Begin typing your search above and press return to search.

ఆయ‌న‌కు జ‌గ‌న్ ఎర్త్ పెడుతున్నారా..!

By:  Tupaki Desk   |   29 July 2016 7:30 PM GMT
ఆయ‌న‌కు జ‌గ‌న్ ఎర్త్ పెడుతున్నారా..!
X
రాజ‌కీయాల‌న్నాక ఏమైనా జ‌ర‌గొచ్చు! అది అలానే జ‌ర‌గాలి. ఇది ఇలానే జ‌ర‌గాలి అనేం ఉండ‌దు. లెక్క‌లు ఎప్పుడైనా ఎలాగైనా మారిపోవ‌చ్చు. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి వైకాపా సీనియ‌ర్ నేత అనంత‌పురం రాజ‌కీయాల్లో ఊపుమీదున్న గుర్నాథ‌రెడ్డికి ఎదురుకానుందా? అంటే అవున‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అనంత‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో గుర్నాథ‌రెడ్డి స్టైలే వేరు. వైకాపాలో ఆయ‌న తిరుగులేని నేత‌గా ఉంటున్నారు. దీంతో ప్ర‌స్తుతం తాను మాజీ అయిన‌ప్ప‌టికీ.. వ‌చ్చే ద‌ఫా ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెల‌వ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న ప‌క్కా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, ఇంత‌లోనే ఆయ‌న‌ను పంటికింద రాయిలా.. డాక్ట‌ర్ రాజీవ్ రెడ్డి వ్య‌వ‌హారం తెగ స‌లిపేస్తోంది. గ‌త రెండేళ్లుగా రాజీవ్ రెడ్డి.. అనంత‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌దైన స్టైల్‌ లో దూసుకుపోతున్నారు.

వృత్తిరీత్యా డాక్ట‌ర్ అయిన రాజీవ్ రెడ్డి.. దానిని వ‌దిలిపెట్టి.. రాజ‌కీయాలనే వృత్తి చేసుకున్నారు. అంతేకాకుండా గ‌త కొంత‌కాలంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం అంతా చుట్టేస్తున్నారు. జగన్‌ సలహా మేరకు గ‌డ‌ప గ‌డ‌ప‌కి కార్య‌క్ర‌మంలో క్ష‌ణం తీరిక లేకుండా తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తున్నారు. స‌మ‌స్య‌లు తెలుసుకుంటారు. ప‌లు ఆస్ప‌త్రుల్లో రోగుల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం అందిస్తున్నారు. వృద్ధులు.. వికలాంగుల కోసం తరచూ మెడికల్‌ క్యాంప్‌ లు ఏర్పాటు చేస్తున్నారు. కంటిచూపు మందగించిన వారికి ఉచితంగా చికిత్స చేయిస్తున్నారు. ఏ రాజ‌కీయ నేతైనా ఎందుకింత‌గా ప్ర‌జాసేవ చేస్తారో అంద‌రికీ తెలిసిందే. రాబోయే 2019లో అసెంబ్లీ టికెట్ ఆశించే ఈయ‌న ఇలా చేస్తున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. ఇప్పుడు ఇదే అంశాన్ని గుర్నాథ‌రెడ్డిని తొలిచేస్తోంది.

ఈ సీటుపై తాను ఎన్నో ఆశ‌లు పెట్టుకుంటే పాన‌కంలో పుడ‌క‌లో రాజీవ్ రెడ్డి అరంగేట్రం చేయ‌డంపై గుర్నాథ‌రెడ్డి వ‌ర్గం తీవ్రంగా ఫైరైపోతోంది. గురునాథరెడ్డి కుటుంబానికి రాజీవ్‌ పోటీగా తయారయ్యారని పార్టీ నేతలే కాదు.. సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్నారు. అధినేత జ‌గ‌న్ ఆదేశాలు - అభ‌యం లేకుండా రాజీవ్ ఇలా ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఖ‌ర్చు చేస్తారా? అనే విష‌యంలో దృష్టి సారిస్తున్నారు. జ‌గ‌న్ కావాల‌నే.. గుర్నాథ‌రెడ్డికి ఎర్త్ పెట్టే భాగంలోనే రాజీవ్‌ ను రంగంలోకి దింపార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అయితే, గుర్నాథ‌రెడ్డికి ఎందుకు ఎర్త్ పెట్టాల‌నుకుంటున్నారు? అంటే మాత్రం ఇప్ప‌టికిప్పుడు స‌మాధానం క‌నిపించ‌డం లేదు.

అయితే, ప్ర‌స్తుతానికి ఎవ‌రైతే ఖ‌ర్చు చేస్తారో వారిని దువ్వి.. వారితో ఖ‌ర్చు చేయించి.. త‌ర్వాత పార్టీ టికెట్ల విష‌యానికి వ‌చ్చే స‌రికి.. త‌న‌కు న‌చ్చిన వారికి ఇవ్వ‌డం జ‌గ‌న్ అల‌వాట‌ని, గ‌తంలోనూ ఇలాంటివి ఎన్నో జ‌రిగాయ‌ని వారు చెబుతున్నారు. ఇప్పుడు కూడా ఇదే నిజ‌మైతే.. రాజీవ్ సంక‌ట ప‌రిస్థితి ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. ఏదేమైనా రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్యం కావొచ్చు. మ‌రి గుర్నాథ రెడ్డికి ఎర్త్ సిద్ధ‌మ‌వుతోంద‌నే అనుకోవాలా? భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి.