Begin typing your search above and press return to search.

పనికిమాలిన దేశాల‌తో ప్ర‌మాదం..లేపేయాల్సిందే

By:  Tupaki Desk   |   20 Sep 2017 6:47 AM GMT
పనికిమాలిన దేశాల‌తో ప్ర‌మాదం..లేపేయాల్సిందే
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ త‌న ఆగ్ర‌హ‌రూపం ప్ర‌ద‌ర్శించారు. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో ట్రంప్‌ తన తొలి ప్రసంగం చేసిన సంద‌ర్భంగా ఉగ్ర‌వాదులు, ఆయా దేశాల‌పై విరుచుకుప‌డ్డారు. అమెరికాను అగ్రస్థానంలో నిలబెడతామని ధీమా వ్య‌క్తం చేసిన ట్రంప్ తాము ఎప్పటికీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోబోమని వివరణ ఇచ్చారు. అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారిని అమెరికా నుంచి తరిమేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. టెర్రరిజం ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తోందని, టెర్రరిజంపై ప్రపంచ దేశాలన్నీ ఏకమై అణచివేయాలని ట్రంప్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇస్లామిక్‌ టెర్రరిజంపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు.

కొన్ని పనికిమాలిన దేశాలతో ప్రపంచానికే ముప్పు పొంచి ఉందని, టెర్రరిజం అణచివేతకు మరిన్ని కఠిన చట్టాలు తెస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ స్ప‌ష్టం చేశారు. రోగ్‌ దేశాలతో ప్రపంచానికే ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు. ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదుల్ని పెంచి పోషించే దేశాల భరతం పట్టాల్సిందేనని, వాటిని గెంటేయాల్సిందేనని ట్రంప్ తీవ్రస్వరంతో పిలుపునిచ్చారు. ‘ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న, నిధులను సమకూరుస్తున్న, వారిని పెంచి పోషిస్తున్న దేశాల నిజస్వరూపం బయట పట్టాల్సిందే. ఉగ్ర కృత్యాలకు వాటిని బాధ్యులుగా చేయాల్సిందే’ అని ప్రపంచ దేశాలకు స్పష్టం చేశారు. అరాచక పరిస్థితులకు కారణమవుతున్న వారికి మద్దతిస్తోదంటూ పాకిస్తాన్‌పై ఇటీవలే నిప్పులు చెరిగిన డొనాల్డ్ ట్రంప్ ఐరాసలో చేసిన హెచ్చరికకు మరింత ప్రాధాన్యత చేకూరింది. ఐరాసలో తొలిసారిగా మాట్లాడిన ట్రంప్ ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించే దేశాలన్నీ చేతులు కలపాలన్నారు. అలాగే ఉగ్రవాదానికి ప్రేరణగా పనిచేస్తున్న ఇస్లామిక్ మిలిటెంట్లనూ వదలడానికి వీల్లేదన్నారు.

అమెరికాకు, అలాగే ప్రపంచానికే ముప్పుగా పరిణమించిన ఇస్లామిక్ తీవ్రవాదాన్ని నిలువరిస్తామని, దాని కుత్సితాలను తిప్పికొడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉద్ఘాటించారు. ఉగ్రవాదానికి, ఉగ్రవాద సిద్ధాంతాలకు ఏ దేశం కూడా కొమ్ముకాయడానికి వీల్లేదని తేల్చిచెప్పిన ట్రంప్ ‘ఇలాంటి వాటిని గెంటేయాల్సిందే. వాటి నిజస్వరూపాన్ని బట్టబయలు చేయాల్సిందే’ అని అన్నారు. అల్‌ఖైదా, హిజ్‌బొల్లా, తాలిబన్ తదితర ఉగ్రవాద సంస్ధలను అన్ని విధాలుగానూ కట్టడి చేయాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. అమెరికా, దాని మిత్ర దేశాలు ఈ దిశగానే కృషి చేస్తున్నాయన్నారు. ఇలాంటి సంస్థలు మళ్లీ వేళ్లూనుకోకుండా గట్టి నిరోధక చర్యలనే చేపడుతున్నామన్నారు. అఫ్గానిస్తాన్, దక్షిణాసియాల్లో అమెరికా అమలు చేస్తున్న కొత్త వ్యూహాన్ని గుర్తు చేసిన ట్రంప్ ‘ఇక నుంచి సైనిక చర్యలకు సంబంధించి తుది నిర్ణయాలు తీసుకునేది రాజకీయ నాయకులు కాదు..మా భద్రతా ఏజెన్సీలే’నని తెలిపారు. తాలిబన్, ఇతర ఉగ్రవాద సంస్థలపై జరిపే పోరాట వ్యూహాలనూ మార్చేశానని చెప్పిన ట్రంప్ ‘అమెరికాను అద్వితీయ శక్తిగా మార్చడమే నా జాతీయ విధానం’అని పునరుద్ఘాటించారు. ప్రపంచ దేశాలన్నీ తమతమ సొంత ప్రయోజనాల కోసం పనిచేసుకోవచ్చునని అయితే ఉమ్మడి శత్రువు ఎదురైనప్పుడు మాత్రం ఉమ్మడి బాధ్యతగా కలిసిరావాలన్నారు. ఈ సందర్భంగా కొత్త ప్రపంచ వ్యవస్థకు సంబంధించి తన ఆలోచనలనూ ఆయన ఆవిష్కరించారు. అమెరికా ప్రజలకు సంబంధించిన అన్ని హక్కులనూ నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, దేశాధ్యక్షుడిగా ఇదే తన ప్రాథమిక బాధ్యత అని ట్రంప్ తెలిపారు.