యోగికి ట్రంప్ కంగ్రాట్స్ ట్వీట్..?

Tue Mar 21 2017 09:41:12 GMT+0530 (IST)

యూపీలో బీజేపీ సంచలన విజయం ఒక విశేషం అయితే.. కలలో కూడా ఎవరూ ఊహించని రీతిలో కరడుగట్టిన హిందుత్వవాది యోగి ఆదిత్యనాథ్ ను సీఎం పదవికి ఎంపిక చేయటం అందరిని షాకిచ్చేలా చేసింది. యోగిని సీఎంగా ఎంపిక చేసిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. యోగి పాలన ఏ విధంగా ఉండనుందన్న విషయంపై చర్చల మీద చర్చలు సాగుతున్నయి. పక్కా హిందుత్వవాది అయిన యోగి.. ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలకు పెట్టింది పేరు. మరి.. అలాంటి వ్యక్తి నేతృత్వంలో యూపీలోని ముస్లింల పరిస్థితి ఎలా ఉండనుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

గోరఖ్ నాథ్ మఠానికి ప్రధాన పీఠాధిపతిగా వ్యవహరించే యోగి.. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన యోగి.. పాలనా రథాన్ని ఏ తీరులో నడిపిస్తారన్నది ఇప్పుడు అందరిలో ఉత్కంఠ పెంచుతోంది. యోగి నియామకం మీద సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతున్న వేళ.. ఒక పోస్ట్ అందరి దృష్టి ఆకర్షిస్తోంది.

అతివాదానికి బ్రాండ్ అంబాసిడర్ గా.. వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. తాజాగా ఒక ట్వీట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ సారాంశం ఏమిటంటే.. యూపీ సీఎంగా యోగి ప్రమాణస్వీకారం చేయటాన్ని అభినందిస్తూ.. అమెరికా ఎన్నికల్లో తన గెలుపు మాదిరే.. యూపీలో యోగి దుమ్ము దులిపేశారంటూ ట్రంప్ అభినందిస్తున్నట్లుగా ట్వీట్లు తయారు చేశారు.

సృజనాత్మకతతో తయారు చేసిన ఈ ట్వీట్లను సోషల్ మీడియా మీదకు వదలటంతో.. నిజానిజాల్ని పెద్దగా పట్టించుకోని వారు.. దీన్నో కొత్త విషయంగా భావించి షేర్లు చేసేస్తున్నారు. ట్రంప్ పేరుతో తయారు చేసిన నకిలీ అభినందనల ట్వీట్లను సోషల్ మీడియాలోకి వదలటం.. వాటిని నిజమని నమ్మి తెగ షేర్ చేసుకోవటం ఇప్పుడు అందరి దృష్టిని తెగ ఆకర్షిస్తోంది. కాకుంటే.. ఆ ట్వీట్ నిజం కాదన్న నిజాన్ని నమ్మితే మంచిది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/