Begin typing your search above and press return to search.

మ‌నోళ్ల‌కు షాకిచ్చే వార్త చెప్పిన ట్రంప్‌

By:  Tupaki Desk   |   3 April 2018 5:55 AM GMT
మ‌నోళ్ల‌కు షాకిచ్చే వార్త చెప్పిన ట్రంప్‌
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు అస్స‌లు న‌చ్చ‌ని ప‌దం అయిన‌ వ‌ల‌స‌దారుల విష‌యంలో మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. డ్రీమ‌ర్స్ పేరుతో అనుమ‌తితో చిన్న‌త‌నంలో త‌ల్లిదండ్రుల వెంట‌ వ‌చ్చిన వారయిన పేరు ప్ర‌స్తావించ‌గానే ట్రంప్ నిప్పులు చెరుగుతుంటారు. అదే రీతిలో మ‌రోమారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. డ్రీమర్లు (స్వాప్నికులు)గా పిలిచే యువ ఇమ్మిగ్రెంట్ల హోదాకు చట్టబద్ధత కల్పించలేదని స్పష్టం చేశారు. దీనిపై తాము ఎలాంటి ఒప్పందం కుదర్చుకోలేదని అన్నారు. డాకా ( డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌ హుడ్‌ అరైవల్స్‌) ప్రోగ్రామ్‌కు సంబంధించి చట్టబద్ధత కల్పించుటపై నిర్ణయం తీసుకోలేదన్నారు.

ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌లో గల మారా లాగో రిసార్ట్‌ లో ఈస్టర్‌ ను జరుపుకున్న ట్రంప్‌ ప్రజలకు ఈస్టర్‌ అభినందనలు తెలియచేసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. మెక్సికో నుంచి అమెరికాకు మాదకద్రవ్యాల అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని, దీన్ని కట్టడి చేయాల్సిన అవసరముందన్నారు. అమెరికా-మెక్సికో సరిహద్దు మరింత ప్రమాదకరంగా మారిందని ఆయన ప్రకటించారు. పట్టుకోవడం - వదిలివేయడం వంటి హాస్యాస్పదమైన లిబరల్‌ (డెమోక్రట్ల) చట్టాల కారణంగా సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా సిబ్బంది తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారని ట్రప్ అన్నారు. మెక్సికో - కెనడాలతో ప్రస్తుతం చర్చిస్తున్న ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా) రద్దు చేస్తానని ట్రంప్‌ హెచ్చరించారు. మెక్సికోతో గల దక్షిణ సరిహద్దు ద్వారా ప్రజల రాకపోకలను నిలుపు చేయడానికి మెక్సికో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ట్రంప్‌ విమర్శించారు.

స్వాప్నికులకు దశలవారీగా అమెరికా పౌరసత్వం ఇచ్చేందుకు ఒబామా ప్రభుత్వం డెఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌ హుడ్ అరైవల్స్ (డీఏసీఏ) పథకాన్ని తెచ్చింది. ట్రంప్ గత సెప్టెంబర్‌ లో ఈ పథకాన్ని ఎత్తివేశారు. దీంతో ఆరు నెలల్లోగా పరిష్కారం చూపాలని ప్రజాప్రతినిధుల సభ(కాంగ్రెస్)కు సూచించింది. లేకుంటే మార్చి 5వ తేదీ నుంచి డ్రీమర్స్ అందరూ దేశ బహిష్కరణకు గురవుతారు. దీంతో ఇరుపక్షాలు పలు దఫాలు జరిపిన చర్చల్లో అమెరికాలోని 18 లక్షల మంది డ్రీమర్లకు పౌరసత్వం ఇచ్చేందుకు ట్రంప్ ప్రభుత్వం ఒప్పుకోగా.. అమెరికా - మెక్సికో మధ్య గోడ నిర్మాణానికి ప్రతిపక్షం ఒప్పుకుంది. పరస్పర ఒప్పందంతో బిల్లును రూపొందించి ఎగువ సభలో ప్రవేశపెట్టినా తిరస్కరణకు గురయ్యాయి. త‌ద్వారా ఈ నిర్ణయం వల్ల దాదాపు 7000 మంది ఇండియన్ అమెరికన్లతో సహా మొత్తం 18,00,000 మంది భవిష్యత్తు దెబ్బతినే ప్ర‌మాదం ఎదురుకానుంది.