Begin typing your search above and press return to search.

ట్రంప్ ను ఉరుకులు పరుగులు పెట్టించిన మీడియా

By:  Tupaki Desk   |   23 Jan 2017 4:32 AM GMT
ట్రంప్ ను ఉరుకులు పరుగులు పెట్టించిన మీడియా
X
మీడియా అంటే చాలు మండిపడే ట్రంప్.. అదే మీడియా పుణ్యమా అని ఉరుకులు పరుగులు పెట్టే ఉదంతం చోటు చేసుకుంది. తనను అంతగా హడావుడిగా చేసిన మీడియాకు ఆయన ఓపెన్ వార్నింగ్ ఇవ్వటమేకాదు.. నిబంధనల బంధనాలు ఇక మీడియాకు తప్పన్న విషయాన్ని ఆయన తేల్చి చెప్పేలా చేశారు. తన మాటలతో అందరిలోనూ హడావుడి పెంచే ట్రంప్.. అందుకు భిన్నంగా ఆయనే హడావుడి పడిపోవటం ఏమిటన్న విషయంలోకి వెళితే.. ఆసక్తికరమైన విషయమే కనిపిస్తుంది.

ట్రంప్ కు ఇంటెలిజెన్స్ వ్యవస్థలో భేదాభిప్రాయాలు ఉన్నట్లుగా మీడియాలో వచ్చిన వార్తల కారణంగానే తాను హుటాహుటిన సమావేశం కావాల్సి వచ్చిందంటూ సీఐఏ అధికారులతో భేటీ అయి ట్రంప్ చెప్పటం గమనార్హం. తనను ఇంతలా హడావుడి పడేలా చేసిన మీడియాకు బంధనాలు వేసే దిశగా ఆయన సీఐఏ సమావేశంలో చర్చ జరపటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్రు. సీఐఏ భేటీలో మీడియాకు వార్నింగ్ ఇవ్వటం ఏ మాత్రం సరైంది కాదన్న అభిప్రాయాన్ని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ తప్పు పట్టటం గమనార్హం.

ఇక.. సీఐఏతో సమావేశమైన ట్రంప్ మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏ యుద్ధం విషయంలో తీసుకోనంత సమయాన్ని ఉగ్రవాదులతో పోరాడే విషయంలో తీసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రపంచ భద్రతకు సవాలు విసురుతున్న ఐసిస్.. ఇస్లామిక్ ఉగ్రవాదంపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఉగ్రవాదులపై పోరాడే విషయంలో అమెరికాకు ఉన్న శక్తి.. సామర్థ్యాల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ట్రంప్.. ఇదే సరైన సమయమని వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ ఉగ్రవాదంపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని.. ఆ విషయం అమెరికా మరోసారి చేసి చూపించనుందని చెప్పటం చూస్తే.. రానున్న రోజుల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమన్న భావన కలగటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/