Begin typing your search above and press return to search.

‘‘హిజ్ ఎక్స్ లెన్సీ’’ అన్న మాట వద్దనేశారు

By:  Tupaki Desk   |   24 Oct 2016 5:59 AM GMT
‘‘హిజ్ ఎక్స్ లెన్సీ’’ అన్న మాట వద్దనేశారు
X
తెల్లోడు వదిలేసి వెళ్లిన విధానాల్లో చాలావరకూ నేటికీ మార్చకుండా.. యథాతధంగా అమలు చేయటం మన దగ్గర కనిపిస్తుంది. మరీ.. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలాంటివి కనిపిస్తాయి. ఎందుకిలా?అన్న ప్రశ్నను సూటిగా ప్రశ్నిస్తే దానికి తర్కంగా సమాధానం చెప్పే వారు పెద్దగా కనిపించరు. సంప్రదాయం ప్రకారం వస్తున్న విధానాల్ని అమలు చేస్తున్నట్లుగా చెబుతారు.

ఏదైనా రాష్ట్రంలో ప్రధమ పౌరుడైన గవర్నర్ ను.. ‘‘హిజ్ ఎక్స్ లెన్సీ’’ అంటూ కీర్తించే వైనం తెలిసిందే. ప్రధమ పౌరుడ్ని గౌరవించటం తప్పేం కాదు. అయితే.. అది తెల్లోడు చెప్పినట్లు కాకుండా.. మన వాతావరణానికి.. మన సంప్రదాయానికి తగ్గట్లుగా ఉంటే ఆ వ్యవహారమే వేరుగా ఉంటుంది. ఎంత కాదన్నా.. ‘‘హిజ్ ఎక్స్ లెన్సీ’’అన్న మాట విన్న వెంటనే భారీ ఆడంబరంగా.. మనకంటే అత్యంత ఉన్నతుడన్న విధంగా ఆ పదం ఉంటుంది. అలా కాకుండా.. ‘‘గౌరవనీయులు’’ అన్న వెంటనే.. మనలో ఒకడన్న భావన కలుగుతుంది. అయితే.. ఇలాంటి విధానాల్ని మార్చమని ఎవరూ అడగరు. కానీ.. అప్పుడప్పడు కొందరు నేతలు మాత్రం ఈ మూస విధానానికి బ్రేక్ చేస్తూ.. కొత్త విధానాల్ని తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తారు.

తాజాగా అలాంటి పనే చేశారు మహారాష్ట్ర గవర్నర్.. తమిళనాడు ఇన్ ఛార్జ్ గవర్నర్ గా వ్యవహరిస్తున్న సీహెచ్ విద్యాసాగర్ రావు. తాజాగా ఆయన తమిళనాడు రాజ్ భవన్ నుంచి ఒక ప్రటనను జారీ చేశారు. ఇందులో.. ఇకపై ‘‘హిజ్ ఎక్స్ లెన్సీ’’ అన్న పదాన్ని గవర్నర్ ముందు వాడొద్దని.. ‘‘గౌరవనీయులు’’ అన్న పదాన్ని వాడితే సరిపోతుందన్న సూచనను తాజా ఆదేశంగా తమిళనాడు రాజ్ భవన్ విడుదల చేసింది.

తాజా పరిణామంతో విద్యాసాగర్ రావు.. గవర్నర్ వ్యవస్థలో సరికొత్త సంస్కరణలకు తెర తీశారని చెప్పాలి. సామాన్య ప్రజలకు రాజ్ భవన్ చాలా దూరమన్న భావనకు బ్రేకులేస్తూ.. అందరితో పాటే ఆయన కూడా అన్న భావన కలిగేలా చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. హిజ్ ఎక్స్ లెన్సీ మీద విద్యాసాగర్ రావు నిర్ణయాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు తమిళనాడుకు పూర్తిస్థాయి గవర్నర్ గా విద్యాసాగర్ రావును కేంద్రం ఖారారు చేయనున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ ఇన్ ఛార్జ్ గా వ్యవహరించిన ఆయనకు..ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యాసాగర్ లాంటి వ్యక్తే తమిళనాడుకు అవసరమవుతారని కేంద్రం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇన్ ఛార్జ్ నుంచి ఫుల్ ఛార్జ్ కి సంబంధించి అధికారిక ఉత్తర్వులు త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/