వికీలీక్స్ తో టచ్ లో ట్రంప్ తనయుడి చాటింగ్ కలకలం

Wed Nov 15 2017 00:32:09 GMT+0530 (IST)

అమెరికా ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలుగజేసుకున్నారనే వివాదం కొనసాగుతుండగానే...మరో కలకలం చోటుచేసుకుంది. అధ్యక్ష పోరులో  అనూహ్య రీతిలో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయానికి రష్యా కారణమైందని ఇప్పటికీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగా...దీనికంటే ఆశ్చర్యకరమైన మరో కోణం తెరమీదకు వచ్చింది. హిల్లరీ క్లింటన్‌ను విమర్శిస్తూ వికీలీక్స్ బట్టబయలు చేసిన విషయాలే ట్రంప్ గెలుపునకు కారణంగా మారినట్లు ఓ అధ్యయనంలో తేల్చిన ఉదంతం ఈ ఏడాది మొదట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే.దీనికి కొనసాగింపు అన్నట్లుగా తాజాగా రెండు కీలక ఘట్టాలు చోటుచేసుకున్నాయి. రష్యా వికీలీక్స్ సంయుక్తంగా ట్రంప్ పెద్దకుమారుడు డోనాల్డ్ జాన్ ట్రంప్ జూనియర్ సహకారంతో హిల్లరీ గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా హ్యాంకింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంటూ ‘ది అట్లాంటిక్' అనే వార్తా సంస్థ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కలకలం సద్దుమణగకముందే జూనియర్ ట్రంప్ తనంతగా తాను సంచలన ట్వీట్ ఒకటి బయటపెట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు 2016 సెప్టెంబర్ 9న వికీలీక్స్ ట్రంప్‌కు వ్యతిరేకంగా నడిచే వెబ్‌సైట్ గురించి సమాచారం ఇచ్చిందనే విషయాన్ని ఆయనే వెల్లడించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా ‘పుతిన్‌ట్రంప్.ఓఆర్‌జీ' అనే వెబ్‌సైట్ చాలా యాక్టివ్‌గా పనిచేస్తోందంటూ ఆ వెబ్‌సైట్ వివరాలు ఆఖరికి అత్యంత రహస్యంగా ఉండే పాస్‌వర్డ్‌ను సైతం ట్రంప్ కుమారుడికి చేరవేసింది. దీనికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. ఆ సైట్ సంగతి తాను చూస్తానని వెల్లడించారు.
 
మరోవైపు వికీలిక్స్ తో ట్రంప్ సంబంధాలు కొనసాగుతున్నాయని గత కొద్దికాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. వికీలిక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజేను ఆస్ట్రేలియాలో అమెరికా రాయబారిగా నియమించాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజా ఎపిసోడ్‌తో రష్యా వికీలిక్స్  ట్రంప్ గెలుపునకు సహకరించాయనే అంశానికి బలం చేకూరినట్లయింది. ఈ పరిణామంలో విపక్షాలు ట్రంప్‌పై విరుచుకుపడుతున్నాయి.

కాగా అమెరికా ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలుగజేసుకోలేదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. వియత్నాంలోని డానంగ్‌లో జరిగిన ఎపెక్ సదస్సులో భాగంగా పుతిన్‌తో రెండుమూడుసార్లు మాట్లాడినట్టు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా నుంచి ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో హనోయి వెళ్తుండగా మీడియాకు ఈ వివరాలను ట్రంప్ వెల్లడించారు. అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని పుతిన్ చెప్పారని తెలిపారు. తనను ఇదే అంశంపై చాలాసార్లు ప్రశ్నించానని.. కానీ అందుకు ఆయన ఒకటే సమాధానం ఇచ్చారని చెప్పారు. అయితే ట్రంప్ మాజీ సహాయకులు రష్యాలోని క్రెమ్లిన్ నుంచి సహకారం పొందారని అమెరికా విచారణ సంస్థలు పేర్కొంటున్నాయి. ట్రంప్ ఎన్నికల మాజీ ప్రచార చైర్మన్ పాల్ మనాఫోర్ట్ మనీ ల్యాండరింగ్ కుట్రలో గృహనిర్భందంలో ఉన్నారు. ఇది ఎన్నికల ప్రచారంలో రష్యాతో కుమ్మక్కవడమేనని విచారణ ప్రత్యేక అధికారి రాబర్ట్ ముల్లర్ చెప్తున్నారు.