Begin typing your search above and press return to search.

ట్రంప్ అంతరిక్ష బాంబు..షాక్ లో ప్రపంచం

By:  Tupaki Desk   |   21 Jun 2018 6:56 AM GMT
ట్రంప్ అంతరిక్ష బాంబు..షాక్ లో ప్రపంచం
X
స్టార్ వార్స్ పేరుతో అంతరిక్షంలో చేసే యుద్ధాలు - వివిధ ప్రయోగాలపై ఇప్పటికే సినిమాలు వచ్చాయి. అప్పట్లో అమెరికా ప్రభుత్వం స్టార్ వార్స్ పేరుతో అంతరిక్షంలో నిఘాపై ఓ వ్యవస్థకు బీజం వేసింది. శత్రుదేశాల నుంచి రక్షణ పొందేందుకు అమెరికా ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రయత్నించి ఊరుకుంది.

అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతరిక్ష భద్రతకు ఆదేశాలిచ్చారు. రష్యా - చైనాలు తమ మిలటరీ అవసరాల కోసం అంతరిక్ష రంగాన్ని వాడుకుంటున్న నేపథ్యంలోనే అమెరికాకు కూడా అంతరిక్ష దళం ఏర్పాటు చేయాలని సూచించారు. మిలటరీ విభాగంలో ప్రత్యేక ‘స్పేస్ ఫోర్స్’ను ఏర్పాటు చేయాలని రక్షణ శాఖను కోరారు. భవిష్యత్తులో యుద్ధమంటూ జరిగితే అంతరిక్షమే కేంద్రంగా జరుగుతుందని.. స్పేస్ ఫోర్స్ ఉంటే అంతరిక్షం నుంచే శత్రుదేశాలు ప్రయోగించే క్షిపణులను నాశనం చేయడం.. ప్రతిదాడులకు ఈ అంతరిక్ష దళం ఉపయోగపడుతుందని ట్రంప్ ఆలోచన చేశారు.

అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమవుతోంది. 1967లో అమెరికా - రష్యాతో పాటు వందదేశాలు అంతరిక్ష పరిరక్షణ ఒప్పందం చేసుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం అంతరిక్ష రక్షణకు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టరాదు. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి అమెరికాకు స్పేస్ ఫోర్స్ ఏర్పాటు చేస్తుండడంతో మరో ప్రచ్చన్న యుద్ధానికి నాంది పడబోతోందని అంతటా ఆందోళన నెలకొంది.

అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక పెద్ద కథే ఉంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ ‘తమ దేశం హైపర్ సోనిక్ గ్లైడడ్ వెహికల్ పేరుతో తయారు చేసుకున్న సరికొత్త అంతరిక్ష ఆయుధ వ్యవస్థ నుంచి ఆయుధాలను ప్రయోగిస్తే రాడర్ వ్యవస్థల కళ్లుగప్పి అంతరిక్షంలో ప్రయాణించి శత్రుదేశాలపై ఈజీగా దాడులు చేయగలవని’ ప్రకటించారు.

ఇక చైనా కూడా ఉపగ్రహం సాయంతో ఇతర ఉపగ్రహాలను - క్షిపణులను పేల్చివేసేందుకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేసి ,పరీక్షలు నిర్వహించింది. ఈ రెండు పరిణామాలు తమ దేశ భద్రతకు చేటు తెచ్చేవని అమెరికా భావిస్తోంది. అందుకే ట్రంప్ అంతరిక్ష ఫోర్స్ కు తాజాగా ఆదేశాలిచ్చారు.