Begin typing your search above and press return to search.

ప్రమాణస్వీకారంతోనే ట్రంప్ మొదలెట్టేశాడు!

By:  Tupaki Desk   |   21 Jan 2017 4:44 AM GMT
ప్రమాణస్వీకారంతోనే ట్రంప్ మొదలెట్టేశాడు!
X
అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తూనే రిప‌బ్లిక‌న్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పటివరకూ దేశ ప్రజల ప్రయోజనాల్ని పక్కనపెట్టి ప్రభుత్వాలు పని చేశాయని గ‌త పాల‌కుల‌పై మండిప‌డ్డ ట్రంప్ ఇక నుంచి తన హయాంలో అమెరికన్ కుటుంబాలు - అమెరికన్ కార్మికుల ప్రయోజనాలే పరమావధిగా విధానాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని భూమ్మీద లేకుండా చేస్తానని శపథం చేశారు. అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలను ఇంకా చేపట్టకముందే... మరోసారి కూడా తానే అధ్యక్షుడిగా ఎన్నికవటం ఖాయమంటూ డొనాల్డ్‌ ట్రంప్ తనదైన రీతిలో వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో తనకు విరాళాలు ఇచ్చిన వారికి ట్రంప్ వాషింగ్టన్‌ లో గురువారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాలుగేళ్ల‌ తర్వాత వచ్చే ఎన్నికల్లో కూడా మనం మళ్లీ విజయం సాధిస్తాం. ఎందుకంటే తొలిదఫాలో మన ప్రభుత్వం ఎంత బాగా పని చేసిందో ప్రజలు గమనించి మరోసారి మనకే పట్టం కడుతారు అని హర్షధ్వానాల మధ్య జోస్యం చెప్పారు.

గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌ ను ఓడించి సంచలన విజయం సాధించిన 70 ఏళ్ల‌ ట్రంప్... వాషింగ్టన్‌ లోని అమెరికా కాంగ్రెస్ (క్యాపిటల్) ఆవరణలో అమెరికా 45వ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమాన్ని వాషింగ్టన్‌ లోనే ఉన్న నేషనల్ మాల్‌ లో గుమిగూడిన దాదాపు 8 లక్షల మంది తిలకించారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఆయన చేత ప్రమాణం చేయించారు. చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న అబ్రహం లింకన్ బైబిల్‌ తోపాటు మరో బైబిల్ మీద తన ఎడమ చేతిని పెట్టి, ట్రంప్ ప్రమాణాన్ని చదివారు. అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షుడిగా మైక్ పెన్స్ ప్రమాణం చేశారు. ప్రమాణం అనంతరం దేశాధ్యక్షుడి హోదాలో తొలిసారిగా అమెరికన్లను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ప్రజల కలల్ని వెనక్కి తీసుకొస్తానని, వాటిని నెరవేరుస్తానని, అమెరికా - అమెరికన్ల ప్రయోజనాలే పరమావధిగా పని చేస్తానని పేర్కొన్నారు. విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తానని చెప్పారు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని భూమ్మీదే లేకుండా చేస్తానని శపథం చేశారు. వర్ణబేధాలకు తావు లేకుండా దేశాభివృద్ధిలో అమెరికన్లందరూ కలిసి కట్టుగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికన్లకు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఆస‌క్తిక‌ర పిలుపునిచ్చారు. "అమెరికా ప్రజలు తిరిగి దేశ పాలకులుగా మారిన రోజుగా జనవరి 20వ తేదీని గుర్తుంచుకుంటారు. ఇది మీ రోజు. ఇది మీ ఉత్సవం జ‌రుగుతున్న సంద‌ర్భం. అమెరికా మీ దేశం. ఈ రోజు మనం అధికారాన్ని వాషింగ్టన్ డీసీ (అమెరికా రాజధాని) నుంచి ప్రజలకు తిరిగి అందజేస్తున్నాం. మనదేశాన్ని పునర్నిర్మించే మహత్తర జాతీయ ప్రయత్నంలో నేడు మనం భాగస్వాములమవుతున్నాం. మనమందరం కలిసికట్టుగా అమెరికాతోపాటు ప్రపంచ గమనాన్ని నిర్ణయిద్దాం" అంటూ ట్రంప్ పిలుపునిచ్చారు.

16 నిమిషాలపాటు కొనసాగిన ట్రంప్ ప్రసంగంలోని మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే... "ఇప్పటివరకూ యూఎస్ క్యాపిటల్‌లో ఉండే ఒక చిన్నబృందమే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ప్రయోజనాలను తానే తీసుకున్నది. ప్రజలు ఖర్చులను భరిస్తే ఫలితాలను వాళ్లు తిన్నారు. సంపదలో ప్రజలకు వాటా లభించలేదు. దీనివల్ల రాజకీయనాయకులు సంపన్నులయ్యారు. కానీ, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ప్రజలు ఉద్యోగాలను కోల్పోయారు. దేశ పౌరులను కాపాడాల్సిన అధికార వ్యవస్థ ఆ బాధ్యతను వదిలిపెట్టి తన ప్రయోజనాల్ని కాపాడుకోవటంలో నిమగ్నమయ్యింది. ఈ పరిస్థితిని మార్చబోతున్నాం. వాషింగ్టన్ డీసీ నుంచి అధికారాన్ని అమెరికా ప్రజలకు బదిలీ చేయనున్నాం. అమెరికా విధ్వంసానికి ఇప్పుడే ఇక్కడే అడ్డుకట్ట వేస్తున్నాం. మనందరి ఒకే దేశం. మీ బాధ మనందరి బాధ. మీ కలలు మనందరి కలలు. మీ విజయాలు మనందరి విజయాలు. మనం ఒకే హృదయాన్ని, ఒకే ఇంటిని, ఒకే మహాద్భుతమైన భవిష్యత్తును పంచుకుంటాం. సవాళ్లను, కష్టాలను, ఆటంకాలను ఎదుర్కొంటూ మన పనుల్ని పరిపూర్తి చేసుకుందాం. వట్టిమాటలకు కాలం చెల్లింది. కార్యాచరణకు సమయం ఆసన్నమయ్యింది. దశాబ్దాలుగా అమెరికా పరిశ్రమలు తాము నష్టపోతూ విదేశీ పరిశ్రమలను బలోపేతం చేశాయి. సైనికంగా మన బలాన్ని తగ్గించుకుంటూ ఇతర దేశాల సైన్యాలకు సాయమందించాం. మన సరిహద్దులను పట్టించుకోవటం మానివేసి ఇతర దేశాల సరిహద్దులకు కావలి కాశాం. లక్షలాది మంది అమెరికన్లను నిరుద్యోగులుగా మారుస్తూ ఒకటితర్వాత ఒకటిగా ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మిగిలినవి ఇతర దేశాలకు తరలి వెళ్లిపోయాయి. అయినప్పటికీ ఇదంతా గతం. ప్రస్తుతం మనం భవిష్యత్తుపై దృష్టి పెడదాం. ఈ రోజు నుంచీ అమెరికాకే తొలి ప్రాధాన్యం ఇస్తూ మన దేశాన్ని ప్రభుత్వం పాలించనుంది. వాణిజ్యం, పన్నులు, వలస విధానం, విదేశాంగ విధానం... ఏదైనా కూడా అమెరికా కార్మికులు, అమెరికా కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగానే ఇక మీదట ఉంటాయి. నా శరీరంలో ఉన్న శక్తి అంతటినీ మీ కోసం పోరాడటానికే ఉపయోగిస్తా. రెండు నిబంధనలను మనం పాటిద్దాం... ఒకటి, అమెరికా ఉత్పత్తులను కొనండి, రెండు, అమెరికన్లనే పనుల్లోకి తీసుకోండి. మీరు మీ హృదయాన్ని దేశభక్తితో నింపినప్పుడు... అప్పుడిక ఎటువంటి వివక్షతలకు తావు ఉండదు. మనం నలుపు, తెలుపు, గోధుమ... ఏ రంగువాళ్లమైనా మన మహోన్నత జాతీయ జెండాకు ఒకే విధంగా వందనం సమర్పిస్తాం. అమెరికాను దేవుడు దీవించు గాక" అంటూ ట్రంప్ తన ప్రసంగాన్ని ముగించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/