ట్రంప్ మనోళ్లను భలే గౌరవించేస్తున్నాడే

Thu Sep 14 2017 13:12:34 GMT+0530 (IST)

డొనాల్డ్ ట్రంప్..అమెరికా అధ్యక్షుడు - ప్రపంచంలోని పలు దేశాలకు ఆయనో పీడకల. భారతీయ టెకీలకు కూడా! అయితే అలాంటి వ్యక్తిత్వం గల ట్రంప్‌కు ఇప్పుడు అత్యంత ప్రీతిపాత్రులు ఎవరంటే భారతీయులే అంటున్నారు. కీలకమైన పదవులు భారతీయులకు కట్టబెడుతున్న తీరే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. కీలకమైన ఐక్యరాజ్యసమితిలో అగ్రరాజ్యం ప్రతినిధిగా భారతీయ మూలాలున్న నిక్కీహేలీని నియమించిన ట్రంప్ అదే రీతిలో పలు కీలక పదవులను ఇండియన్లకు కట్టబెడుతున్నారు. తాజాగా అలాంటి నియామకమే ఒకటి జరిగింది.  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కమ్యూనికేషన్స్ విభాగం బృందంలో భారత సంతతి వ్యక్తి రాజ్ షాకు కీలక బాధ్యతలు అప్పగించారు.తనకు డిప్యూటీ అసిస్టెంట్ గా పనిచేసిన షాను ఇప్పుడు కమ్యూనికేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ గా ట్రంప్ నియమించినట్టు వైట్ హౌస్ తెలిపింది.

ప్రవాస భారతీయుడైన రాజ్ షా డొనాల్డ్ ట్రంప్ కు సహచరుడు. ఈ ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ట్రంప్ వెంట ఉన్న అతికొద్ది మందిలో షా (32) ఒకరు.అధ్యక్షుడు ట్రంప్ కు రాజ్ షా డిప్యూటీ అసిస్టెంట్ గా సేవలు అందించడంతోపాటు ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీగా పనిచేస్తారని వైట్ హౌస్ పేర్కొంది. తన కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా హోప్ హైక్ ను ట్రంప్ నియమించారు. ఈయన గతంలో ట్రంప్ కు అసిస్టెంట్ గా - అంతర్గత కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా పనిచేశారు. గుజరాత్‌కు చెందిన రాజ్ షా కుటుంబం 1980లో అమెరికాకు వలసవెళ్లింది. అమెరికాలోని కనెక్టికట్ ప్రాంతంలోనే రాజ్ షా పుట్టి పెరిగారు.

ఇదిలాఉండగా...రెండ్రోజుల క్రితమే అమెరికా దౌత్య కార్యాలయంలో భారతీయ అమెరికన్ కు కీలక పదవి దక్కింది. న్యాయవాది మనీషాసింగ్ కు స్టేట్ డిపార్టుమెంట్ లో కీలకమైన పరిపాలన బాధ్యతలు - ఆర్థిక దౌత్య విధులను అప్పగించారు. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మనీషాను నియమించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన మనీషాసింగ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి ఫ్లోరిడాకు వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. సభ ఆర్థికవ్యవహారాలకు అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న చార్లెస్ రివ్ కిన్ స్థానంలో మనీషాసింగ్ ను నియమించారని సెనేట్ లో ముఖ్య కౌన్సిల్ - సీనియర్ పాలసీ అడ్వయిజర్ డాన్ సులీవన్ నిర్ధారించారు. ఈ మేరకు సెనేట్ కు సోమవారం నామినేషన్ ను పంపారు. మనీషా బ్యూరో ఆఫ్ ఎకనామిక్ - ఎనర్జీ - బిజినెస్ వ్యవహారాల విభాగాలకు డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా - విదేశీ సంబంధాల కమిటీకి సీనియర్ సహాయకురాలిగా పనిచేశారు.