అఫిషియల్ః హెచ్1బీ వీసాలు ఇక కలే!

Thu Jan 12 2017 15:19:43 GMT+0530 (IST)

అగ్రరాజ్యం అమెరికలో ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉపయోగించే హెచ్1-బీ వీసా నిబంధనలు కఠినతరం చేయబోతున్నామనే వార్తల విషయంలో అధికారిక ప్రకటన వెలువడింది. అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అటార్నీ జనరల్ నామినీ జెఫ్ సెషన్స్ స్పష్టంచేశారు. హెచ్1బీ - ఎల్1 వీసాలను దుర్వినియోగం చేయకుండా చట్టాలను రూపొందిస్తామని చెప్పారు. మనం ఓపెన్ వరల్డ్ లో ఉన్నాం.. ఏ అమెరికన్ జాబ్ నైనా తక్కువ జీతానికి పనిచేసే మరో విదేశీయుడితో భర్తీ చేస్తామనుకుంటే అది పొరపాటే అవుతుంది అని సెషన్స్ ఇతర చట్టప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. మనకూ హద్దులు ఉంటాయి. మనం పౌరుల పట్ల నిబద్ధతతో వ్యవహరించాలి. ఆ దిశగా మీతో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది అని సెషన్స్ అన్నారు.

ఒబామా ప్రభుత్వం అమెరికా ఉద్యోగుల హక్కులను కాపాడటంలో విఫలమైంది. మరి మీరు ఏం చేయబోతున్నారు అని ఎంపీ గ్రాస్ లీ అనే ఎంపీ ఒకరు అటార్నీ జనరల్ సెషన్స్ ను ప్రశ్నించగా అమెరికన్లు హక్కులకోసం పాటు పడతామని స్పష్టం చేశారు. ఇది కచ్చితంగా స్థానిక అమెరికన్లపై వివక్ష చూపడమే అవుతుందని దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని సెషన్స్ చెప్పారు. గతంలో గ్రాస్ లీ - సెషన్స్ తోపాటు డిక్ డర్బిన్ అనే మరో సెనేటర్ కలిసి స్థానిక అమెరికన్లకు అనుకూలంగా హెచ్1బీ వీసా బిల్లును రూపొందించారు. ఇప్పటికే 50 మందికిపైగా లేదా కంపెనీలో 50 శాతానికిపైగా హెచ్1బీ వీసా ఉద్యోగులు ఉంటే.. అలాంటి కంపెనీలకు కొత్తగా హెచ్1బీ వీసా ఉద్యోగులను తీసుకొనే అవకాశం ఉండదని ఈ బిల్లు చెబుతోంది.

ఇదిలాఉండగా... యూఎస్ సెనేట్ కూడా ఓకే చెప్తే జెఫ్ సెషన్స్ అటార్నీ జనరల్ గా నియమితులవుతారు. అప్పుడు ఇమ్మిగ్రేషన్ సంబంధిత స్పెషల్ కౌన్సిల్ కూడా సెషన్స్ చూసే జస్టిస్ డిపార్ట్‌మెంట్ కిందకు వస్తుంది. ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి వివక్షరహిత - జాతీయత చట్టాలను ఈ శాఖ రూపొందిస్తుంది. నిజానికి ఇది వీసాల విషయంలో విదేశీయులపై వివక్ష లేకుండా చూసేందుకు ఏర్పాటైన విభాగమే అయినా.. అమెరికన్ల పట్ల కూడా పనిచేసే స్థలంలో వివక్ష లేకుండా చూడాల్సిన బాధ్యత దీనిపై ఉంటుంది. ఇప్పటికే స్థానిక అమెరికన్లను తొలగించి వారి స్థానంలో తక్కువ జీతానికి పనిచేసే హెచ్1బీ వీసాలున్న విదేశీయులను నియమిస్తున్నారు అని సెనెటర్ గ్రాస్‌లీ అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/