Begin typing your search above and press return to search.

ఫస్ట్ ఫైల్ పై ట్రంప్ స్టాంప్ పడింది

By:  Tupaki Desk   |   22 Jan 2017 4:16 AM GMT
ఫస్ట్ ఫైల్ పై ట్రంప్ స్టాంప్ పడింది
X
అనుకున్నదే జరిగింది. మొదట్నించి చెప్పినట్లే ట్రంప్ చేశారు. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన వెంటనే.. ఒబామా కేర్ ను రద్దు చేస్తానని చెప్పినట్లే ట్రంప్ తాను అనుకున్న పనిని పూర్తి చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తన తొలిఫైల్ గా ఒబామా కేర్ ను రద్దు చేస్తూ సంతకం చేశారు. తన ప్రభుత్వ పాలసీలో భాగంగానే ఒబామా కేర్ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించినట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. ప్రమాణస్వీకార మహోత్సవం పూర్తి చేసుకున్న అనంతరం వైట్ హౌస్ కు చేరుకున్న ఆయన.. తన తొలి సంతకాన్ని ఒబామా కేర్ ను రద్దుచేసే ఫైల్ మీదన సంతకం పెట్టేసి.. తాను చెప్పిన అంశాల మీద తానెంత కచ్ఛితంగా ఉంటానన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. ఒబామా కేర్ తో పలు ప్రభుత్వ విభాగాలు.. ఏజెన్సీల మీద పడేభారం తగ్గుతుందన్న ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇరాన్.. ఉత్తర కొరియాల నుంచి వచ్చే ముప్పును దృష్టిలో ఉంచుకొని కొత్త మిసైల్ భద్రత వ్యవస్థను రూపొందించనున్నట్లుగా సిగ్నల్స్ ఇచ్చేశారు.

2009లో ఒబామా అమెరికా అధ్యక్షుడు అయ్యాక తన కార్యాలయం నుంచి తొలగించిన బ్రిటీష్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ విగ్రహాన్ని ట్రంప్ తన కార్యాలయంలో పెట్టించేశారు. అదే సమయంలో ఆఫీసులో మరికొన్ని మార్పులు చేయించారు. అదే సమయంలో ఒబామా పెట్టించిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ విగ్రహాన్ని తొలగించినట్లుగా వార్తలు రావటంతో.. దానికి వివరణ అన్నట్లుగా ఆ విగ్రహం ఆఫీసులోనే ఉందన్నవిషయాన్ని తెలియజేసేలా ట్విట్టర్ లో ప్రెస్ సెక్రటరీ ట్వీట్ చేశారు. అదే సమయంలో.. మీడియా ముందువాస్తవాలు తెలుసుకోవాలంటూ ట్వీట్ చేయటం గమనార్హం. మరోవైపు.. ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన 12గంటల వ్యవధిలోనే ఆయనకు 1.4 కోట్ల మంది ఫాలోయర్లుపెరగటం గమనార్హం.

ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన సందర్భంగా ట్రంప్ చేసిన ప్రసంగంపై మీడియా విమర్శనాస్త్రాల్ని ఎక్కు పెట్టింది. బ్యాట్ మన్ చిత్రంలోని విలన్ మాదిరి ట్రంప్ మాట్లాడినట్లుగా పలు మీడియా సంస్థలు వ్యాఖ్యానించాయి. మరోవైపు ట్రంప్ ప్రమాణాన్ని వ్యతిరేకిస్తూ.. పెద్ద ఎత్తున నిరసనలు జరగటంతో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంలో పోలీసులపై రాళ్ల దాడి జరిగింది. పలు దుకాణాలపై దాడులకు దిగటంతో వాషింగ్టన్ డీసీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/