Begin typing your search above and press return to search.

ట్రంప్ కు ఉత్సాహాన్నిచ్చిన కొత్త సర్వే!

By:  Tupaki Desk   |   26 Aug 2016 4:27 AM GMT
ట్రంప్ కు ఉత్సాహాన్నిచ్చిన కొత్త సర్వే!
X
ఎప్పుడూ లేనంత కొత్తగా జరుగుతుంది - రసవత్తరంగా సాగుతుంది - అత్యంత టెన్షన్ ని కలిగిస్తుంది.. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు. స్థాయి మరిచిన విమర్శలు - రోడ్లపై నగ్న విగ్రహాలు - హద్దులు మరిచిన ఆరోపణలు.. ఇలా ముందుకుపోతుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార హోరు. ఎప్పుడూ లేనంతగా ప్రపంచం మొత్తం అమెరికా అధ్యక్ష ఎన్నికలవైపు చూస్తుందనే చెప్పాలి. దీనికి ఒకరకంగా డొనాల్డ్ ట్రంప్ హాట్ కామెంట్స్ అనికూడా అనుకోవచ్చు. మరోవైపు అగ్రరాజ్యం అనే ఆసక్తి ఎలా ఉన్నా... ఈ విషయంలో ట్రంప్ మాటలకు వ్యూస్ అలా పెరిగిపోతున్నాయి మరి. అయితే నిన్నటివరకూ కాస్త ఇబ్బందిపెట్టినట్లు అనిపించిన సర్వేలు తాజాగా ట్రంప్ కు కాస్త శుభవార్తనే చెప్పాయి.

తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబందించిన ఒక సర్వే... రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ పై డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ ఆధిక్యం క్రమంగా క్షీణిస్తోందని వెల్లడించింది! హిల్లరీ ఆధిక్యం క్షీణిస్తోంది అని అంటే... అది ట్రంప్ పై పెరుగుతుందనే అనుకుంటున్న తరుణంలో.. ట్రంప్ బ్యాచ్ ఫుల్ కుషీగా ఉన్నారట. "ఎకానమిస్ట్‌/యు గవ్‌" ఆన్‌ లైన్‌ సర్వే చెప్పిన లెక్కల ప్రకారం ట్రంప్‌ పై హిల్లరీ ఆధిక్యం మూడుశాతానికి తగ్గిందట. తమ అధ్యయనంలో 47 శాతం ఓటర్లు క్లింటన్‌ కు.. 44 శాతం మంది ట్రంప్‌ కు మద్దతుగా నిలిచారని ఈ సర్వే వెల్లడించింది. అయితే.. గతవారం సర్వేలో ట్రంప్‌ పై హిల్లరీ 6-7 శాతం ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.

కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా చైనాపై ట్రంప్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చైనాకు అమెరికాపైనా, అమెరికా నాయకత్వంపైన గౌరవం లేదని.. అయితే ఈ విషయంలో చైనాను తప్పుబట్టలేమని, నాయకత్వం అంటే గౌరవం పొందే స్ధాయిని తిరిగి నిలబెడతామని ట్రంప్ చెప్పారు. ఇప్పటికంటే ఎక్కువగా అమెరికన్లు గౌరవం పొందేలా తాను చేస్తానని.. అమెరికా కార్మికులకు ఇబ్బందులు కలిగించేది ఏ దేశమైనా తాము సహించబోమని ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే!