Begin typing your search above and press return to search.

అక్రమవలసదారులపై ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   18 May 2018 12:53 AM GMT
అక్రమవలసదారులపై ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
X
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు మనుషులు కాదని.. వారు జంతువుల్లాంటివారని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా వలస చట్టాలు మూగబోవడం వారికి కలిసివస్తున్నదని పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో కాలిఫోర్నియా, మెక్సికో ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ట్రంప్‌ మాట్లాడారు. ‘అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న కొందరిని మనం దేశం నుంచి బలవంతంగా బయటకు పంపాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత ఉద్ధృతంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇలా అక్రమంగా నివసించేవాళ్లు మనుషులు కాదు.. జంతువులు’ అంటూ తన ఆక్రోషాన్ని వెళ్లగక్కారు.

త‌న కామెంట్లకు గ‌తకాలం నాటి పాల‌కుల‌ను ట్రంప్ నిందించారు. వలస చట్టాలు బలహీనంగా ఉండటం వల్లే వారంతా దేశంలోకి అక్రమంగా ప్రవేశించారన్నారు. అలాంటి వారిని గుర్తించి అరెస్ట్‌ చేస్తున్నా పెద్దగా మార్పు రావడం లేదన్నారు. బలహీనంగా ఉన్న అమెరికా వలస చట్టాలను తక్షణం కఠినతరం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. అమెరికా-మెక్సికో సరిహద్దు ద్వారా నిర్ణీత సంఖ్యలో మాత్రమే వలసదారులను అనుమతించేలా చట్టాలు తయారు చేయాలని సూచించారు. చట్టప్రకారం మాత్రమే అమెరికాకు వలస రావాలని ఇతర దేశాల ప్రజలను కోరారు. వైట్‌హౌస్‌ నివేదిక ప్రకారం రోజుకు వెయ్యిమంది, ఏడాదికి మూడు లక్షలకు పైగా అక్రమంగా అమెరికాలోకి వలస వస్తున్నారు.

ఇదిలాఉండ‌గా...వచ్చేనెల అమెరికా అధ్యక్షుడితో భేటీకి తాము హాజరుకాబోమని ఉత్తరకొరియా బెదిరింపులకు దిగుతుండడంపై డొనాల్డ్‌ ట్రంప్‌ జాగ్రత్తగా స్పందించారు. అణునిరాయుధీకరణ కోసం అమెరికా తమపై ఒత్తిడి తెస్తున్నదని ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడితో తమ దేశ అధ్యక్షుడు చర్చలకు రాబోరని ఉత్తరకొరియా బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్‌ మాట్లాడుతూ.. సింగపూర్‌లో వచ్చేనెల 12న కిమ్‌తో జరిగే చారిత్రక సమావేశాన్ని రద్దు చేసుకుంటామని ఉత్తరకొరియా బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు. ‘బెదిరింపులకు సంబంధించి మాకు ఎలాంటి సమాచారం లేదు. ఏం జరుగుతుందో చూడాలి. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని తెలిపారు. బుధవారం ఉజ్బెకిస్థాన్‌ ప్రెసిడెంట్‌ షావకాత్‌ మిరోమోనోవిచ్‌ మిచిజియోయెవ్‌ను వైట్‌హౌస్‌లోకి స్వాగతం పలికిన సందర్భంగా ట్రంప్‌ మీడియాతో మాట్లాడారు. ‘మేం ఇప్పటివరకు ఎలాంటిది చూడలేదు. ఏం వినలేదు కూడా. ఏ జరుగుతుందో చూస్తాం.. అదేమైనా సరే’ అని చెప్పారు. అణునిరాయుధీకరణను సమర్థిస్థారా అని ప్రశ్నించగా అవునని సమాధానం చెప్పారు.