Begin typing your search above and press return to search.

కోడెల కొడుకు చుట్టూ ప్రశ్నలు!

By:  Tupaki Desk   |   16 Sep 2019 11:19 AM GMT
కోడెల కొడుకు చుట్టూ ప్రశ్నలు!
X
కోడెల ఆకస్మిక మృతి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయ్యింది. ఒక సీనియర్ లీడర్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం అరుదైన విషయం. అందుకే దీనిపై సోషల్ మీడియాలో, జనాల్లో అనేక ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. అన్ని అనుమానాలకు మూల కారణం... కోడెల కొడుకు ఆస్పత్రికి రాకపోవడం.

వాస్తవానికి కోడెల సేవాభావం చూసే ఎన్టీఆర్ ఆనాడు రాజకీయాల్లోకి తీసుకున్నారు. కానీ కొడుకు కూతురు పెద్ద వాళ్లు అయ్యాక వారి జోక్యం పెరిగినప్పటి నుంచి కోడెల రాజకీయ జీవితం మరో మలుపు తిరిగింది. అవినీతి, అక్రమ ఆరోపణలు ఆ కుటుంబంపై చాలా వచ్చాయి. ముఖ్యంగా గత ఐదేళ్ల కాలంలో ఉన్న ఆరోపణలు చాలా ఎక్కువ. ఇటీవల ఆయన కొడుకు - కూతురుపై పలువురు కేసులు కూడా పెట్టారు. ఫర్నీచర్ గొడవలో ఆయనపై కూడా కేసు నమోదయ్యింది. వీటన్నింటి నేపథ్యంలో అవమానాలు తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారా... లేదా పిల్లల వ్యవహార శైలి ఆయన మరణానికి కారణమా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. కొడుకు ఆస్పత్రికి రాకపోయేసరికి... ఆయన ఊర్లో ఉన్నారా? లేరా? ఉంటే ఎందుకు రాలేదు. లేకపోతే ఎక్కడున్నారనే విషయం ఇంకా ఎందుకు బయటకు రాలేదు వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరక్కపోవడంతో ఈ వ్యవహారంపై అనుమానాలు పెరిగాయి.

గుండెపోటు అని కొద్దిసేపు వార్తలు రావడం, ప్రముఖ దినపత్రిక ఒకటి చనిపోవడానికి విషపు ఇంజెక్షన్లు తీసుకున్నారని చెబుతుండటం వీటి నేపథ్యంలో గందరగోళం నెలకొంది. రాత్రే ఆత్మహత్య చేసుకుని కొన్ని వార్తలు రాగా, ఉదయం 11 గంటలకు ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని వార్తలు వచ్చాయి. మరోవైపు కోడెలను సమీపంలో అనేక సాధారణ ఆస్పత్రులున్నా ఎందుకు క్యాన్సర్ ఆస్పత్రి అయిన బసవతారకంలో చేర్పించారని ప్రశ్నలు కొత్త అనుమానాలకు తావిస్తున్నాయి. మరణానికి కారణం గుండెపోటా? విషపు ఇంజెక్షనా.. ఇంకేమైనా అనేది పోస్టు మార్టం నివేదిక తర్వాత తేలనుంది.

పోలీసుు ప్రాథమిక విచారణలో సంఘటన స్థలంపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. కానీ పోస్టు మార్టం నివేదిక తర్వాత పూర్తి విచారణలో కోడెల ఇంట్లో కొద్ది రోజులుగా ఏం జరుగుతోందనేది బయటకు వచ్చాక అసలు నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది.