Begin typing your search above and press return to search.

ఇరాన్ టు చైనా.. అదిరిపోయే ట్రంప్ వ్యూహం

By:  Tupaki Desk   |   25 Jun 2019 9:16 AM GMT
ఇరాన్ టు చైనా.. అదిరిపోయే ట్రంప్ వ్యూహం
X
ప్రపంచపెద్దన్న అమెరికా ప్లాన్లు మామూలుగా లేవు. ఎక్కడ ఏ దేశంలో అలజడి రేగినా ఆ దేశంలోకి ప్రవేశించి యుద్ధోన్మాదంతో చెలరేగిపోయే అమెరికా ఇప్పుడు ట్రంప్ అధ్యక్షుడయ్యాక మాత్రం పూర్తిగా మారిపోయింది. కేవలం అమెరికా ఫస్ట్.. ఆ తర్వాతే ప్రపంచం అంటోంది. స్వతహాగా బిజినెస్ మ్యాన్ అయిన ట్రంప్ ఈ మేరకు అమెరికన్ల ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తూ చైనా, భారత్ సహా ఇతర దేశాల వారికి అమెరికాలో ఉద్యోగాలు రాకుండా.. లాభాలు దక్కకుండా చేస్తున్నారు. ట్రంప్ చర్యలు అమెరికన్లకు సంతోషాన్నిస్తుండగా.. ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలను మాత్రం కుదేలుచేస్తున్నాయి.

తాజాగా ఇరాన్ తో కయ్యానికి కాలుదువ్వుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశం అణ్వయాదులు వీడాలని ఆంక్షలు పెట్టాడు. ఆ దేశం చమురు కొనవద్దని ఆదేశాలు జారీ చేశాడు. అయితే చైనాతోనూ వాణిజ్య యుద్ధం చేస్తున్న ట్రంప్ ఇప్పుడు ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడానికి దాని ఆయువు పట్టుపై కొడుతున్నారు. చైనా 91శాతం చమురును ఇరాన్ సహా గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీనికోసం హర్మూజ్ జలసంధి గుండా తమ నౌకలను తీసుకువెళుతుంది. అయితే ఇరాన్ తో యుద్ధం దరిమిలా అమెరికా ఇక్కడ నౌకల భద్రతకు భారీగా సైన్యాన్ని మోహరించింది. అన్ని దేశాల నౌకలకు కాపలా కాస్తోంది.

అయితే తాజాగా ట్రంప్ ట్వీట్ చేశారు. చైనా, జపాన్ దేశాలు చమురును తీసుకెళుతూ లాభపడుతుండగా.. తామెందుకు ఉచితంగా ఈ హర్మూజ్ జలసంధిలో వాటికి రక్షణగా నిలబడాలని.. ఇక నుంచి ఈ మార్గంలో ఆ దేశాల వారే నౌకలను రక్షించుకోవాలని.. ఈ ప్రమాదకర ప్రయాణంలో మాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు..

ప్రపంచంలోనే అత్యధిక ఇంధనాన్ని గల్ఫ్ దేశాలు, అమెరికా ఉత్పత్తి చేస్తున్నాయి. ఇక చైనా 91శాతం, జపాన్ 62శాతం చమురును గల్ఫ్ దేశాల గుండానే తీసుకుంటున్నాయి. దీంతో ఇక్కడ అమెరికా చేతులెత్తేస్తే చైనా, జపాన్ లకు కష్టమే. వారికి చమురు సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతాయి. ఇప్పటికే అమెరికా వాణిజ్య యుద్ధంతో కుదేలైనా చైనా.. ఇప్పుడు అమెరికా- ఇరాన్ యుద్ధం జరిగితే.. హర్మూజ్ జలసంధిలో రక్షణ వదిలేస్తే చైనాకు చమురు దిగుమతి లేక మరింత ఆర్థిక వ్యవస్థ పతనమవుతుంది.

ఇప్పుడు చైనాను దెబ్బతీసేందుకే ఇరాన్ తో యుద్ధానికి.. అక్కడ రక్షణను వదిలేస్తున్నారు ట్రంప్. దీనివల్ల ఉద్రికత్తలు పెరిగి చైనా చమురు ట్యాంకర్లకు బీమా రేట్లు పెరిగి.. సరఫరా వ్యయాలు భారీగా పెరుగుతాయి. ఇది చైనా ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం.ఇక సొంతంగా నౌకలను కాపాడుకోవడానికి చైనాకు పర్షియన్ జలాల్లో నౌకాదళం మోహరించి లేదు. దీంతో ఎటూ చూసినా చైనాకు దెబ్బలాగానే పరిస్థితి ఉంది.

ఇక భారత్ ఇప్పటికే చమురు నౌకలను కాపాడుకునేందుకు ఆరేబియా సముద్రంలో ‘ఆపరేషన్ సంకల్ప్ ’ పేరిట భారత నౌకదళాన్ని రక్షణగా రంగంలోకి దింపింది. దీంతో ట్రంప్ హెచ్చరికలు కేవలం చైనా, జపాన్ లకే వర్తిస్తాయి. వాటి ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడనుంది.