్యారు. ఆయ‌న్ను ఆయుధాల‌తో బెదిరించి అడ‌వుల్లోకి తీసుకెళ్లారు. దాదాపు 108 రోజుల త‌ర్వాత రాజ్ కుమార్ ను విడిచిపెట్టారు. అప్ప‌ట్లో ఈ కిడ్నాప్ ఉదంతం క‌ర్ణాట‌క‌.. త‌మిళ‌నాడు రాష్ట్రాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు తావిచ్చింది. రాజ్ కుమార్ కిడ్నాప్ కావ‌టం బెంగ‌ళూరులోనూ తీవ్ర అల్ల‌ర్ల‌కు కార‌ణ‌మైంది.

ఈ కిడ్నాప్ కు సూత్ర‌ధారిగా గంధం చెక్క‌లు.. ఏనుగు దంతాల స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ ప్ర‌ధాన నిందితుడి పేర్కొంటూ ఆయ‌న అనుచ‌రులంటూ మొత్తం 13 మందిపై కేసులు న‌మోదు చేశారు. అనంత‌రం తొమ్మిది మంది మిన‌హా మిగిలిన వారంతా చ‌నిపోయారు. వీర‌ప్ప‌న్ ఎన్ కౌంట‌ర్లో హ‌త‌మ‌య్యారు. తాజాగా.. తొమ్మిది మందిపై పోలీసులు న‌మోదు చేసిన నేరారోప‌ణ‌లు రుజువుకాక‌పోవ‌టంతో వారిని నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు విడుద‌ల చేసింది. మ‌రి.. ఈ 18ఏళ్లుగా వారు ప‌డే వేద‌న‌కు ఎవ‌రు బాధ్యులు..?