Begin typing your search above and press return to search.

ట్రంప్ ప్రమాణ‌స్వీకారం...నిర‌స‌న‌ల జోరు

By:  Tupaki Desk   |   20 Jan 2017 9:48 AM GMT
ట్రంప్ ప్రమాణ‌స్వీకారం...నిర‌స‌న‌ల జోరు
X
అమెరికా 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయనున్న సంద‌ర్భంగా అమెరికాలో విభిన్న‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంది. డొనాల్డ్ ట్రంప్‌ కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కారులు న్యూయార్క్‌లో ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. ట్రంప్ వ్యాపార కేంద్రం అయిన ట్రంప్‌ ట‌వ‌ర్ ముందే కాబోయే అధ్య‌క్షుడికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. ఫాసిస్టు ట్రంప్‌ ను అధ్య‌క్షుడు కాకుండా ఆపాలంటూ ఆందోళ‌నకారులు ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శించారు. అమెరికాపై విద్వేషాలు పెంచే విధంగా ట్రంప్ వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ విమ‌ర్శ‌లు చేశారు. ప్ల‌కార్డులతో రోడ్ల‌పై ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తున్న నిర‌స‌న‌కారుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

మ‌రోవైపు ప్ర‌మాణ స్వీకారం కోసం డొనాల్డ్ ట్రంప్ వాషింగ్ట‌న్‌ కు చేరుకున్నారు. ఇవాళ క్యాపిట‌ల్ హిల్ బిల్డింగ్ ఆవ‌ర‌ణ‌లో ట్రంప్ ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం జ‌రుగుతుంది. అమెరికా మాజీ అధ్య‌క్షుడు అబ్రహాం లింకన్ ఉపయోగించిన బైబిల్‌ పై చేతిని ఉంచి ఆయన ప్రమాణం చేస్తారు. అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ నుంచి అందుకు ప్రత్యేకంగా లింకన్ బైబిల్‌ ను తెప్పించారు. చరిత్రాత్మకమైన ఆ బైబిల్‌ ను ఇదివరకు బరాక్ ఒబామా 2009లో - 2013లో తన ప్రమాణ స్వీకారానికి ఉపయోగించారు. అమెరికా ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయన చేత పదవీ ప్రమాణం చేయిస్తారు. కాగా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ చేత సుప్రీంకోర్టు న్యాయమూర్తి క్లారెన్స్ థామస్ పదవీ ప్రమాణం చేయిస్తారు. పెన్స్ తన ప్రమాణానికి ఇదివరకటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ ఉపయోగించిన బైబిల్‌ ను ఎంచుకున్నారు. ప్రమాణ స్వీకారానికి కేవ‌లం ఉభ‌య‌స‌భ‌ల స‌భ్యులు - సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు - మ‌రికొంత మంది ఆహ్వానితులు ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో పాల్గొంటారు. మౌంట్ వెర్న‌న్ స్క్వేర్‌ - ఆర్క్వీస్‌ - ఫెడ‌ర‌ల్ ట్ర‌యాంగిల్‌ - స్మిత్‌ సోనియా - పెంట‌గాన్ మెట్రో స్టాప్‌ల వద్ద ప్ర‌త్యేక భ‌ద్ర‌తా సిబ్బందిని ఏర్పాటు చేశారు. అతిథుల‌తో వాషింగ్ట‌న్ హోట‌ళ్లు అన్నీ నిండిపోయాయి.ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారతీయ అమెరికన్లు సహా వేలాది మంది హాజరుకానున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ట్రంప్ ఎన్నికల నినాదాన్ని ప్రమాణ స్వీకారోత్సవానికి థీమ్‌ గా నిర్ణయించారు.

వాషింగ్టన్ డీసీలో జరిగే ఈ కార్యక్రమానికి కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయడంతోపాటు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. నిర‌స‌న‌ల నేప‌థ్యంలో క్యాపిట‌ల్ బిల్డింగ్ చుట్టూ బ్యారికేడ్ల‌ను ఏర్పాటు చేశారు. క‌ట్టుదిట్ట‌మైన బందోబ‌స్తును మ‌ధ్య ప్ర‌మాణ స్వీకారోత్సవం జ‌ర‌గ‌నుంది. మ‌రోవైపు కొంద‌రు క్యాపిట‌ల్ హిల్ ద‌గ్గ‌రే ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించేందుకు సిద్ద‌మ‌వుతున్నారు. ఆర్లింగ్టన్ నేషనల్ సిమెటరీ వద్ద ట్రంప్ దివంగత సైనికులకు నివాళి అర్పించడం ద్వారా కార్యక్రమాలు మొదలవుతాయి. నేషనల్ మాల్ వద్ద ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో 30 మంది బాలీవుడ్ కళాకారులు ప్రదర్శన నిర్వహించనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/