Begin typing your search above and press return to search.

ట్రంప్..ఎందుకు నీకిన్ని అవ‌మానాలు?

By:  Tupaki Desk   |   17 Aug 2017 5:50 AM GMT
ట్రంప్..ఎందుకు నీకిన్ని అవ‌మానాలు?
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప‌లువురు జాలి ప‌డుతున్నారు. ఆయ‌న‌కు దేశీయంగా, అంత‌ర్జాతీయంగా అవ‌మానాలు ఎదుర‌వుతున్నాయ‌ని అంటున్నారు. వర్జీనియాలోని చార్లొటెస్ విల్లే ర్యాలీలో హింస నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్నారు. జాత్యహంకార ర్యాలీని ఖండించకపోవడంపై తమ పార్టీతోపాటు, ప్రతిపక్షం కూడా దుయ్యబడుతున్నా ఆయన వైఖరి మార్చుకోకుండా తన వాదనే సరైనదంటున్నారు. ఆయన ధోరణిని వైట్‌హౌస్ వర్గాలు సైతం నిరసిస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై వైట్‌హౌస్ సలహామండలి నుంచి మెర్క్, ఇంటెల్, అండర్ అర్మర్ సంస్థల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వైదొలిగారు. మంగళవారం ఉత్పత్తుల రంగానికి సంబంధించిన ట్రంప్ సలహా మండలి నుంచి అమెరికాలోని ప్రధాన కార్మిక సంఘం అధ్యక్షుడు రిటర్డ్ ట్రమ్కా తప్పుకొన్నారు.

జాత్యహంకార, ప్రజాస్వామిక ఉగ్రవాదాల్ని సహించే అధ్యక్షునికి సలహాదారుగా తానుండలేనంటూ ట్రమ్కా వైట్‌హౌస్ మండలి పదవికి రాజీనామా చేశారు. జాత్యహంకార ధోరణిని ట్రంప్ ఖండించడం లేదు, సరికదా తన వాదనను సమర్థించుకుంటున్నారు. ``జాత్యహంకార వాదులకు చట్టబద్ధత ఉన్నదనే వైఖరితో మాట్లాడుతున్నారు. ఇందుకు రాజీనామాలతో అమెరికా కార్మికవర్గం తరఫున మనం నిరసన తెలుపాలి`` అని పేర్కొంటూ ట్రమ్కా ప్రకటన చేశారు. ఈయనతో ట్రంప్ విధానాలకు నిరసనగా రాజీనామా చేసిన ప్రముఖుల సంఖ్య ఎనిమిదికి చేరింది. గత శనివారం వర్జీనియాలో యునైట్ ది రైట్ అనే పేరిట శ్వేతజాతీయులు, నయా నాజీలు కలిసి జాత్యంహకార ర్యాలీ నిర్వహించడం, వారిని వ్యతిరేకిస్తూ ఉదారవాదులు పోటీ ర్యాలీ తీయడం...ఒక వర్గానికి చెందిన వారు మరోవర్గంపైకి కారుతో దూసుకువెళ్లడంతో ఒక మహిళ చనిపోగా 19 మంది గాయపడిన సంగతి విదితమే. ఈ హింసకు శ్వేతజాతి ఆధిపత్యవాదులతోపాటు, వారిని వ్యతిరేకించేవారు కూడా కారణమన్న తన వాదనను అధ్యక్షుడు ట్రంప్ సమర్థించుకుంటున్నారు. ట్రంప్ వైఖరిని అమెరికాలోని భారతీయులు కూడా ఖండిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు దేశానికి అవమానకరమైనవని అమెరికా చట్టసభ సభ్యులు రాజా కృష్టమూర్తి, అమీ బెరా అన్నారు.

మ‌రోవైపు ఈ నెల 12న వర్జీనియాలో జాత్యహంకార ర్యాలీల నేపథ్యంలో హింసకు వ్యతిరేకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన ట్వీట్లకు పెద్ద ఎత్తున ప్రజా స్పందన లభిస్తుంది. ఇప్పటివరకు ఆయన ట్వీట్లకు 30 లక్షల మందికి పైగా స్పందించారు. నెటిజన్లు 28 లక్షలసార్లు వాటిని సోషల్ మీడియాలో లింక్ చేశారు. 11 లక్షల సార్లు రీట్వీట్ చేశారు. రీట్వీట్లలో ఇది అతి పెద్ద రికార్డుగా భావిస్తున్నారు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఉద్యమించి దక్షిణాఫ్రికాను శ్వేతజాతీయుల పాలన నుంచి విముక్తం చేసిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా సందేశాన్ని ఉటంకిస్తూ ఒబామా ట్వీట్ చేశారు. ఇతరుల శరీరవర్ణాన్ని, నేపథ్యాన్ని, మతాన్ని ద్వేషిస్తూ ఎవరూ జన్మించరు అన్న మండేలా సందేశం వాటిలో ఒకటి.