Begin typing your search above and press return to search.

ట్రంప్ అమెరికన్ల మనసు దోచుకుంటున్నాడట

By:  Tupaki Desk   |   25 May 2016 4:57 PM GMT
ట్రంప్ అమెరికన్ల మనసు దోచుకుంటున్నాడట
X
తన నోటి మాటలతో ప్రపంచానికి షాకుల మీద షాకులు ఇస్తూ.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న బిజినెస్ టైకూన్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున అభ్యర్థిగా బరిలోకి దిగాలని తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. అతగాడి మాటల దెబ్బకు రిపబ్లికన్ల అభ్యర్థులు వెనక్కి వెళ్లి తుది బరిలో ట్రంప్ మాత్రమే నిలిచిన సంగతి తెలిసిందే. ఆయనకు పోటీగా డెమొక్రాట్ల తరపున హిల్లరీ క్లింటన్ తుది అభ్యర్థిగా నిలిచే అవకాశం ఉంది.

కంపు మాటలు మాట్లాడుతూ.. ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న ట్రంప్ లాంటి వ్యక్తి అమెరికా అధ్యక్ష పదవిని చేపడితే పరిస్థితులు ఎంత దారుణంగా తయారవుతాయోనన్న భయాందోళనలు ఓపక్క ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతుంటే.. మరోపక్క అమెరికన్లు మాత్రం ట్రంప్ పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తున్నారట. ఆయన మాటల మేజిక్ లో పడిపోయినట్లుగా తాజాగా నిర్వహించిన సర్వేలు స్పష్టం చేయటం షాకింగ్ గా మారింది. అతివాదాన్ని ఏ మాత్రం ఇష్టపడని అమెరికన్లు.. ట్రంప్ మాటల మాయలో పడిపోయారని.. హిల్లరీ కంటే ఆయనిప్పుడు స్వల్ప అధిక్యతలో ఉన్నారని చెబుతున్నారు. హిల్లరీ కంటే ట్రంప్ నే అమెరికా అధ్యక్షునిగా ఎన్నుకునేందుకు అమెరికన్లు మొగ్గు చూపుతున్నారన్న సర్వే రిపోర్టులు చూస్తున్న వారికి నోట మాట రాని పరిస్థితి.

తాజా సర్వే ఫలితాల్ని చూస్తున్న వారంతా ఈ అమెరికన్లకు ఏమైందన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సదరు సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో హిల్లరీ కంటే ట్రంప్ 0.2 శాతం అధిక్యతలో ఉండటం గమనార్హం. ఈ సర్వేకు తగ్గట్లే కొన్ని మీడియా సంస్థలు చేపట్టిన మరికొన్ని అంచనాలు సైతం ట్రంప్ అధిక్యతలో ఉన్నట్లుగా వెల్లడించటం గమనార్హం. ఏబీసీ.. న్యూ వాషింగ్టన్ పోస్ట్.. ఫాక్స్ న్యూస్ లు ట్రంప్ ముందంజలో ఉన్నట్లు పేర్కొంటే.. ఎన్ బీసీ.. వాల్ స్ట్రీట్ జర్నల్.. సీబీఎస్ న్యూస్.. న్యూయార్క్ టైమ్స్ లు హిల్లరీ ముందంజలో ఉన్నట్లుగా చెబుతున్నాయి. తాజా ఫలితాల నేపథ్యంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముందుగా అనుకున్నంత సింఫుల్ గా తేలిపోవన్న స్పష్టం చేసినట్లేనని చెప్పక తప్పదు.