Begin typing your search above and press return to search.

మూడో జెండ‌ర్ ను కెలికిన ట్రంప్

By:  Tupaki Desk   |   28 July 2017 7:15 AM GMT
మూడో జెండ‌ర్ ను కెలికిన ట్రంప్
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వివాదాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే అన్న‌ట్లుగా ప‌రిస్థితి మారిపోతోంది. ఆయ‌న తీసుకునే నిర్ణ‌యం వివాదాస్పదం అవుతోంది అన‌డం కంటే...వివాదాస్పదం అయ్యే నిర్ణ‌యాల‌నే తీసుకోవ‌డం ట్రంప్ స్టైల్ అని చెప్ప‌డం క‌రెక్టేమో! తాజాగా ట్రాన్స్‌జెండర్స్‌ విషయంలో తీసుకున్న నిర్ణయం మరో వివాదాన్ని రేపింది. దేశ మిలటరీ రంగంలో పని చేయడానికి హిజ్రాలు (ట్రాన్స్‌ జెండర్స్‌) పనికిరారని, వారి ఆరోగ్యంపై మిలటరీ చేస్తున్న ఖర్చు తలకు మించిన భారంగా మారిందంటూ వారిపై బుధవారం ట్రంప్‌ నిషేధం విధించారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఈ నిర్ణయంపై ప్రతిఘటన మొదలైంది. డోనాల్డ్‌ ట్రంప్‌ నకు వ్యతిరేక నినాదాలతో అమెరికా వినువీధులు గర్జించాయి.

అమెరికా మిలటరీ రిజర్వ్‌ సర్వీసులలో 4 వేల మంది ట్రాన్స్‌జెండర్స్‌ ఉన్నారని ఒక స్వతంత్ర సంస్థ లేక్కతేల్చింది. 10 వేల మంది పైగానే ఉన్నారని హక్కుల సంఘాలు తెలుపుతున్నాయి. మిలటరీ సర్వీసుల్లో 'ట్రాన్స్‌జెండర్స్‌' చేరొచ్చు నని...ఒబామా సర్కార్‌ 2016లో నిర్ణయం తీసుకున్నది. అయితే నియామకాలు వెంటనే ప్రారంభం కాలేదు. లింగమార్పిడి చేసుకోవాలనుకునే వారికి వైద్యపరమైన సహాయాన్ని కూడా రక్షణ శాఖ ఇవ్వాలని ఆనాడు నిర్ణయించారు. మిలటరీలో 'ట్రాన్స్‌జెండర్స్‌' ఉండటం మూలాన మిలటరీ వైద్య ఖర్చులు పెరిగిపోతుందన్నది ట్రంప్‌ ఆరోపణ. మిలటరీ విజయాలపై దృష్టి సారించాలంటే 'ట్రాన్స్‌జెండర్స్‌' సైనికుల ఆరోగ్య ఖర్చుల భారాన్ని తగ్గించుకోక తప్పదని ట్రంప్ ఈ నిషేధం విధించారు. మిలటరీలోని జనరల్స్‌ - నిపుణులను సంప్రదించిన అనంతరమే తాను 'ట్రాన్స్‌జెండర్స్‌'పై నిషేధాన్ని విధించాలనే నిర్ణయానికి వచ్చినట్టు ట్రంప్‌ చెప్పారు.

ట్రంప్ నిర్ణ‌యంతో హక్కుల కార్యకర్తలు రోడ్లమీదకు వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద ఉన్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ సెంటర్‌ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న హిజ్రాలు కన్నీరు కారుస్తూ 'ఈ ప్రెసిడెంట్‌ మాకొద్దూ అంటూ నినదించారు'. ఏం తప్పు చేశామ‌ని త‌మ‌పై నిషేధం విధించారంటూ ప్రశ్నించారు. అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేవదీస్తామని పేర్కొన్నారు.

మరికొందరు వైట్‌ హౌస్‌ వీధిలో మార్చ్‌ నిర్వహించారు. మార్చ్‌ సందర్భంగా.. 'మేం ఇక్కడికి వచ్చాం. మేమంతా ఒక్కటే. మా అందరికీ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ అంటే అసహ్యం' అంటూ నినాదాలు చేశారు. 'మా శరీరాల్లో భాగాల గురించి మీ అందరికీ ఎందుకు.. మేం పోరాడటానికి సిద్ధం' అనే ప్లకార్డుల‌తో వారు గ‌ళం విప్పారు.

కాగా, అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని ఎలా అమలుజేస్తారన్నదానిపై శ్వేతసౌధం, రక్షణ శాఖ విభిన్నంగా స్పందించాయి. ట్రంప్‌ నోటి నుంచి అసలు ఇలాంటి ప్రకటన ఒకటి హఠాత్తుగా ఊడిపడుతుందని ఆ రెండు శాఖల అధికారులు ఊహించలేదు. అమెరికా మిలటరీ సర్వీసుల్లో ఇప్పటికే కొంతమంది ట్రాన్స్‌జెండర్స్‌ ఉన్నారు. వీరిపై ట్రంప్‌ నిర్ణయం ఎలా ప్రభావం చూపుతుందన్న స్పష్టత 'శ్వేతసౌధం' అధికారులు ఇవ్వలేదు. ట్రంప్‌ నిర్ణయాన్ని ఎలా అమలుజేయాలన్న దానిగురించి రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం 'పెంటగాన్‌' ఒక ప్రకటన చేస్తుందని, విధివిధానాల్ని పాలనాయంత్రాంగం రూపొందిస్తుందని శ్వేతసౌధం ఉప అధికార ప్రతినిధి సారా హకాబీ సాండర్స్‌ తెలియజేశారు. ఇది సైనికరంగానికి చెందిన నిర్ణయమని అన్నారు.

మ‌రోవైపు రష్యాతో సంబంధాలు, అటార్నీ జనరల్‌ జెఫ్‌ సెషన్స్‌పై ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తం చేయటం, తన ప్రచార బృందంపై విచారణలు, ఒబామా ఆరోగ్య పథకం స్థానంలో మరోటి తీసుకు రాలేకపోవటం...తదితర అంశాలు ఇటు పార్లమెంట్‌ను, అటు అమెరికా సమాజాన్ని తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ట్రంప్‌నకు వ్యతిరేకంగా సెనెట్‌లో డెమొక్రట్లతో రిపబ్లికన్లు కలిసిపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా రాజకీయ వేడిని చల్లార్చడం కోసం, వాతావరణాన్ని మరో అంశం వైపు తీసుకెళ్లడం కోసం 'మిలటరీలోకి ట్రాన్స్‌జెండర్‌ ప్రవేశించరాదు' అన్న నిర్ణయాన్ని ట్రంప్‌ ప్రకటించారని ఆ దేశ మీడియా విశ్లేషిస్తోంది.