ట్రంప్ గోడకు మీరూ డిజైన్లు ఇవ్వొచ్చు

Tue Mar 21 2017 10:04:25 GMT+0530 (IST)

ఎన్నికల హమీల్లో చెప్పినట్లు అమెరికా - మెక్సికో మధ్య గోడ కట్టేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శరవేగంగా సిద్ధమవుతున్నారు. మెక్సికోతో ఉన్న సరిహద్దు పొడవునా అందమైన పెద్ద గోడను నిర్మించడానికి కసరత్తు చేస్తున్నారని ఆయన పాలనా యంత్రాంగం ప్రకటిస్తూ ఇందు కోసం డిజైన్లు ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే ఈ గోడకు ఉండవలసిన లక్షణాలను వెల్లడించింది. అమెరికా చరిత్రలోనే ప్రభుత్వం నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టుల్లో ఒకటిగా ఈ ప్రాజెక్టు నిలిచిపోనుంది. ఈ గోడ చాలాఎత్తుగా గంభీరంగా చూచేవారికి కన్నులపండువగా ఉండాలని కాంట్రాక్టర్ల కోసం జారీ చేసిన నోటీసులో కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ పేర్కొంది. కనీసం 18 అడుగుల ఎత్తుతో డిజైన్లు ఉండాలని అధికారులు పేర్కొన్నారు. ఈ గోడ చాలా ఎత్తుగా ఎవరూ ఎక్కడానికి వీలులేకుండా ఈ గోడలోకి ఏ పరికరమూ చొరబడకుండా గట్టిగా ఉండాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నారట. ఇలా అనేక మిలియన్ డాలర్ల వ్యయంతో కూడిన ఈ గోడ నిర్మాణ ప్రాజెక్టు వేలం ప్రక్రియను ప్రారంభించడానికి ట్రంప్ పాలనా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.

మెక్సికోతో అమెరికాకు 3100 కిలోమీటర్ల పొడవు సరిహద్దు ఉన్నప్పటికీ 1600 కిలో మీటర్ల పొడవున గోడను నిర్మించనున్నారు. మిగతా భాగంలో ప్రకృతి సిద్ధమైన ఆటంకాలు వలసదారులకు అడ్డుగోడగా ఉన్నాయి. ఎక్కడానికి ఉపయోగించే అధునాతనమైన గ్రాప్లింగ్ హుక్ లు వినియోగించేందుకు వీలులేకుండా గోడను నిర్మించాలని సూచించారని సీఎన్ ఎన్ తెలిపింది. ఈ గోడ నిర్మాణానికి ఉపయోగించే సామగ్రి అంతా సాధ్యమైనంత వరకు అమెరికాలో తయారయినదే ఉండాలని అధికారులు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ ఇచ్చిన ప్రధాన హామీలలో ఈ గోడ నిర్మాణం ఒకటి. ఈ గోడకు అయ్యే వ్యయంలో మెక్సికో కొంత భరించాలని ట్రంప్ అంటున్నారు. అయితే ఏమాత్రం చెల్లించబోమని మెక్సికో అధ్యక్షుడు ఎన్ రిక్ పెనా నిటో పేర్కొంటున్నారు.

మరోవైపు అమెరికాను కెలికే విధంగా ప్రవర్తిస్తున్న ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ పై ట్రంప్ మండిపడ్డారు. కిమ్ జోంగ్ దుష్టుడిగా ప్రవర్తిస్తున్నారని  డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. ఉత్తర కొరియా ఒక రాకెట్ ఇంజన్ ను పరీక్షించిన కొన్ని గంటల తరువాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అమెరికా జాతీయ భద్రత అధికారులతో ఉత్తర కొరియా - చైనాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ మండిపడ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/