Begin typing your search above and press return to search.

నియంత‌కు వార్ సైర‌న్ మోగించేసిన ట్రంప్‌

By:  Tupaki Desk   |   12 Aug 2017 10:11 AM GMT
నియంత‌కు వార్ సైర‌న్ మోగించేసిన ట్రంప్‌
X
ఉన్న‌ట్లుండి ప్ర‌పంచం మీద యుద్ధ మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. స‌మీప భ‌విష్య‌త్తులో అణు యుద్ధం అన్న‌ది ఉండే అవ‌కాశం లేద‌ని ఈ మ‌ధ్య వ‌ర‌కూ అనుకున్నా.. ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జాంగ్ ఉన్ పుణ్య‌మా అని.. క‌ల‌లో కూడా ఊహించ‌ని అణు యుద్ధం ఏ క్ష‌ణంలో అయినా విరుచుకుప‌డుతుంద‌న్న భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

అమెరికాను నాశ‌నం చేయాల‌న్న క‌ల‌లు క‌న‌ట‌మే కాదు.. ఆ విష‌యాన్ని త‌ర‌చూ వ్యాఖ్యానించే కిమ్‌.. ఈ మ‌ధ్య‌నే అమెరికాకు చెందిన గ్వామ్ దీవుల‌పై అణుదాడి చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌టం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కిమ్ వ్యాఖ్య‌ల‌కు ట్రంప్ అంత‌కు రెట్టింపు స్పీడ్ తో రియాక్ట్ అయ్యారు. ఉత్త‌ర కొరియాను మాట‌ల‌తో లొంగ‌దీసుకొని.. దారికి తెచ్చుకోవాల‌న్న ప్ర‌య‌త్నంలో ట్రంప్ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

కిమ్ మాట‌ల‌కు స్పందించిన ట్రంప్‌.. త‌మ‌ను ఢీ కొట్టాల‌న్న ఆలోచ‌న‌ను మానుకుంటే మంచిద‌న్న రీతిలో ప్ర‌సంగించారు. ఒక‌వేళ ఉత్త‌ర‌కొరియా గ్వామ్ మీద దాడి చేసిన ప‌క్షంలో రాత్రికి రాత్రి యుద్ధానికి సిద్ధ‌మ‌న్న వార్ సైర‌న్ ను మోగించేశారు ట్రంప్‌. అమెరికా అధ్య‌క్షుడి వ్యాఖ్య సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. ప్ర‌పంచ మార్కెట్ల మీద ఆయ‌న మాట‌ల ప్ర‌భావం ప‌డింది. ఉత్త‌ర కొరియా మీద‌నేకాదు.. వెనిజులా సంక్షోభం మీద కూడా మిల‌ట‌రీని ప్ర‌యోగించాల‌న్న ఆలోచ‌న‌ను ట్రంప్ బ‌య‌ట‌పెట్ట‌టంతో ప్ర‌పంచ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల‌కు లోన‌య్యాయి.

ట్రంప్ వ్యాఖ్య‌ల మీద కొరియ‌న్ మీడియా రియాక్ట్ అయ్యింది. అమెరికా దాడులే జ‌రిపిన ప‌క్షంలో త‌మ ప్రాంతం స‌ర్వ‌నాశ‌నం అవుతుంద‌న్న ఆందోళ‌న‌ను వ్య‌క్తం చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ట్రంప్ సంయ‌మ‌నంతో మాట్లాడాల్సిన అవ‌స‌రం ఉందంది. గ్వామ్ ద్వీపానికి ఏదైనా జ‌రిగితే ఉత్త‌ర‌కొరియాపై అణుదాడికి బీ- 1బీ సూప‌ర్ సోనిక్ విమానాలు ప‌సిఫిక్ స‌ముద్ర జ‌ల్లాల్లో సిద్ధంగా ఉన్న‌ట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు.

అయితే.. ఆయ‌న చెప్పిన‌ట్లుగా ప‌సిఫిక్ జ‌లాల్లో అమెరికాకు చెందిన వాయుద‌ళానికి చెందిన హ‌డావుడి ఏమీ లేక‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఇదంతా చూస్తే.. మాట‌ల‌తో ఉత్త‌ర‌కొరియాను లొంగ‌దీసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ట్రంప్ ఉన్నారా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. యుద్ధం సంగ‌తి ఎలా ఉన్నా.. కిమ్‌.. ట్రంప్ మాట‌లు ప్ర‌పంచాన్ని ఉలిక్కిప‌డేలా చేస్తున్నాయి. ట్రంప్ తీవ్ర వ్యాఖ్య‌ల‌కు కిమ్ ఎలా రియాక్ట్ అవుతాడ‌న్న‌ది ఉత్కంట‌గా మారింది. పిచ్చోడి చేతిలో రాయిలా కిమ్ చేతిలో ఉన్న అణ్వ‌స్త్రాలు ఇప్పుడు ప్ర‌పంచానికి పెను ముప్పుగా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.