Begin typing your search above and press return to search.

పెళ్లాం పేరూ ట్రంప్ స‌రిగా రాయ‌లేరా?

By:  Tupaki Desk   |   20 May 2018 11:32 AM GMT
పెళ్లాం పేరూ ట్రంప్ స‌రిగా రాయ‌లేరా?
X
అమెరికా అధ్య‌క్షుడికి ఉండాల్సిన ఏ ల‌క్ష్మ‌ణాలు ట్రంప్ కు లేవ‌ని ఆయ‌న్ను ద్వేషించే వారు అదే ప‌నిగా వ్యాఖ్యానిస్తుంటారు. ఇందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న తీరు ఉంటుంద‌ని చెప్పాలి. పెద్ద బిజినెస్ టైకూన్ గా చెప్పే ట్రంప్ కు స‌రిగా రాయ‌టం కూడా రాద‌న్న విమ‌ర్శ‌ను ప‌లువురు చేస్తుంటారు. ఇందుకు త‌గ్గ‌ట్లే ఆయ‌న ట్వీట్ చేసే ట్వీట్ల‌లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ద‌ర్శ‌న‌మిస్తాయి. అంతేకాదు.. అర్థం లేని మాట‌ల్ని ఆయ‌న రాస్తుంటారు.

మిగిలిన ప‌దాల సంగ‌తి ఎలా ఉన్నా.. క‌ట్టుకున్న పెళ్లాం పేరును రాసే విష‌యంలోనూ ట్రంప్ త‌ప్పులు చేయ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. గ‌తంలో ఒక ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా భార్య మెలానియా చేతిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నాన్ని ట్రంప్ చేయ‌టం.. ఆమె చేతిని విదిలించుకోవ‌టం తెలిసిందే.

ఈ వీడియో వైర‌ల్ గా మారి ర‌చ్చ ర‌చ్చ‌గా మారింది. ఇదే రీతిలో త‌ర‌చూ ఏదో ఒక వార్త మెలానియా గురించి రావ‌టం.. ట్రంప్ ను టార్గెట్ చేసేలా ఉండ‌టం క‌నిపిస్తాయి. దీనికి త‌గ్గ‌ట్లే ట్రంప్ తీరు ఉంటుంది. ఇటీవ‌ల కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుప‌త్రిలో చేరిన మెలానియా.. శ‌నివారం ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇదే విష‌యాన్ని వెల్ల‌డిస్తూ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. మ‌న ఫ‌స్ట్ లేడీ మెలానీ మ‌ళ్లీ వైట్ హౌస్ లోకి రావ‌టం సంతోష‌క‌రమంటూ ట్వీట్ చేశారు. మెలానియా పేరును.. మెలానీ అంటూ ట్రంప్ రాయ‌టంపై ప‌లువురు త‌ప్పు ప‌ట్టారు. దీన్ని స్క్రీన్ షాట్స్ తీసి వైర‌ల్ చేస్తుండ‌టంతో ట్రంప్ త‌న ట్వీట్ ను డిలీట్ చేశారు. మెలానియా అంటూ స‌రిదిద్ది ట్వీట్ చేశారు. పెళ్లాం పేరు రాయ‌టం కూడా ట్రంప్ కు రాదా? అంటూ ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.