Begin typing your search above and press return to search.

ఏపీలో సెట్‌టాప్ బాక్స్‌ల కుంభ‌కోణం?!

By:  Tupaki Desk   |   26 Sep 2016 8:56 AM GMT
ఏపీలో సెట్‌టాప్ బాక్స్‌ల కుంభ‌కోణం?!
X
ఏపీలోని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌డుతున్న ఫైబ‌ర్ గ్రిడ్ ప‌నుల్లో ప్ర‌ధాన‌మైన సెట్ టాప్ బాక్సుల వ్య‌వ‌హారంలో అవినీతికి తెర‌లెత్తుతున్నార‌నే వ్యాఖ్య‌లు విన‌వ‌స్తున్నాయి. దాదాపు వంద కోట్ల వ‌ర‌కు కుంభ‌కోణానికి ప‌క్కా స్కెచ్ సిద్ధ‌మైపోయింద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సాధార‌ణంగా దేశ వ్యాప్తంగా అంద‌రూ సెట్ టాప్ బాక్సులు ఏర్పాటు చేసుకోవాల‌ని కోర్టులు గ‌తంలోనే ఆదేశించాయి. అయితే, ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌యాన్ని పెంచుతూ వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ఏపీలోనూ సెట్ టాప్ బాక్స్‌ల ఏర్పాటు అనివార్య‌మైంది. అయితే, చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన రెండే ఏడాది ప్రారంభంలోనే ఫైబ‌ర్ గ్రిడ్‌కి ప్లాన్ చేసింది. దీని ద్వారా టీవీ, ఇంట‌ర్నెట్‌, ఫోన్ త‌దిత‌ర అవ‌స‌రాల‌ను ఒకే సెట్ టాప్ బాక్స్ ద్వారా తీర్చుకోవ‌డంతోపాటు కేవ‌లం 149 రూపాయ‌లు చెల్లిస్తే చాల‌ని ప్ర‌క‌టించింది.

దీంతో 16 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఇంట‌ర్నెట్, 200ల‌కు పైగా ఛానెళ్ల‌తో టీవీ, ఫోన్ స‌దుపాయం వ‌స్తుంద‌ని సీఎం చంద్ర‌బాబే స్వ‌యంగా ప్ర‌క‌టించారు. దీనికి సంబంధించి ప్రభుత్వ‌మే ఓ సెట్‌టాప్ బాక్స్‌ను ప్ర‌జ‌ల‌కు స‌బ్సిడీ స‌హా త‌క్కువ మొత్తం వాయిదాల‌పై అందిస్తుంద‌ని సీఎం చెప్పారు. అయితే, ఇప్పుడు ఈ సెట్ టాప్ బాక్స్‌ల వ్య‌వ‌హారంలోనే భారీ కుంభ‌కోణానికి ప్లాన్ జ‌రిగిపోయింద‌ని వార్త‌లు వస్తున్నాయి. సాధార‌ణంగా టీవీ ఛానెళ్ల‌కు వినియోగిస్తున్న సెట్ టాప్ బాక్కులు మార్కెట్‌లో రూ.1500 నుంచి రూ.2000 మ‌ధ్య అత్యున్న‌త సంస్థ‌ల‌కు చెందిన‌వే ల‌భిస్తున్నాయి. అయితే, ఏపీ ప్ర‌భుత్వం మాత్రం తాను ప్ర‌జ‌ల‌కు అందించే సెట్ టాప్ బాక్స్ ఖ‌రీదును రూ.4 వేలుగా నిర్ధారించడంపైనే అనుమానాలు వ‌స్తున్నాయి.

అయితే, ప్ర‌భుత్వం మాత్రం తాము అందించే సెట్ టాప్ బాక్స్‌లో ఇంట‌ర్నెట్‌, ఫోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబ‌ట్టి రేటు ఎక్కువని చెబుతోంది. కానీ, ఎన్ని ఫీచ‌ర్లు పెట్టినా.. రూ. 3000ల‌కు మించ‌ద‌ని అంటున్నారు దీనిపై అవ‌గాహ‌న ఉన్న‌వారు. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం తొలి విడ‌త‌గా 10 ల‌క్ష‌ల సెట్ టాప్ బాక్స్‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ క్ర‌మంలో 300 కోట్ల రూపాయల రుణానికి గ్యారంటీ కూడా ప్ర‌భుత్వం ఇవ్వబోతోంది.

దీంతో తొలి విడ‌త‌ల‌తోనే ఒక్కొక్క బాక్స్‌కి రూ.1000 చొప్పున మొత్తంగా 100 కోట్ల మేర‌కు అవినీతి జ‌రిగే ఛాన్స్ ఉంద‌నే వాద‌న వ‌స్తోంది.

మ‌రి భ‌విష్య‌త్తులో మొత్తంగా 60 ల‌క్ష‌ల సెట్ టాప్ బాక్స్‌లు ప్ర‌జ‌ల‌కు అందించాల‌ని స‌ర్కారు సిద్ధ‌మైంది. దీంతో దాదాపు 600 కోట్లు ప‌క్క‌దారి ప‌ట్టే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. మ‌రి దీనిలో నిజం ఎంత ఉందో తెలియ‌దు కానీ.. ప్ర‌స్తుతానికైతే బ‌హిరంగ మార్కెట్ క‌న్నా అధిక‌మొత్తానికి ప్ర‌జ‌ల‌కు క‌ట్ట‌బెట్ట‌డం జ‌రుగుతోంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి దీనిపై సీఎం చంద్ర‌బాబు దృష్టి సారిస్తారో లేదో చూడాలి. త‌న ప్ర‌భుత్వంలో అవినీతిని స‌హించేది లేద‌ని చెప్పే చంద్ర‌బాబు.. తాజా సెట్ బాక్స్‌ల వ్య‌వ‌హారం ర‌చ్చ‌కెక్క‌క‌ముందే చ‌ర్య‌లు తీసుకోవాలి.