డెమోక్రాట్లపై ట్రంప్ ఫైర్..వారానికి 42వేల కోట్ల నష్టం

Sun Jan 21 2018 11:32:56 GMT+0530 (IST)

అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం మూతపడింది. వలసలు - వ్యయాలపై డెమోక్రాట్లు - రిపబ్లికన్ల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన నేపథ్యంలో సెనేట్‌లో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో ఐదేండ్లలో మొదటిసారిగా ప్రభుత్వ లావాదేవీలు నిలిచిపోయాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చి శనివారంతో ఏడాది పూర్తయింది. మొదటి సంవత్సర పాలన చివరికి ఇలా గందరగోళం నడుమ ముగిసింది. అమెరికా సెనేట్ లో జనవరి 19లోగా ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం నాడు చివరి నిమిషం వరకూ పలువురితో సంప్రదింపులు జరిపారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడానికి డెమోక్రాట్లే కారణమని ఆయన ఆరోపించారు. అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ తోపాటు ఇతర ప్రభుత్వ సంస్థల కోసం నిధులు మంజూరు చేసే స్వల్పకాలిక వినిమయ బిల్లును డెమోక్రాట్లతోపాటు కొందరు రిపబ్లికన్లు కూడా అడ్డుకున్నారు. పన్ను రాయితీలు ప్రకటించి తాము సాధించిన విజయాలను అడ్డుకొనేందుకే డెమోక్రాట్లు ద్రవ్య బిల్లును వ్యతిరేకించారని ట్రంప్ మండిపడ్డారు.అమెరికాలో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ లావాదేవీలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. సెనేట్ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించేంత వరకు పెంటగాన్ తోపాటు ఇతర ప్రభుత్వ సంస్థలకు నిధులు అందవు. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేసినా - ఆ కాలానికి వేతనం లభించదు. ఈ మూత కారణంగా ప్రభుత్వానికి వారానికి రూ.42వేల కోట్ల నష్టం వాటిల్లనుంది. విమానయానానికి అవసరమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ - ఆహార తనిఖీ - వైద్యం - వయోవృద్దుల ఆరోగ్య సంరక్షణ - జైళ్లు - తదితర అత్యవసర సేవల విభాగాలు మాత్రమే పనిచేయనున్నాయి. సామాజిక భద్రత విభాగం - పోస్టల్ సేవలు కూడా యథావిధిగా పనిచేస్తాయని అధికారులు తెలిపారు. కాగా జాతీయ పార్కులు - మ్యూజియంలు - చారిత్రక కట్టడాలున్న ప్రదేశాలు మూతపడుతాయి. పాస్ పోర్టులు - వీసాల జారీ నిలిచిపోనుంది. దీంతో పర్యాటకరంగం దెబ్బతింటుంది.

-ప్రభుత్వం మూత వల్ల కొన్ని కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోతాయి. అయితే మూత ఎక్కువ కాలం కొనసాగితే ఆ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు.

-అమెరికన్ సైనికులు తమకు నిర్దేశించిన ప్రదేశంలోనే విధులు నిర్వహిస్తారు. వారికి ఉత్తరాల బట్వాడా జరుగుతుంది.

- కనీసం 8.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు విధులకు దూరమవుతారు.

-ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ కు చెందిన 45500 మంది ఉద్యోగులు ఇంట్లోనే ఉండాలి.

-ఆరోగ్యం - మానవ సేవల విభాగంలో 80వేలమందికి పైగా ఉద్యోగులుండగా - వీరిలో సగం మంది ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది.

-అమెరికా నిఘా విభాగంలో 17 సంస్థలుండగా - వీటిలో అత్యధికభాగం మూతపడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

-ప్రభుత్వం మూతవల్ల ఏండ్లకొద్దీ సాగుతున్న తమ పరిశోధనలకు అంతరాయం ఏర్పడుతుందని జాతీయ ఆరోగ్య సంస్థలు పేర్కొన్నాయి.

-ప్రభుత్వం మూతపడినా ఉద్యోగులు వచ్చే వారం విధులకు హాజరు కావాల్సిందేనని పర్యావరణ పరిరక్షణ సంస్థ అధికారి ఆదేశించారు.

-సామాజిక భద్రత - గృహ నిర్మాణం - పట్టణాభివృద్ధి - విద్య - వాణిజ్యం - కార్మిక విభాగాలు పూర్తిగా మూతపడనున్నాయి.

-కాంట్రాక్టర్లు - ప్రైవేటు ఉద్యోగులు నష్టపోతారు. ఈ ఏడాది 4300 కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టులు కేటాయించారు. మూత కొనసాగితే కాంట్రాక్టర్లకు చెల్లింపులు నిలిచిపోతాయి.

-రిటైల్ రంగం దెబ్బతింటుంది.