Begin typing your search above and press return to search.

వందల కోట్లు ఖర్చు చేస్తున్న ట్రంప్.. హిల్లరీ

By:  Tupaki Desk   |   22 Oct 2016 8:28 AM GMT
వందల కోట్లు ఖర్చు చేస్తున్న ట్రంప్.. హిల్లరీ
X
మనదేశంలో జరిగే ఎన్నికలకు.. అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కొన్ని అంశాల్లో పోలికే ఉండదు. ఎన్నికల సంఘం నిర్దేశించే ఎన్నికల ఖర్చుకు.. అభ్యర్థులు వాస్తవంగా పెట్టే ఎన్నికల ఖర్చుకు మధ్య వ్యత్యాసం భూమికి.. ఆకాశానికి మధ్య ఎంత దూరం ఉంటుందో అంత దూరం ఉంటుంది. మన దేశంతో పోలిస్తే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీ పడే వాతు త‌మ‌ ఖర్చుపై చాలా స్పష్టంగా ఉంటారు.

తాము సేకరించే నిధుల విషయంలోనూ.. ఖర్చు పెట్టే అంశంపైనా వారు ఓపెన్ గా ఉంటారు. మనకు మాదిరి.. దాచి పెట్టటం.. గుట్టుగా ఖర్చు చేయటం లాంటివి తక్కువ. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. రోజులు గడుస్తున్న కొద్దీ ఎన్నికల ఖర్చు భారీగా పెరిగే ధోరణి మన దగ్గర కనిపిస్తుంది. ఇలాంటి తీరే.. ఇప్పుడు అమెరికాలోనూ కనిపిస్తుంది.

ఇప్పటివరకూ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారీ ఎత్తున ఖర్చు చేస్తున్న ఎన్నికలు ఇవేనని కొందరు చెబుతున్నారు. వందలాది కోట్ల రూపాయిల్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయటమే కాదు.. వివిధ వర్గాల నుంచి ఆ మొత్తాల్ని విరాళాల రూపంలో సేకరించటం కనిపిస్తుంది. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఒక్క సెప్టెంబరు నెలలోనే రూ.477 కోట్లు ఖర్చు చేయగా.. డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ రూ.561 కోట్లు ఖర్చు చేశారు.

ఇంత భారీగా ఖర్చు చేసిన తర్వాత సెప్టెంబరులో తన వద్ద ఇంకా రూ.236 కోట్ల విరాళాలు ఉన్నట్లు ట్రంప్ పేర్కొనగా.. హిల్లరీ రూ.406 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. ఓపక్క భారీగా ఖర్చుచేస్తూనే మరోవైపు అదే స్థాయిలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన వైనం ఇద్దరు అభ్యర్థుల్లో కనిపిస్తుంది. నెలలోనే వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ ఇద్దరు అభ్యర్థులు.. తమ ఎన్నికల కోసం పెట్టిన మొత్తం ఖర్చు లెక్క తీస్తే.. వేల కోట్లకు చేరటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/