Begin typing your search above and press return to search.

ట్రంప్‌ కు షాక్.. స‌న్నిహితుడు అరెస్ట్‌

By:  Tupaki Desk   |   18 Jun 2018 4:22 AM GMT
ట్రంప్‌ కు షాక్.. స‌న్నిహితుడు అరెస్ట్‌
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ త‌గిలింది. త‌న‌కు అత్యంత స‌న్నిహితుడు.. త‌న ఎన్నిక‌ల ప్ర‌చార మేనేజ‌ర్ పౌల్ మాన‌ఫోర్ట్ ను జైలుకు త‌ర‌లించిన వైనం సంచ‌ల‌నంగా మారింది. సుదీర్ఘ‌కాలంగా రిప‌బ్లిక‌న్ పార్టీలో ప‌ని చేస్తున్న ఆయ‌న‌.. 2016లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ర‌ష్యా జోక్యంపై జ‌రుగుతున్న విచార‌ణ‌లో ఆర్థిక అంశాల‌కు సంబంధించిన ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.

మ‌నీ లాండ‌రింగ్ త‌ర‌హాలో కేసుల్ని ఆయ‌న‌పై న‌మోదు చేశారు. ఆయ‌న‌పై చేసిన అభియోగాల్ని మాన‌ఫోర్ట్ అంగీక‌రించ‌లేదు. కాకుంటే.. అమెరికాకు వ్య‌తిరేకంగా ప‌ని చేయ‌టం లాంటి ఆరోప‌ణ‌లు ఆయ‌న‌పై ఉన్నాయి. మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ప్ర‌స్తుతం జైల్లో ఉన్న ఆయ‌న‌కు ఒక ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాన్ని త‌గిలించి మ‌రీ హౌస్ అరెస్ట్ చేశారు. దీనిపై దేశాధ్య‌క్షుడు ట్రంప్ సైతం అసంతృప్తి వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

త‌న‌పై పెట్టిన కేసుల్లో తాను నిర్దోషిన‌ని మాన‌ఫోర్ట్ చెబుతున్నారు. అయితే.. ఆయ‌న‌కు ఇచ్చిన హౌస్ అరెస్ట్ బెయిల్ ను దుర్వినియోగం చేసిన‌ట్లుగా అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన న్యాయ‌మూర్తి ఆయ‌న్ను విచార‌ణ ఖైదీలు ఉండే జైలుకు త‌ర‌లించారు. ఈ సంద‌ర్భంగా న్యాయ‌మూర్తి స్పందిస్తూ.. తాము పెట్టిన న‌మ్మ‌కాన్ని మాన‌ఫోర్ట్ నిల‌బెట్టుకోలేదంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు తీవ్రంగా స్పందించారు. మాన‌ఫోర్ట్ ను ఎందుకు ల‌క్ష్యంగా చేసుకున్నారంటూ వారు సోష‌ల్ మీడియాలో పోస్టులు చేశారు.

ఇదిలా ఉంటే.. త‌న ఎన్నిక‌ల ప్ర‌చార మేనేజ‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన మాన‌ఫోర్ట్ ను జైలుకు త‌ర‌లించ‌టంపై ట్రంప్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఆయ‌న‌పై తీసుకున్న‌నిర్ణ‌యం స‌రైన‌ది కాద‌ని.. మాన‌ఫోర్ట్‌కు క‌ఠిన శిక్ష‌ను విధించిన‌ట్లుగా ఆయ‌న ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.ప్ర‌పంచంలోనే అత్యంత శ‌క్తివంత‌మైన దేశాధ్యక్షుడి ఎన్నిక‌ల ప్ర‌చార మేనేజ‌ర్ అరెస్ట్‌కావ‌టం.. జైల్లోకి వెళ్ల‌టం చూస్తే.. అమెరికా చ‌ట్టాలు ఎంత క‌ఠినంగా ఉంటాయో అర్థం చేసుకోవ‌చ్చ‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.