Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఆరోగ్యంపై అనుమానాలతోనే నేతలు బీజేపీలోకి?

By:  Tupaki Desk   |   23 Aug 2019 9:23 AM GMT
చంద్రబాబు ఆరోగ్యంపై అనుమానాలతోనే నేతలు బీజేపీలోకి?
X
ఎన్నికల్లో ఎదురైనది మామూలు పరాభవం కాదు. అంతటి పరాభం ఎదురైన తర్వాత ఏ పార్టీ అయినా అంత త్వరగా కోలుకోవడం సాధ్యం కాదు. రెండు వేల నాలుగు సమయంలో తెలుగుదేశం పార్టీ అలాంటి పరాభవాన్నే ఎదుర్కొంది. ఆ తర్వాత కోలుకోవడానికి పదేళ్లు పట్టింది. అది కూడా బీజేపీకి ఊపు రావడం - పవన్ కల్యాణ్ తోడు కావడంతో దక్కిన విజయమే తప్ప చంద్రబాబు నాయుడి సొంత బలంతో విభజన తర్వాత తెలుగుదేశం అధికారం సంపాదించుకోలేదు.

అవతల చూస్తే జగన్ మోహన్ రెడ్డి పాతుకుపోయేలా కనిపిస్తూ ఉన్నారు. ఈ రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు నాయడు ఆరోగ్యం గురించి తెలుగుదేశం శిబిరంలో కొత్త అనుమానాలు రేగుతూ ఉన్నాయనే టాక్ వినిపిస్తూ ఉంది. ఎన్నికల్లో ఎదురైన దారుణ పరాభవంతో చంద్రబాబు నాయుడు మానసికంగా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

తనయుడు ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవడం - తన మెజారిటీ కూడా తగ్గిపోవడం - పార్టీ కేవలం ఇరవై మూడు సీట్లకు పరిమితం కావడం వంటివి చంద్రబాబు నాయుడును మానసికంగా దెబ్బతీశాయని తెలుగుదేశంలో చర్చ జరుగుతూ ఉంది.

మరోవైపు ఆయనకు శారీరక సమస్యలు ఇబ్బందిగా మారాయట. అందుకే ముందుగా హైదరాబాద్ లో చికిత్స చేయించుకోవడం - ఆ వెంటనే అమెరికాకు వెళ్లి చికిత్స పొందడం చేశాడంటారు. మామూలుగా చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిని రహస్యంగా పెట్టేవారే. అయితే ఇప్పుడు రహస్యంగా పెట్టలేని పరిస్థితి ఉందట.

ప్రతిపక్షంలో ఉంటూ చంద్రబాబు నాయుడు ఇంకా ఐదేళ్ల పాటు నెట్టుకురావడం కష్టం అని, అందుకే ఆయన రాజకీయాలను ఇక పెద్దగా పట్టించుకోకపోవచ్చనే ప్రచారం తెలుగుదేశం వాళ్లలో సాగుతూ ఉంది.

ఇక లోకేష్ గురించి ఎంత తక్కువమాట్లాడుకుంటే అంతమంచిది. లోకేష్ ప్రతిభాపాటవాలు ఏమిటో బయటపడుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల్లో తెలుగుదేశం పార్టీలో కొనసాగడానికి చాలా మంది నేతలు ధైర్యం చేయలేకపోతూ ఉన్నారని భోగట్టా. ఈ పరిణామాల్లో బలోపేతం కావాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు వారికి ఊరటగా మారాయి. అందుకే వరసగా వారు కమలం పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారని..చంద్రబాబు నాయుడుకు అతి సన్నిహిత నేతలే జంప్ అయిన నేపథ్యంలో మిగతా వారూ ఒక్కొక్కరుగా అటు దూకుతున్నారనేది ఇన్ సైడ్ టాక్!